Telangana Irrigation | కిం కర్తవ్యం? సాగునీటికి కటకటేనా..!
Telangana Irrigation | శ్రీరాం సాగర్ సగం కూడా నిండలేదు. శ్రీ పాద ఎల్లంపల్లి నుంచి తాగునీటి, సాగునీటి అవసరాలకు నీళ్లను వేగంగా తరలిస్తున్నారు. ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, సమ్మక్క బ్యారేజీ, సీతమ్మ సాగర్ బ్యారేజీల నుంచి వచ్చిన నీళ్లు వచ్చినట్టే దిగువకు వెళ్లిపోతున్నాయి. ఇక శ్రీశైలం రిజర్వాయర్ సగమే నిండింది. నాగార్జున సాగర్‌లోకి ఇప్పటికీ ఒక్క క్యూసెక్కు ఇన్ ఫ్లో చేరే పరిస్థితి లేదు.
సర్దుకోవాల్సింది 172 టీఎంసీలతోనే
అన్ని రిజర్వాయర్లలో ఉన్నది 409 టీఎంసీలే
డెడ్ స్టోరేజీ కోసం నిల్వ చేయాల్సింది 237 టీఎంసీలు
ఎగువన ఆగిపోయిన వర్షాలు
గోదావరి ప్రాజెక్టుల్లోకి తగ్గిన ప్రవాహం
ఎగువన ఆల్మట్టికి భారీగా తగ్గిన ప్రవాహం
మరో వారంలో శ్రీశైలానికి ఇన్ ఫ్లో ఆగిపోయే ప్రమాదం
ఇంకా.. డెడ్ స్టోరేజీ వద్దే నాగార్జున సాగర్
Telangana Irrigation | త్రినేత్ర.న్యూస్ : శ్రీరాం సాగర్ సగం కూడా నిండలేదు. శ్రీ పాద ఎల్లంపల్లి నుంచి తాగునీటి, సాగునీటి అవసరాలకు నీళ్లను వేగంగా తరలిస్తున్నారు. ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, సమ్మక్క బ్యారేజీ, సీతమ్మ సాగర్ బ్యారేజీల నుంచి వచ్చిన నీళ్లు వచ్చినట్టే దిగువకు వెళ్లిపోతున్నాయి. ఇక శ్రీశైలం రిజర్వాయర్ సగమే నిండింది. నాగార్జున సాగర్‌లోకి ఇప్పటికీ ఒక్క క్యూసెక్కు ఇన్ ఫ్లో చేరే పరిస్థితి లేదు. మొత్తంగా.. నాలుగైదు రోజుల వర్షాలతో రాష్ట్రమంతటా ఉపశమనం కలిగినా.. ప్రధాన రిజర్వాయర్లు ఇంకా సగం కూడా నిండకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
ప్రస్తుతం ఉన్నది 409 టీఎంసీలే
సాగునీటి పారుదల శాఖ గణాంకాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి గోదావరి, కృష్ణ బేసిన్లలో ఉన్న రిజర్వాయర్లలో 452 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాష్ బోర్డులో ఉన్న గణాంకాల నుంచి జయక్వాడ్, ఆల్మట్టి, నారాయణ పూర్, తుంగభద్ర రిజర్వాయర్ల మట్టాన్ని మినహాయిస్తే కేవలం మన రాష్ట్రంలో ఉన్న అన్ని రిజర్వాయర్లలో నిల్వ ఉన్నది కేవలం 409 టీఎంసీలే. వీటిలో ఆయా రిజర్వాయర్ల డెడ్ స్టోరేజీ మొత్తం కలిపి 237 టీఎంసీలే. ఈ లెక్కన మనం వాడుకోగలిగిన నీళ్లు ప్రస్తుతం కేవలం 172 టీఎంసీలే.
గోదావరి బేసిన్‌లో 72 టీఎంసీలు
ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి మెరుగైన ఇన్ ఫ్లోలు వచ్చాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి.. గోదావరి బేసిన్‌లో ఉన్న అన్ని రిజర్వాయర్లలో కలిపి 117 టీఎంసీలు ఉన్నాయి. వీటిలో 45 టీఎంసీల వరకు డెడ్ స్టోరేజీ నిమిత్తం నిల్వ ఉంచాల్సిందే. ఇక వాడుకునేందుకు మిగిలినవి 72 టీఎంసీలే. శ్రీరాం సాగర్‌లో 80 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను కేవలం 34 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. శ్రీ పాద ఎల్లంపల్లి దాదాపు పూర్తి స్థాయి మట్టానికి చేరుకున్నప్పటికీ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా సాగు, తాగునీటి అవసరాల కోసం నీటిని దిగువకు వదులుతున్నారు. మిడ్ మానేరులో 16 టీఎంసీలు, లోయర్ మానేరులో 6 టీఎంసీల వరకు, మల్లన్నసాగర్‌లో 13 టీఎంసీల వరకు నీళ్లు నిల్వ ఉన్నాయి.
కృష్ణా బేసిన్‌లో 100 టీఎంసీలు.. కానీ..
ఎగువ నుంచి వచ్చిన నీటి ప్రవాహంతో శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ ప్రమాదం నుంచి బయటపడింది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 106 టీఎంసీలు ఉన్నాయి. డెడ్ స్టోరేజీ లెవల్ 53.85 టీఎంసీలు. అంటే ప్రస్తుతం 53 టీఎంసీలు వినియోగించుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ భాగం కూడా ఉన్నందున కచ్చితంగా మనకు ఎన్ని నీళ్లు లభిస్తాయో ఇంకా స్పష్టత రాలేదు. నాగార్జున సాగర్‌లోకి ఇప్పటికీ ఇన్ ఫ్లోలు లేవు. డెడ్ స్టోరేజీ లెవల్ 131 టీఎంసీలు కాగా ప్రస్తుతం 136 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మరోవైపు ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో భారీగా పడిపోయింది. మంగళవారం సాయంత్రం కేవలం 14 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో మాత్రమే నమోదైంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో వారం రోజుల్లో జూరాలకు, శ్రీశైలానికి నీళ్లు వచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఇక భీమాపై ఉన్న ఉజ్జని ప్రాజెక్టుకు వరద ఇంకా కొనసాగుతున్నందున.. కృష్ణలోకి నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉంది..
సాగునీటికి కష్టమే
ఇటీవలి సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసినట్టు... ఈ సారి శ్రీరాం సాగర్ నుంచి, శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి సాగునీటికి నీరు లభించే అవకాశాలు మృగ్యమవుతున్నాయి. తాగునీటికి ప్రమాదం తప్పడం పెద్ద ఊరటనిచ్చే విషయమే. ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు లేకపోతే.. కృష్ణ, గోదావరిలో కలిపి ఉన్న 172 టీఎంసీలనే మనం వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం ఈ పరిస్థితిని ఏ మేరకు ఎదుర్కొంటుందో వేచి చూడాలి.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Lockup Season 2 | యాభై మిలియన్ల వ్యూస్‌తో లాకప్ సీజన్ 2 రికార్డ్ - ఫైనల్‌కు ముందే విన్నర్ పేరు లీక్?
- ●RS Praveen Kumar | కాళేశ్వరం కూలేశ్వరం కాదు : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- ●Phone Tapping Case | సీఎం గారూ మీ ఫోన్ ట్యాప్ అయిందా..?
- ●TVS | 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ
- ●King Cobra | ఏం పిల్లరా బాబు.. నాగుపామును అలా పట్టేసింది.. వీడియో
- ●Nagarjuna | బాలకృష్ణ ప్రొడ్యూసర్ - నాగార్జున హీరో - రేర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ కానీ...

Lockup Season 2 | యాభై మిలియన్ల వ్యూస్‌తో లాకప్ సీజన్ 2 రికార్డ్ - ఫైనల్‌కు ముందే విన్నర్ పేరు లీక్?

RS Praveen Kumar | కాళేశ్వరం కూలేశ్వరం కాదు : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్

Phone Tapping Case | సీఎం గారూ మీ ఫోన్ ట్యాప్ అయిందా..?

TVS | 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ





