త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Ponguleti | త్వ‌ర‌లో మూడుల‌క్ష‌ల కొత్త పెన్ష‌న్లు.. ప్ర‌క‌టించిన మంత్రి పొంగులేటి

Minister Ponguleti | గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వదిలివెళ్లిన అప్పులు, పెండింగ్‌ బిల్లులను చెల్లిస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదవాడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బుధవారం సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్‌ అజారుద్దీన్, వాకిటి శ్రీహరి, అట్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

P

Telangana | Published On Sep 2, 2026, 6.44 pm IST

Minister Ponguleti | త్వ‌ర‌లో మూడుల‌క్ష‌ల కొత్త పెన్ష‌న్లు.. ప్ర‌క‌టించిన మంత్రి పొంగులేటి
Advertisement

Minister Ponguleti | గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వదిలివెళ్లిన అప్పులు, పెండింగ్‌ బిల్లులను చెల్లిస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదవాడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బుధవారం సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్‌ అజారుద్దీన్, వాకిటి శ్రీహరి, అట్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 3,475 రోజుల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంపై మోపిన అప్పుల భారం, పెండింగ్‌ బిల్లులను పరిష్కరిస్తూనే సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. సర్పంచులు, కాంట్రాక్టర్లు, వివిధ అభివృద్ధి పనులు చేసిన వారికి పెండింగ్‌లో ఉన్న అర్హమైన బిల్లులను చెల్లిస్తున్నామన్నారు. ‘‘పనులు చేయించి బిల్లులు చెల్లించకుండా వదిలింది ఎవరు? ఇప్పుడు ఆ బకాయిలను చెల్లిస్తున్నది ఎవరు? ప్రజలకు అన్నీ తెలుసు’’ అని అన్నారు. త్వరలో మూడు లక్షలకు పైగా పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.

రైతు సంక్షేమానికి రూ.1.76ల‌క్ష‌ల కోట్లు..

రైతు సంక్షేమానికి వెయ్యి రోజుల్లో సుమారు రూ.1.76 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్‌, విత్తనాలు, ఎరువుల సబ్సిడీలు, పంటలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని చెప్పారు. యువతకు ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం నిరాశపరిచిందని విమర్శించిన పొంగులేటి.. కాంగ్రెస్‌ ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. వేలాది ఉద్యోగాలను భర్తీ చేశామని, నియామకాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని తెలిపారు. పేద పిల్లలు ధనిక పిల్లలతో సమానంగా పోటీపడేలా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. డైట్‌, కాస్మెటిక్‌ ఛార్జీలు పెంచడంతో పాటు విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు.

4.5 లక్షల ఇళ్లు..

తొలి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని పొంగులేటి తెలిపారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. నాలుగు విడతల్లో చెల్లింపులు జరుగుతున్నాయని, చివరి విడత బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. కులం, మతం, పార్టీ, రాజకీయ అనుబంధం చూడకుండా అర్హత ఆధారంగానే ఇళ్లు ఇస్తున్నామన్నారు. రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్ల మంజూరుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఇల్లు, ఇంటి స్థలం లేని నిరుపేదలు జీవనోపాధికి దూరం కాకుండా వారు నివసిస్తున్న నియోజకవర్గ పరిధిలోనే ఇళ్లు కల్పించడమే లక్ష్యమన్నారు. ఇందుకోసం 20 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్నామని చెప్పారు. 16 నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు, టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, మరో నాలుగు చోట్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

పైర‌వీల‌కు తావు లేదు

తొలి దశలో ఒక్కో నియోజకవర్గానికి సుమారు 480 ఇళ్ల చొప్పున నిర్మిస్తామని, అదనంగా 20 శాతం కలిపి సుమారు 600 ఇళ్లను ప్రణాళికలో ఉంచామని తెలిపారు. లిఫ్ట్‌, ఇతర మౌలిక వసతులతో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు చెప్పారు. సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంతో, భూమిలో అన్‌డివైడెడ్‌ షేర్‌తో కూడిన ఇంటిని అర్హులైన మహిళ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తామన్నారు. ఇందిరమ్మ టవర్స్‌ ఇళ్లను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తామని, పైరవీలు, డబ్బు, రాజకీయ సిఫారసులకు తావులేదని మంత్రి స్పష్టం చేశారు. లక్కీ డ్రాలో పేరు వచ్చిన అనంతరం క్షేత్రస్థాయిలో నివాస పరిస్థితులను పరిశీలించి అర్హతను నిర్ధారిస్తామని చెప్పారు. ‘‘డబ్బు ఇచ్చినా.. పైరవీ చేసినా.. రాజకీయంగా ఒత్తిడి తెచ్చినా ఇల్లు రాదు. అర్హత ఉన్నవారికే ఇల్లు’’ అని తేల్చిచెప్పారు. ఇందిరమ్మ టవర్స్‌ ఒకసారి చేపట్టి నిలిపివేసే కార్యక్రమం కాదని, నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు.

ఎన్నికల తీర్పే రెఫరెండం

గత ప్రభుత్వం భద్రాచలం, ఉస్మానియా యూనివర్సిటీ, రైతులు, పేదలకు ఇచ్చిన అనేక హామీలను పూర్తిగా అమలు చేయలేదని పొంగులేటి విమర్శించారు. ‘‘ఎన్నికలే మాకు రెఫరెండం. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో వరుస ఎన్నికల్లో ఇచ్చిన తీర్పులే చెబుతున్నాయి’’ అని అన్నారు. ఉపఎన్నికలు, స్థానిక సంస్థలు, పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలను ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రాజకీయ విమర్శలు సహజమే అయినా వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం తెలంగాణ సంస్కృతి కాదన్నారు. మాటలకంటే పనులే ప్రజల తీర్పును నిర్ణయిస్తాయని చెప్పారు. ప్రజల అభిప్రాయాలు, అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ‘పేదవాడికి ఇల్లు ఇవ్వడం ఖర్చు కాదు. ఆత్మగౌరవానికి పెట్టుబడి. గత ప్రభుత్వం వదిలిన అప్పులు మేము చెల్లిస్తున్నాం. పెండింగ్‌ బిల్లులు మేము తీర్చుతున్నాం. ఆగిపోయిన ప్రాజెక్టులను మేము పూర్తి చేస్తున్నాం. రైతుకు భరోసా ఇస్తున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం. పేద పిల్లలకు మెరుగైన విద్య అందిస్తున్నాం. పేదవాడికి సొంత ఇల్లు ఇస్తున్నాం. 3,475 రోజుల పాలనకు.. 1,000 రోజుల ప్రజా పాలనకు తేడా ఇదే. దొరల పాలనకు.. ఇందిరమ్మ రాజ్యానికి తేడా ఇదే’’అని పొంగులేటి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement