Land Survey | మూడు దశల్లో సమగ్ర భూసర్వే.. ఆధార్ తరహాలో భూదార్ కార్డులు
Land Survey | రాష్ట్రంలో భూ సమస్యలు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, భూ యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను మూడు దశల్లో పూర్తి చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
285 గ్రామాల్లో సర్వే పూర్తి..
అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ
వచ్చేనెల చివరినాటికి మొదటి దశ పూర్తికి సన్నాహాలు
మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారు
పాలేరు నియోజకవర్గంలో త్వరలో భూదార్ పట్టాల పంపిణీ
రెవెన్యూ అధికారుల సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Land Survey | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో భూ సమస్యలు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, భూ యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను మూడు దశల్లో పూర్తి చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 285 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి భూ యజమానుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఇప్పటికే ఉన్న 411 రోవర్లకు అదనంగా మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయని పేర్కొన్నారు. భూ సర్వేలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి సంతృప్తే ప్రాధాన్యంగా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా భూ సమస్యలు లేని తెలంగాణ నిర్మాణం కోసం ప్రభుత్వం సమగ్ర రీసర్వేకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. శనివారం సచివాలయంలో రెవెన్యూ అధికారులతో భూ సర్వే పురోగతిపై నిర్వహించిన సుదీర్ఘ సమీక్షలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలకు గానూ తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలలో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసి, నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కూడా కలుపుకొని మొత్తం 2,720 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 285 గ్రామాల్లో సర్వే పూర్తయిందని వెల్లడించారు. భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది అతని జీవనాధారమని మంత్రి పేర్కొన్నారు. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూదార్, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ యాజమాన్య హక్కులపై స్పష్టత తీసుకురావడంతో పాటు తరతరాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు పరిష్కారం చూపడంలో సమగ్ర రీసర్వే కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం
గతంలో భూముల కొలతలకు ఉపయోగించిన గొలుసులు, కర్రలు, క్రాస్‌స్టాఫ్, మెజరింగ్ టేపుల వంటి సంప్రదాయ పరికరాలకు స్వస్తి పలుకుతూ డీజీపీఎస్, రోవర్లు, జీఐఎస్, క్యూజీఐఎస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా భూముల కొలతల్లో కచ్చితత్వం పెరగడంతో పాటు సర్వే వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరిచి, భవిష్యత్తులో సరిహద్దులపై వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవచ్చన్నారు.
ప్రతి భూకమతానికి కచ్చితమైన సరిహద్దులు
రీసర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూకమతానికి కచ్చితమైన సరిహద్దులను నిర్ణయించి, ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆధార్ తరహాలో ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపునిచ్చేలా భూదార్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు.
అన్ని సర్వే నంబర్లకు దశలవారీగా భూదార్ నంబర్లు
డీజీపీఎస్ ద్వారా సేకరించిన సర్వే సమాచారాన్ని క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేసి భూ భారతి పోర్టల్‌లో నమోదు చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నంబర్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 2 కోట్ల 29 లక్షలకు పెరిగిందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని సర్వే నంబర్లకు దశలవారీగా భూదార్ నంబర్లు కేటాయించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందించిందని తెలిపారు.
త్వరలో పాలేరులో భూదార్ పట్టాల పంపిణీ
రీసర్వే ద్వారా ప్రతి భూకమతానికి కచ్చితమైన సరిహద్దులు, ప్రత్యేక సర్వే పటాలు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా భూ యాజమాన్య హక్కులపై స్పష్టత పెరగడంతో పాటు భవిష్యత్తులో భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సమయంలో ఎదురయ్యే సమస్యలను తగ్గించేందుకు వీలవుతుందన్నారు. తన సొంత నియోజకవర్గమైన పాలేరులోని నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పరిధిలో ఉన్న మొత్తం 665 ఎకరాలలో వందశాతం రీసర్వేను విజయవంతంగా పూర్తిచేశామని త్వరలో భూదార్ పట్టాల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.
భూ యజమానులు సంతృప్తి చెందేలా
సర్వే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, భూ యజమానులు సంతృప్తి చెందేలా ప్రతి చర్య చేపట్టాలని స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా కోణంలోనే ఆలోచించాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Dudimetla Balaraju Yadav | కేసీఆర్ ఫ్యామిలీపై అబద్ధాలు చెప్పే ఆ ఆరుగురు ఎవరంటే..
- ●BCCI | బీసీసీఐ సెలక్టర్ రేసులో వసీం జాఫర్.. చీఫ్ సెలక్టర్ పీఠంపై ఉత్కంఠ!
- ●Anirudh - Kavya Maran | నవంబర్‌లో అనిరుధ్, కావ్యమారన్ వివాహం - ప్రముఖులకు ఆహ్వానం
- ●PM-AJAY Scheme Adarsh Grams | పీఎం-అజయ్ పథకం ఘనత: 18,093 ఆదర్శ గ్రామాలు.. పూర్తయిన విద్యార్థి హాస్టళ్లు ఇవే!
- ●Director | దర్శకుడిగా కల నెరవేరిన మరుసటిరోజే విషాదం - మలయాళ యంగ్ డైరెక్టర్ హఠాన్మరణం
- ●SIP | ఉద్యోగం కోల్పోతే ఎస్ఐపీకి దెబ్బ.. గ్యాప్ తరువాత ఎంత పెంచాలి..?

Dudimetla Balaraju Yadav | కేసీఆర్ ఫ్యామిలీపై అబద్ధాలు చెప్పే ఆ ఆరుగురు ఎవరంటే..

BCCI | బీసీసీఐ సెలక్టర్ రేసులో వసీం జాఫర్.. చీఫ్ సెలక్టర్ పీఠంపై ఉత్కంఠ!

Anirudh - Kavya Maran | నవంబర్‌లో అనిరుధ్, కావ్యమారన్ వివాహం - ప్రముఖులకు ఆహ్వానం

PM-AJAY Scheme Adarsh Grams | పీఎం-అజయ్ పథకం ఘనత: 18,093 ఆదర్శ గ్రామాలు.. పూర్తయిన విద్యార్థి హాస్టళ్లు ఇవే!





