త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhubharathi Portal | 5 మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్ సేవ‌లు: మంత్రి పొంగులేటి

Bhubharathi Portal | రాష్ట్రంలో భూ వివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించేందుకు రెవెన్యూ శాఖ‌లో విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లకు శ్రీ‌కారం చుట్టామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. ఇందులో భాగంగా రైతుల‌కు పార‌ద‌ర్శ‌కంగా, సుల‌భ‌త‌ర‌మైన‌ సేవ‌లు అందించ‌డానికి ల్యాండ్‌, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ విభాగాల‌ను ఒకే గొడుగు కింద‌కు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్‌ను (Bhubharathi Portal) త‌యారు చేశామ‌న్నారు.

G

Telangana | Published On Apr 1, 2026, 5.39 pm IST

Bhubharathi Portal | 5 మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్ సేవ‌లు: మంత్రి పొంగులేటి
Advertisement

Bhubharathi Portal | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో భూ వివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించేందుకు రెవెన్యూ శాఖ‌లో విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లకు శ్రీ‌కారం చుట్టామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. ఇందులో భాగంగా రైతుల‌కు పార‌ద‌ర్శ‌కంగా, సుల‌భ‌త‌ర‌మైన‌ సేవ‌లు అందించ‌డానికి ల్యాండ్‌, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ విభాగాల‌ను ఒకే గొడుగు కింద‌కు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్‌ను (Bhubharathi Portal) త‌యారు చేశామ‌న్నారు. దీనిని గురువారం (ఏప్రిల్ 2) నుంచి 5 మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించి భూ వివాదాల ప‌రిష్కారానికి తొలి అడుగు వేయ‌బోతున్నామ‌ని చెప్పారు. ఇక్క‌డ వ‌చ్చే ఫ‌లితాల‌ను బ‌ట్టి అవ‌స‌ర‌మైన మార్పులు చేర్పులు చేసి భ‌విష్య‌త్తులో ముందుకు వెళ్తామ‌న్నారు. ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారుల‌తో మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్‌ను రైతు కోణంలో రూపొందించామ‌ని, సామాన్య ప్ర‌జానీకానికి ముఖ్యంగా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఏప్రిల్ 2నుంచి ఖ‌మ్మం జిల్లా కుసుమంచి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వ‌రావుపేట‌, రంగారెడ్డి జిల్లా ఆమన్‌గ‌ల్‌, సంగారెడ్డి జిల్లా వ‌ట్‌ప‌ల్లి, నారాయ‌ణ‌పేట జిల్లా కొస్గి మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆయా జిల్లా క‌లెక్ట‌ర్లు పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌న్నారు. గ‌తంలో మాదిరిగా రైతులు త‌మ భూ సేవ‌ల కోసం మీ సేవ కేంద్రాల‌కు వెళ్లాల్సిన ప‌నిలేకుండా త‌న‌ ఇంటి నుంచే భూ సేవ‌లు పొందేవిధంగా పోర్ట‌ల్‌ను రూపొందించామ‌ని అన్నారు. రైతులు త‌మ భూమి హ‌ద్దులు తేల్చాల‌ని స‌ర్వే అధికారుల చుట్టూ తిరిగేవార‌ని, ఇప్పుడు ఎక్క‌డికీ వెళ్ల‌కుండా ఇంటి నుంచే భూభార‌తి పోర్ట‌ల్ ద్వారా పొంద‌వ‌చ్చ‌న్నారు.

రైతు లాగిన్ అయిన వెంట‌నే త‌న‌కు ఉన్న భూమి వివ‌రాలు క‌నిపిస్తాయి. ఎన్నిఎక‌రాల‌కు స‌ర్వే కావాలో కోరితే అందుకు సంబంధించిన ఫీజు ఎంత‌చెల్లించాలో క‌నిపిస్తుంది. ఫీజు చెల్లించిన త‌ర్వాత ఆ వివ‌రాలు ఆ గ్రామంలో ఉన్న లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ లాగిన్‌కు వెళుతుంది. ఆత‌ర్వాత రెండు రోజ‌ల్లో ఆ రైతు భూమికి ఆనుకొని ఉన్న రైతుల‌కు నోటీసులు జారీ చేస్తారు. త‌ర్వాత ఏడు రోజుల్లోపు స‌ర్వే తేదీని లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ ఖరారు చేయ‌డ‌మేగాక స‌ర్వేకూడా రోవ‌ర్లతో పూర్తి చేస్తారు. దీనిని సిస్ట‌మ్‌లో న‌మోదు చేశాక అది మండ‌ల స‌ర్వేయ‌ర్ స్య్రూటినీకి వెళుతుంది. ఆపై మండ‌ల త‌హ‌శీల్దార్ ఆమోదం పొందాక ద‌ర‌ఖాస్తుదారైన రైతుకు ఎల్‌పీఎమ్‌, భూధార్ నంబ‌ర్లు కేటాయింపు జ‌రుగుతుంది. ఈ వివరాలు భూభార‌తి పోర్ట‌ల్‌లో కూడా నిక్షిప్త‌మ‌వుతాయి. స‌ర్వే పూర్త‌యిన త‌ర్వాత స‌ర్వే మ్యాప్‌ను జ‌న‌రేట్ చేసి భూభార‌తి పోర్ట‌ల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ ప్ర‌క్రియ‌లో రిజిస్ట్రేష‌న్ ద‌ర‌ఖాస్తు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి పూర్త‌య్యేవ‌ర‌కు ప్ర‌తి ద‌శ‌లో పౌరుల రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్ అల‌ర్ట్స్ పంపిస్తారని తెలిపారు.

భూభార‌తి చ‌ట్టంలో పేర్కొన్న‌విధంగా వ్య‌వ‌సాయ భూముల‌కు సంబంధించి క్ర‌య విక్ర‌యదారుల‌కు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో స‌ర్వే మ్యాపును జ‌త‌ప‌ర‌చే నిబంధ‌న‌ను ఈ 5 మండ‌లాల్లో అమ‌లు చేస్తున్నామ‌ని, ప్ర‌తి స‌ర్వే మ్యాప్ (ఎల్‌పీఎమ్‌) యూనిక్ నంబరు, అదేవిధంగా ప్ర‌తి స‌ర్వే నంబ‌ర్‌కు ఆధార్ నంబ‌ర్ మాదిరిగానే భూధార్ నంబ‌ర్‌ను కూడా ఇస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ ఐదు మండ‌లాల్లో రైతులు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌త‌ర్వాత స‌ర్వే నిర్వ‌హించ‌డానికి అవ‌స‌ర‌మైన స‌ర్వేయ‌ర్ల‌ను అందుబాటులో ఉంచామ‌ని అలాగే గొలుసులు, క‌ర్ర‌లు, క్రాస్ స్టాఫ్‌, మెజ‌రింగ్ టేప్ వంటి పాత స‌ర్వే ప‌రిక‌రాల‌కు స్వ‌స్తి చెప్పి రోవ‌ర్ల‌తో స‌ర్వే నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. దీనివ‌ల్ల స‌ర్వే ప్ర‌క్రియ త్వ‌రిత‌గ‌తిన పూర్త‌వుతుంద‌ని, క‌చ్చిత‌మైన స‌ర్వే వివరాలు వ‌స్తాయ‌ని చెప్పారు. భూ స‌మ‌స్య‌లు రైతు జీవితంలో పెద్ద అడ్డంకిగా మారాయ‌ని వాటికి శాశ్వ‌త ప‌రిష్కారం చూపించేందుకు ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్ ఒక కీల‌క‌మైన ముంద‌డుగు అని రైతు ఇంటి నుంచే అన్నిసేవ‌లు పొందేలా పార‌ద‌ర్శ‌క వ్య‌వ‌స్ధ‌ను తీసుకువ‌స్తున్నామ‌ని, ఇది రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌లో చారిత్రాత్మ‌క మార్పున‌కు నాంది అవుతుందని మంత్రి పొంగులేటి వెల్ల‌డించారు.

Advertisement
Advertisement