త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | బియ్యం ధరల దోపిడీపై ఉక్కుపాదం

Uttam Kumar Reddy | బియ్యం అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయిస్తూ వినియోగదారులపై భారం మోపే వ్యాపారులు, రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.

S

Telangana | Published On Oct 30, 2026, 7.30 pm IST

Uttam Kumar Reddy | బియ్యం ధరల దోపిడీపై ఉక్కుపాదం
Advertisement

మిల్లర్లు, వ్యాపారులకు మంత్రి ఉత్తమ్ హెచ్చరిక
బీపీటీ బియ్యం కిలో రూ.66కు మించకుండా నియంత్రణ చర్యలు
ఐదు శాఖల సమన్వయంతో దాడులు..
ఇప్పటికే 12 కేసులు నమోదు
ధరలు స్థిరపడే వరకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు

Uttam Kumar Reddy | త్రినేత్ర న్యూస్ : బియ్యం అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయిస్తూ వినియోగదారులపై భారం మోపే వ్యాపారులు, రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమంగా లాభాలు సంపాదించాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించి వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసినట్లు మంత్రి తెలిపారు. బేగంపేట కుందన్‌బాగ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. బియ్యం ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, టోకు, చిల్లర వ్యాపారులు, రైస్ మిల్లర్లతో అధికారులు జరిపిన చర్చల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక తనిఖీలు, అక్రమాల నిరోధానికి చేపట్టిన చర్యలను వివరించారు. శాఖ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బీపీటీ బియ్యం కిలో రూ.66కు మించకూడదు

సాధారణంగా ప్రజలు ఎక్కువగా వినియోగించే బీపీటీ బియ్యం ధర కిలో రూ.66కు మించకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆర్‌ఎన్‌ఆర్ బియ్యం విషయంలో నాణ్యత, ఉత్పత్తి వ్యయాల్లోని వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకుని ధరలను సమీక్షించనున్నట్లు తెలిపారు. వినియోగదారులపై అదనపు భారం మోపుతూ అధిక లాభాలు సంపాదించడాన్ని ప్రభుత్వం సహించదని, మార్కెట్‌లో ధరలు స్థిరపడే వరకు తనిఖీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

ఐదు శాఖల సంయుక్త దాడులు.. 12 కేసులు

బియ్యం అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు తదితర అవకతవకలకు సంబంధించి ఇప్పటికే వ్యాపారులపై 12 కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. పౌరసరఫరాలు, పోలీసు, జీఎస్టీ, తూనికలు–కొలతల శాఖలతో పాటు సంబంధిత ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు సమన్వయంతో దాడులు నిర్వహిస్తున్నాయని వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాల్లోని బియ్యం టోకు, చిల్లర మార్కెట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. బేగంబజార్, నాంపల్లి, మహారాజ్‌గంజ్ వంటి ప్రధాన వ్యాపార కేంద్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. అక్రమ నిల్వలను గుర్తించడం, అధిక ధరలకు కళ్లెం వేయడం, వినియోగదారులకు ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

బియ్యం కొరత లేదు.. ప్రజలు ఆందోళన చెందొద్దు

రాష్ట్రంలో ప్రజల అవసరాలకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో అవసరానికి మించి బియ్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్రంలోని మిల్లుల్లోనే బియ్యంగా మార్చి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్నట్లు వివరించారు. నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం చేసే వ్యాపారులు, మిల్లర్లతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుందని, అక్రమ వ్యాపార పద్ధతులకు పాల్పడుతూ ప్రజలపై భారం మోపేవారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ట్యాగ్స్:

Congress GovtRation RiceRice MillarsTelanganaUttam Kumar Reddy
Advertisement
Advertisement