త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

No Fuel Shortage in Telangana | ఆందోళ‌న చెందొద్దు.. నిల్వ‌లున్నాయి.. ప్ర‌క‌టించిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు

పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో పెట్రోల్, గ్యాస్ దొరకదేమోనన్న భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే దేశంలో ఎలాంటి ఇంధన కొరతా లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.

J

Telangana | Published On Mar 25, 2026, 8.54 pm IST

No Fuel Shortage in Telangana | ఆందోళ‌న చెందొద్దు.. నిల్వ‌లున్నాయి.. ప్ర‌క‌టించిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు
Advertisement
  • అయినా భ‌యాందోళ‌న‌లోనే ప్ర‌జ‌లు
  • పెట్రోలు బంకులు, గ్యాస్ గోదాంల వ‌ద్ద బారులు

No Fuel Shortage in Telangana | త్రినేత్ర.న్యూస్ : ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధ సంక్షోభం త‌గ్గుముఖం ప‌ట్టినా దేశంలో ఆ వేడి మాత్రం చ‌ల్లార‌డం లేదు. ఒక‌వైపు ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందొద్ద‌ని, త‌గిన నిల్వ‌లున్నాయ‌ని కేంద్ర‌, రాష్ట్ర మంత్రులు, అధికారులు స్ప‌ష్టంగా ప్ర‌క‌టిస్తున్న‌ప్ప‌టికీ, ప్ర‌జ‌ల్లో మాత్రం భ‌యాందోళ‌న‌లు త‌గ్గ‌డం లేదు. ఒక వైపు వారం దాటినా బుక్ చేసిన గ్యాస్ సిలెండ‌ర్ ఇంటికి రాక‌పోవ‌డం, మ‌రోవైపు కొన్నిపెట్రోల్ బంకులు మూత‌ప‌డ‌డం, నో స్టాక్ బోర్డులు పెట్ట‌డంతో మిగిలిన పెట్రోల్ బంకులు, గ్యాస్ గోదాంల వ‌ద్ద ప్ర‌జ‌లు బారులు తీరారు. ప‌నుల‌న్నీ మానుకుని బంకుల వ‌ద్దే ప‌డిగాపులు ప‌డాల్సి వ‌స్తోంద‌ని స‌గ‌టు ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఎలాంటి అంత‌రాయం లేదు: కేంద్రం

అవసరమైన వారికి గ్యాస్ అందుబాటులో ఉండేలా చేయడంతో పాటు సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల మధ్య కూడా దేశంలో గ్యాస్ సరఫరా సజావుగా కొనసాగుతోందని, వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. దేశంలో ఎలాంటి చ‌మురు ఉత్ప‌త్తుల కొర‌త లేద‌ని పున‌రుద్ఘాటించారు. ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్ వ్య‌వ‌ధి పెంపు వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ దానిని కేంద్రం ఖండించింది. ఇంకోవైపు పైప్డ్‌ నేచుర‌ల్ గ్యాస్ (PNG) అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగ‌దారులు ఆ క‌నెక్ష‌న్‌కు మారాల‌ని కేంద్రం ఆదేశించింది. పీఎన్‌జీ అందుబాటులో ఉన్నా మూడు నెల‌ల్లో త‌మ క‌నెక్ష‌న్‌ను మార్చుకోక‌పోతే ఎల్‌పీజీ సిలిండ‌ర్ స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

ప్యానిక్ బ‌య్యింగ్ వ‌ద్దు: మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి

రాష్ట్రంలో పెట్రోలియం ఉత్ప‌త్తుల‌కు సంబంధించి ఎలాంటి కొర‌త లేద‌ని రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లు ప్యానిక్ బ‌య్యింగ్‌ను నివారించాల‌ని సూచించారు. రాష్ట్రంలో మూడు నెల‌ల‌కు స‌రిప‌డా నిల్వ‌ల కంటే ఎక్కువే ఉన్నాయ‌ని చెప్పారు. అన‌వ‌స‌ర‌మైన పుకార్లు వ్యాప్తి చేయ‌కూడ‌ద‌ని కోరారు. క‌రోనా లాంటి ప‌రిస్థితి త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్లే ప్ర‌జ‌లంతా ఒకేసారి ప్యానిక్ అయిపోయారని, అందుకే పెట్రోల్ బంకుల వ‌ద్ద బారులు తీరారని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆరోపించారు. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ రాష్ట్రంలో ఇంధ‌న‌ కొరత లేద‌ని స్ప‌ష్టం చేసింది. త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌జ‌లు న‌మ్మొద్ద‌ని సూచించింది. కంపెనీల వద్ద సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని పేర్కొంది. విప‌రీత‌మైన ర‌ద్దీ కార‌ణంగానే కొన్ని బంకుల్లో షార్టేజ్ వ‌చ్చింద‌ని.. దీన్ని ఇంధ‌న కొర‌త‌గా భావించొద్ద‌ని తెలిపింది. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మి ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గురికావొద్ద‌ని సూచించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement