Tummala Nageshwar Rao | సమగ్ర సేద్యంతో రైతులకు నిత్యాదాయం సాధ్యమే
Tummala Nageshwar Rao | రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యంతో పాటు పాడి పరిశ్రమ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ రంగాలను సమీకృతం చేసుకొని సాగు చేపట్టాలని, తద్వారా ప్రతిరోజూ ఆదాయం పొందేలా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
నవీన్ కుమార్ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని
యాసంగిలో చిరుధాన్యాలు, పశుగ్రాస పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి
మురసు తుఫాను నేపథ్యంలో
పంట కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి
రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల
Tummala Nageshwar Rao | త్రినేత్ర న్యూస్ : రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యంతో పాటు పాడి పరిశ్రమ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ రంగాలను సమీకృతం చేసుకొని సాగు చేపట్టాలని, తద్వారా ప్రతిరోజూ ఆదాయం పొందేలా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో వంటి ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టడం ద్వారా రైతులు నష్టాలను అధిగమించవచ్చని అన్నారు.
మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం 113వ ఎపిసోడ్‌లో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన మాజీ సైనిక మేజర్, ప్రకృతి వ్యవసాయ రైతు సిహెచ్ నవీన్ కుమార్ తన సమీకృత వ్యవసాయ విజయగాథను రైతులతో పంచుకున్నారు. భారత సైన్యంలో మేజర్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి 15 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. వరి, కూరగాయల సాగుతో పాటు పాడి పశువులు, నాటు కోళ్ల పెంపకం, చేపల పెంపకం, మునగ, నేపియర్ గడ్డి, బంతిపూల సాగు చేపడుతున్నారు. వర్మీ కంపోస్టు, వర్మీవాష్, ప్రకృతి వ్యవసాయ కషాయాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో బయో రిసోర్స్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసి ఇతర రైతులకు సేంద్రియ ఎరువులు, జీవ ఉత్పత్తుల తయారీకి అవసరమైన సామగ్రిని అందిస్తున్నామని ఆయన వివరించారు.

నవీన్ కుమార్ ప్రయాణం అభినందనీయం
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల, నవీన్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సైన్యంలో దేశానికి సేవలందించిన అనంతరం వ్యవసాయ రంగంలోనూ ఆదర్శంగా నిలుస్తున్న ఆయన ప్రయాణం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి సమీకృత వ్యవసాయ విధానాలను ఇతర రైతులు కూడా అనుసరించాలని, తమ భూమి, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్ల వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను వినియోగించుకొని ప్రతి నీటి బొట్టును సమర్థంగా ఉపయోగించుకోవాలని అన్నారు.
పంటల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి
ఎల్‌నినో ప్రభావంతో రానున్న యాసంగి సీజన్‌లో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. అధిక నీటి అవసరం ఉన్న పంటల విషయంలో పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని, తక్కువ నీటితో సాగు చేసుకునే చిరుధాన్యాలు, పశుగ్రాస పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రైతులకు ముందస్తు అవగాహన కల్పించడంతో పాటు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన సలహాలు అందించాలని సూచించారు. మురసు తుఫాను ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు. తుఫాను ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లకుండా పంట కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని, రైతులను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన
రైతు నేస్తం కార్యక్రమంలో వాతావరణ, భూగర్భ జల, నీటిపారుదల శాఖల అధికారులు ఎల్‌నినో ప్రభావం, వర్షపాత పరిస్థితులు, భూగర్భ జలమట్టాలు, సాగునీటి ప్రాజెక్టులలో నీటి లభ్యతపై వివరించారు. అలాగే, వ్యవసాయ పరిశోధనా సంస్థలు, పశుగ్రాస పరిశోధనా కేంద్రం, ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు యాసంగిలో తక్కువ నీటితో సాగు చేసుకునే చిరుధాన్యాలు, పశుగ్రాస పంటల సాగు, మామిడి తోటల్లో పూత, పిందె దశల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.
'ఇది చేయి–ఇది చేయవద్దు'
పురుగుమందుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ, పురుగుమందుల తయారీదారుల సంఘం రూపొందించిన 'ఇది చేయి–ఇది చేయవద్దు' భద్రతా చార్ట్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో రైతులకు రక్షణ కిట్లను పంపిణీ చేశారు. అలాగే, యూపీఐ డిజిటల్ చెల్లింపుల వినియోగంపై ఎన్‌పీసీఐ ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో మంత్రి మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతులతో ముఖాముఖి నిర్వహించి, రైతునేస్తం కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాన్ని మరింత మెరుగుపరిచేందుకు రైతులు తమ సూచనలు అందించాలని కోరారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతుల సందేహాలను నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ సంచాలకులు బి. గోపి, ఆర్టీసి ఎండి నాగిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Aga Syed Ruhullah Mehdi | ఒమర్ అబ్దుల్లాకి షాక్.. శ్రీనగర్ ఎంపీ రాజీనామా
- ●Ramayana Song Controversy | రామాయణ సాంగ్‌పై వివాదం.. స్పందించిన అర్మాన్ మాలిక్
- ●MLA Anirudh Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి నోటీసులు..!
- ●Diwali 2026 | దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?.. లక్ష్మీ పూజ శుభ ముహూర్తం, 5 రోజుల క్యాలెండర్, పూజా విధానం ఇదే..!
- ●Nithya Menen | బాలీవుడ్ సినిమాలో విలన్‌గా టాలీవుడ్ హీరోయిన్ - "స్పిరిట్" నటుడితో మర్డర్ మిస్టరీ మూవీ
- ●Sangishetti Jagadeeshwar Rao | అమిత్ షా సర్దుకునే టైమొచ్చింది: సంగిశెట్టి జగదీశ్వర్ రావు

Aga Syed Ruhullah Mehdi | ఒమర్ అబ్దుల్లాకి షాక్.. శ్రీనగర్ ఎంపీ రాజీనామా

Ramayana Song Controversy | రామాయణ సాంగ్‌పై వివాదం.. స్పందించిన అర్మాన్ మాలిక్

MLA Anirudh Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి నోటీసులు..!

Diwali 2026 | దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?.. లక్ష్మీ పూజ శుభ ముహూర్తం, 5 రోజుల క్యాలెండర్, పూజా విధానం ఇదే..!





