త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Musi Riverfront | వారం రోజుల్లో మూసీ సుందరీక‌ర‌ణ‌కు టెండ‌ర్లు

Musi Riverfront | ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దూర‌దృష్టితో ప్ర‌ణాళికా బ‌ద్దంగా హైద‌రాబాద్ న‌గ‌రాభివృద్దికి చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 28 కి.మీ. తొలివిడ‌త అభివృద్ధికి వారం ప‌ది రోజుల్లో టెండ‌ర్లు పిల‌వ‌బోతున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

S

Telangana | Published On Jul 25, 2026, 2.55 pm IST

Musi Riverfront | వారం రోజుల్లో మూసీ సుందరీక‌ర‌ణ‌కు టెండ‌ర్లు
Advertisement

రియ‌ల్ ఎస్టేట్ రంగంపై గోబెల్స్ ప్ర‌చారం న‌మ్మొద్దు
రెండున్న‌ర ఏళ్లలో దాదాపు 40 శాతం రియ‌ల్ ఎస్టేట్ వృద్ది
రియ‌ల్ ఎస్టేట్‌తో పాటు పేద‌ల ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత‌
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Musi Riverfront | త్రినేత్ర‌.న్యూస్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దూర‌దృష్టితో ప్ర‌ణాళికా బ‌ద్దంగా హైద‌రాబాద్ న‌గ‌రాభివృద్దికి చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 28 కి.మీ. తొలివిడ‌త అభివృద్ధికి వారం ప‌ది రోజుల్లో టెండ‌ర్లు పిల‌వ‌బోతున్నామ‌ని ఆయ‌న తెలిపారు. శ‌నివారం హైద‌రాబాద్ న‌గ‌రంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు.

రూ. 7 వేల కోట్ల‌తో చేప‌డుతున్న మూసీ ప్రాజెక్ట్ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్నాయ‌ని పేర్కొన్నారు. అదేవిధంగా పాత బ‌స్తీ త‌దిత‌రాల‌ను క‌లుపుతూ రెండ‌వ విడ‌తగా 76 కిలోమీట‌ర్ల మేర రూ. 24 వేల కోట్ల ఖ‌ర్చుతో మెట్రో విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మం ప్రారంభం కానుంద‌ని తెలిపారు. ఇవేగాక త్రిబుల్ ఆర్ నుంచి ఓఆర్ఆర్ క‌లుపుతూ రేడియ‌ల్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాద‌న‌లు సిద్ద‌మ‌వుతున్నాయ‌ని తెలిపారు.

15 నుంచి 20 శాతం రియ‌ల్ ఎస్టేట్ అభివృద్ధి

రాష్ట్రంలో ముఖ్యంగా హైద‌రాబాద్ లో రియ‌ల్ ఎస్టేట్ రంగం కుదేలైంద‌ని కొంత‌మంది ఉద్దేశ‌పూర్వ‌కంగా గోబెల్స్ ప్ర‌చారం సాగిస్తున్నార‌ని దీనిలో ఏమాత్రం నిజం లేదు. ఈ విష‌యంలో స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ శాఖ మంత్రిగా స్ప‌ష్ట‌మైన ఆధారాలు, వివ‌రాలు ఉన్నాయ‌ని అందువ‌ల‌న అటువంటి ప్ర‌చారాల‌ను న‌మ్మాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. గ‌త రెండున్న‌ర సంవ‌త్స‌రాల ప్ర‌జా ప్ర‌భుత్వ పాల‌న‌లో సుమారు 15 నుంచి 20 శాతం రియ‌ల్ ఎస్టేట్ అభివృద్ధి జ‌రిగింద‌ని , 40 శాతం వ‌ర‌కు ఫ్లాట్ల విక్ర‌యాలు వృద్దిచెందాయ‌ని అన్నారు. గ‌డ‌చిన ప‌దేళ్ల‌తో పోలిస్తే ఈ రెండున్న‌ర ఏళ్ల‌లో రెసిడెన్షియ‌ల్ మార్కెట్ విశేషంగా పెరిగింద‌ని, దీనికి సంబంధించి తమ స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో పెరిగిన రిజిస్ట్రేష‌న్ డాక్యుమెంట్ల సంఖ్య‌నే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. రియ‌ల్ ఎస్టేట్ ప‌డిపోయింద‌ని కొంత‌మంది ప‌నిగ‌ట్టుకొని ఈ ప్ర‌భుత్వంపై బుర‌ద చ‌ల్లేందుకు ఈ గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నార‌ని వాటిని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని మంత్రి సూచించారు.

హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఆస‌క్తి

2004 నుంచి 2014 వ‌ర‌కు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నాటి కాంగ్రెస్ ముఖ్య‌మంత్రుల చొర‌వ కార‌ణంగానే హైద‌రాబాద్ ఒక రోల్ మోడ‌ల్‌గా రూపొందింద‌ని, వారి దూర‌దృష్టి వ‌ల్లే ఓఆర్ఆర్‌, అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, ఐటి సెక్టార్ త‌దిత‌రాలు 360 డిగ్రీల కోణంలో అభివృద్ది చెందాయ‌ని వివ‌రించారు. అందువ‌ల్లే హైద‌రాబాద్ ఇప్పుడు దేశంలోనే గాక ప్ర‌పంచంలోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంద‌ని, ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో క‌ల‌సి దావోస్ వెళ్లిన‌పుడు అక్క‌డ కూడా అధిక‌శాతం పారిశ్రామిక వేత్త‌లు హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఆస‌క్తి చూపుతున్నార‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రం పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్ధానం అవుతుంద‌న్నారు.

20 రోజుల్లో భూభార‌తి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం..

ప్ర‌పంచంలోనే సుంద‌ర‌న‌గ‌ర‌మైన హైద‌రాబాద్‌ను రియ‌ల్ ఎస్టేట్ రంగం ప‌క్షాన కూడా మ‌రింత అభివృద్ది చెందడానికి రియ‌ల్ ఎస్టేట్ రంగ ప్ర‌తినిధులు స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని, ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కంగా, స‌కాలంలో ఫ్లాట్ల‌ను అందించి వారి అభిమానాన్ని చూర‌గొనాల‌ని మంత్రి హిత‌వు ప‌లికారు. రాష్ట్రంలో భూముల భ‌ద్ర‌త , భ‌రోసా క‌ల్పించేందుకు భూభార‌తి చట్టాన్ని తీసుకువ‌చ్చామ‌ని , వీటిలో కొన్ని చిన్న చిన్న‌స‌మ‌స్య‌ల‌ను సాఫ్ట్ వేర్ ప‌రంగా 15-20 రోజుల్లో స‌రిచేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు.

క్యూర్ ప‌రిధిలో తొలివిడ‌త‌గా ల‌క్ష ఇందిర‌మ్మ ఇళ్లు

కేవ‌లం రియ‌ల్ ఎస్టేట్ రంగం కోస‌మే గాకుండా పేద‌లకు ఇందిర‌మ్మ ఇళ్లు అందించేందుకు క్యూర్ ప‌రిధిలో తొలివిడ‌త‌గా ల‌క్ష ఇందిర‌మ్మ ఇళ్లు అందించేందుకు నిర్ణ‌యించామ‌ని, దీని త‌ర్వాత ద‌ఫ‌ద‌ఫాలు ఇళ్ల మంజూరు ఉంటుంద‌ని మంత్రి చెప్పారు. ప్ర‌జ‌ల‌కు ఇళ్ల నిర్మాణానికి 2-3 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల స్ధ‌ల సేక‌ర‌ణ‌కు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెబుతూ రియ‌ల్ ఎస్టేట్ రంగ ప్ర‌తినిధుల కోరిక మేర‌కు ఫాస్ట్ ట్రాక్ సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఖ‌మ్మం ఎంపీ రఘురామ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement