త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | ప్రారంభ‌మైన‌ మున్సిప‌ల్ ఎన్నిక‌ల పోలింగ్‌..

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్‌: మున్సిప‌ల్‌ ఎన్నికల (Municipal Elections) పోలింగ్ (Polling) ప్రారంభమైంది. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంది.

G

Telangana | Published On Feb 11, 2026, 7.00 am IST

Municipal Elections | ప్రారంభ‌మైన‌ మున్సిప‌ల్ ఎన్నిక‌ల పోలింగ్‌..
Advertisement

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్‌: మున్సిప‌ల్‌ ఎన్నికల (Municipal Elections) పోలింగ్ (Polling) ప్రారంభమైంది. బుధ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంది. ప‌లు చోట్ల పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఉద‌యాన్నే ఓట‌ర్లు క్యూక‌ట్టారు. కాగా, రాష్ట్రంలోని మొత్తం 7 కార్పొరేష‌న్ల‌లో ఉన్న‌ 414 డివిజన్లకు, 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. అయితే వాటిలో రెండు డివిజన్లు, 12 వార్డుల్లో అభ్య‌ర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. మక్తల్‌లోని ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మృతిచెందారు. దీంతో అక్క‌డ‌ ఎన్నిక వాయిదా పడింది.

బ‌రిలో 12,944 మంది

ఇక మిగిలిన 412 డివిజన్లు, 2,569 వార్డులకు పోలింగ్ జ‌రుగుతున్న‌ది. మొత్తం 12,944 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. కార్పొరేషన్లలోని 412 డివిజన్లలో 2,225 మంది పోటీ చేస్తుండ‌గా, మున్సిపాలిటీల్లోని మొత్తం 2,569 వార్డులలో 10,719 మంది అభ్య‌ర్థులు పోటీ చేస్తున్నారు. కార్పొరేష‌న్ల‌లో అత్య‌ధికంగా కరీంనగర్‌లో 66 డివిజన్లకు 398 మంది పోటీ పడుతుండ‌గా, పుర‌పాలిక‌ల్లో ఆదిలాబాద్‌లో అత్యధికంగా 49 వార్డులకు 314 మంది బ‌రిలో ఉన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి మొత్తం 52,17,413 ఓటర్లు వారి ఓటును వినియోగించుకోనున్నారు. వీరిలో 25,49,750 మంది పురుషులు, 26,67,025 మంది మ‌హిళ‌లు, 638 మంది ఇత‌రులు ఉన్నారు.

ఎన్నిక‌ల కోసం 8,203 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌గా, 16,382 బ్యాలెట్‌ బాక్స్‌లను ఉపయోగిస్తున్నారు. 1,379 మంది రిటర్నింగ్‌ అధికారులు, 41,773 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వ‌ద్ద భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. పోలీసుల‌తోపాటు ఎక్సైజ్‌, అట‌వీ శాఖ సిబ్బంది ఎన్నిక‌ల విధుల్లో పాల్గొంటున్నారు.

12న రీపోలింగ్‌

ఎక్క‌డైనా రీపోలింగ్‌ అవసరమైతే ఈ నెల‌ 12న నిర్వహిస్తారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల లోపల, బయట వెబ్‌కాస్టింగ్ చేయ‌నున్నారు. ఓట్లను శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 13న) లెక్కించి ఫలితాల‌ను ప్ర‌క‌టిస్తారు. 16న కార్పొరేషన్ల మేయర్లు, ఉపమేయర్లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు.

ఓట‌రు స్లిప్పులు డౌన్‌లోడ్ చేసుకోండిలా

ఎన్నిక‌లు జ‌రుగుతున్న చోట ఇప్ప‌టికే సిబ్బంది ఓట‌రు స్లిప్పుల‌ను పంపిణీ చేశారు. ఒక‌వేళ ఎవ‌రికైనా రాన‌ట్ల‌యితే ఎస్‌ఈసీ వెబ్‌సైట్, TE-POLL యాప్‌ ద్వారా ఓటరు స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అదేవిధంగా పోలింగుకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే 9240021456 నంబర్​ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

Advertisement
Advertisement