త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OBC Leaders Support Konda Surekha | కాంగ్రెస్‌లో ముదురుతున్న ‘కొండా’ ఎపిసోడ్: సురేఖకు ఓబీసీ సంఘం అండ.. అధిష్ఠానం తీరుపై ఫైర్!

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కాక రేపుతోంది. బీసీ మంత్రిపై కుట్ర జరుగుతోందంటూ ఆలిండియా ఓబీసీ సంఘం నేతలు గన్‌పార్క్‌ వద్ద ఆందోళనకు దిగారు.

J

Telangana | Published On Aug 23, 2026, 5.26 pm IST

OBC Leaders Support Konda Surekha | కాంగ్రెస్‌లో ముదురుతున్న ‘కొండా’ ఎపిసోడ్: సురేఖకు ఓబీసీ సంఘం అండ.. అధిష్ఠానం తీరుపై ఫైర్!

సంక్షిప్త సారాంశం

మంత్రి కొండా సురేఖకు మద్దతుగా ఆలిండియా ఓబీసీ సంఘం రంగంలోకి దిగింది. బీసీ మంత్రిపై అగ్రకుల నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించింది. గతంలో పార్టీని, సీఎంను విమర్శించిన రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి వారికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ఓబీసీ నేతలు ప్రశ్నించారు. సురేఖకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగితే, ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేయగా.. సురేఖ రెండో లేఖపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు.

Advertisement
  • అండగా ఓబీసీ సంఘం
  • వాళ్లకెందుకు నోటీసులు ఇవ్వలేదు?
  • రాహుల్ ఇంటి ముట్టడి
  • హైకమాండ్ సీరియస్

OBC Leaders Support Konda Surekha | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సొంత పార్టీ నేతల నుంచే సురేఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ.. ఆలిండియా ఓబీసీ సంఘం (All India OBC Association) ఆమెకు బాసటగా నిలిచింది. హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద ఓబీసీ సంఘం ప్రతినిధులు కొండా సురేఖకు మద్దతుగా నిరసనకు దిగారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మహిళా మంత్రిపై కొందరు అగ్రకుల నేతలు ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేస్తున్నారని వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

వాళ్లకు లేని నిబంధనలు సురేఖకేనా?

కుమార్తె చేసిన వ్యాఖ్యలకు మంత్రికి షోకాజ్ నోటీసులు (Show-cause notice) ఇవ్వడాన్ని ఓబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్ తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, జగ్గారెడ్డి, అనిరుధ్ రెడ్డి వంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేసినప్పుడు అధిష్ఠానం ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. కావాలనే ఒక బీసీ నాయకురాలిని టార్గెట్ చేశారని ఆరోపించారు. కొండా సురేఖకు పార్టీలో ఏదైనా అన్యాయం జరిగితే సహించేది లేదని, అవసరమైతే ఢిల్లీలోని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇంటిని సైతం ముట్టడిస్తామని ఓబీసీ సంఘం నేతలు అల్టిమేటం జారీ చేశారు.

రెండో లేఖపై మల్లు రవి ఏమన్నారంటే..

మరోవైపు, పార్టీ నుంచి తనకు ఎదురవుతున్న పరిణామాలపై కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మరో లేఖ రాశారు. దీనిపై కమిటీ చైర్మన్ మల్లు రవి (Mallu Ravi) స్పందిస్తూ.. సురేఖ రెండో లేఖ అందిందని, త్వరలోనే నెక్ట్స్ మీటింగ్ పెట్టి దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

లైన్ దాటితే యాక్షన్ తప్పదు

ఈ వ్యవహారంపై మంత్రి వాకిటి శ్రీహరి కూడా సీరియస్‌గా స్పందించారు. ఎవరైనా సరే పార్టీ గీత దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. "కొండా సురేఖ అయినా, వాకిటి శ్రీహరి అయినా పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదు. కొందరి వల్ల పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోము. చర్యలు తీసుకునే పూర్తి హక్కు అధిష్ఠానానికి ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ వివాదానికి ఎలా చెక్ పెడతారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిగా మారింది.

Advertisement
Advertisement