త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BCCI | బీసీసీఐ సెలక్టర్‌ రేసులో వసీం జాఫర్‌.. చీఫ్‌ సెలక్టర్‌ పీఠంపై ఉత్కంఠ!

BCCI | భారత క్రికెట్‌ జట్టు సీనియర్ మెన్స్ సెలక్షన్‌ కమిటీలో ఖాళీగా ఉన్న ఐదో సభ్యుడి నియామకం కీలక దశకు చేరింది. ఈ పదవి కోసం మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ పేరు తెరపైకి రావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లకు వర్చువల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించింది.

P

Sports | Published On Oct 17, 2026, 5.21 pm IST

BCCI | బీసీసీఐ సెలక్టర్‌ రేసులో వసీం జాఫర్‌.. చీఫ్‌ సెలక్టర్‌ పీఠంపై ఉత్కంఠ!
Advertisement

BCCI | భారత క్రికెట్‌ జట్టు సీనియర్ మెన్స్ సెలక్షన్‌ కమిటీలో ఖాళీగా ఉన్న ఐదో సభ్యుడి నియామకం కీలక దశకు చేరింది. ఈ పదవి కోసం మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ పేరు తెరపైకి రావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లకు వర్చువల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించింది. జాఫర్‌తో పాటు మాజీ స్పిన్నర్‌ రమేశ్‌ పొవార్‌, మాజీ పేసర్‌ సలీల్‌ అంకోలా, బరోడా మాజీ క్రికెటర్లు జాకబ్‌ మార్టిన్‌, కానర్‌ విలియమ్స్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఈ పదవికి బలమైన పోటీదారుగా భావించిన పార్థివ్‌ పటేల్‌ దరఖాస్తు చేయలేదు. దీంతో ఐదో సెలక్టర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

చీఫ్‌ సెలక్టర్‌ పీఠంపైనా ప్రభావం

టీమిండియా మాజీ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పదవి నుంచి వైదొలగడంతో ఈ ఖాళీ ఏర్పడింది. దీంతో కొత్త సెలక్టర్‌ నియామకానికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రస్తుతం మాజీ భారత స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు నిర్వ‌హిస్తున్నాయి. అయితే, కొత్త సభ్యుడి నియామకం కేవలం ఖాళీని భర్తీ చేయడానికే పరిమితం కాకపోవచ్చని తెలుస్తోంది. కమిటీ నాయకత్వంలోనూ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. బీసీసీఐ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఐదుగురు సభ్యుల సెలక్షన్‌ కమిటీలో అత్యధిక టెస్టులు ఆడిన వ్యక్తికి చీఫ్‌ సెలక్టర్‌ బాధ్యతలు దక్కుతాయి. ఈ నేపథ్యంలో జాఫర్‌ అభ్యర్థిత్వానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఆయన భారత్‌ తరఫున 31 టెస్టులు ఆడగా, ప్రజ్ఞాన్‌ ఓజా 24 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించారు. ఒకవేళ జాఫర్‌ సెలక్షన్‌ కమిటీలో సభ్యుడిగా నియమితులైతే, టెస్టుల అనుభవం పరంగా ఓజా కంటే ముందుంటారు. తుది నియామకం, కమిటీ నాయకత్వంపై బీసీసీఐ ప్రక్రియ ప్రకారమే నిర్ణయం వెలువడనుంది.

దేశవాళీ క్రికెట్‌లో జాఫర్‌కు ఘనమైన రికార్డు

వసీం జాఫర్‌ భారత దేశవాళీ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 19 వేలకుపైగా పరుగులు సాధించాడు. ముంబ‌యి, విదర్భ జట్ల తరఫున రంజీ ట్రోఫీలో విశేషంగా రాణించాడు. ఆటగాడిగానే కాకుండా కోచ్‌గా కూడా అనుభవం సంపాదించాడు. ఐపీఎల్‌లో కోచింగ్‌ బాధ్యతలు నిర్వహించడంతో పాటు భారత్‌, బంగ్లాదేశ్‌ అండర్‌-19 జట్లతోనూ పనిచేశాడు. విదర్భ జట్టుకు సలహాదారుగా వ్యవహరించిన ఆయన.. 2026-27 దేశవాళీ సీజన్‌లో హైదరాబాద్‌ జట్టుకు మెంటార్‌గా సేవలందిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌పై లోతైన అవగాహన, కోచింగ్‌ అనుభవం ఆయన అభ్యర్థిత్వానికి బలంగా మారాయి.

రేసులో పొవార్‌, అంకోలా

సెలక్టర్‌ పదవికి రమేశ్‌ పొవార్‌, సలీల్‌ అంకోలా పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ పొవార్‌ రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడారు. భారత మహిళల క్రికెట్‌ జట్టుకు రెండు విడతల్లో ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు. గతంలో జూనియర్‌ పురుషుల సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ పదవికి కూడా ఆయన పేరు పరిశీలనలోకి వచ్చింది. మాజీ ముంబ‌యి పేసర్‌ సలీల్‌ అంకోలా భారత్‌ తరఫున ఒక టెస్టు, 20 వన్డేలు ఆడారు. 2023 జనవరి నుంచి 2024 ఆగస్టు వరకు జాతీయ సెలక్టర్‌గా పనిచేశారు. అనంతరం ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని ఆయన స్థానంలో అజయ్‌ రాత్రాను నియమించారు. మరోవైపు, మాజీ భారత క్రికెటర్లు జాకబ్‌ మార్టిన్‌, కానర్‌ విలియమ్స్‌ కూడా ఇంటర్వ్యూ ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తోంది. మార్టిన్‌ భారత్‌ తరఫున 10 వన్డేల్లో ఆడారు.

జూనియర్‌ సెలక్షన్‌ కమిటీలోనూ మార్పులుంటాయా?

సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ నియామకం జూనియర్‌ పురుషుల సెలక్షన్‌ కమిటీ కూర్పుపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. జూనియర్‌ కమిటీ చైర్మన్‌ పదవికి గతంలో పొవార్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, ఆయన సీనియర్‌ సెలక్షన్‌ కమిటీలోకి వస్తే జూనియర్‌ ప్యానెల్‌ కోసం ఇతర పేర్లను పరిశీలించాల్సి రావచ్చు. ఈ క్రమంలో మాజీ భారత పేసర్లు దొడ్డ గణేశ్‌, అర్జున్‌ యాదవ్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కీల‌కం..

2027 వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో సెలక్షన్‌ కమిటీ నియామకం బీసీసీఐకి కీలకంగా మారింది. ఆటగాళ్ల ప్రదర్శనల అంచనా, జట్టు కూర్పు, యువ ప్రతిభకు అవకాశాలు కల్పించడం, ప్రధాన టోర్నీలకు జట్టును సిద్ధం చేయడం వంటి అంశాల్లో సెలక్టర్ల నిర్ణయాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో ఐదో సభ్యుడి ఎంపికతో పాటు కమిటీ నాయకత్వంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఐదో సీనియర్‌ సెలక్టర్‌ ఎంపికపై క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వసీం జాఫర్‌ పేరు తెరపైకి రావడంతో సెలక్టర్‌ పదవితో పాటు చీఫ్‌ సెలక్టర్‌ పీఠంపైనా ఆసక్తి నెలకొంది. బీసీసీఐ ఎవరికి అవకాశం కల్పిస్తుంది? సెలక్షన్‌ కమిటీ పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయి? అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement