త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Narahari | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి..!

Narahari | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్‌ సంతోష్‌ భార్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం జార్ఖండ్‌ సరండా ఫారెస్ట్‌లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి.

P

Telangana | Published On May 12, 2026, 9.27 am IST

Narahari | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి..!
Advertisement

Narahari | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్‌ సంతోష్‌ భార్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం జార్ఖండ్‌ సరండా ఫారెస్ట్‌లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. పొలిట్‌ బ్యూరో మిసిర్‌ బెస్రా కోసం బలగాలు గాలింపు చేపట్టాయి. పోలీసుల కూంబింగ్‌ మరింత ముమ్మరం కావడంతో నరహరి లొంగిపోయినట్లు తెలుస్తోంది. దాదాపుగా నాలుగున్నర దశాబ్దాలకుపైగా అడవిబాట పట్టారు. నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లా కాశిపేట మండలం సోమిడి. నరహరి భార్య ఏపీకి చెందిన మహిళగా సమాచారం.

సోమనారాయణ-నర్సమ్మ దంపతుల ఐదుగురు సంతానంలో రెండో కొడుకు నరహరి. యుక్త వయసులోనే నక్సల్స్‌ ఉద్యమానికి ప్రభావితమయ్యాడు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే నక్సల్స్‌ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. 1980 ప్రారంభంలో అప్పటి ఉద్యమ నేతలు పులి అంజయ్య, క్రాంతి రాందేవ్‌తో ఏర్పడిన పరిచయం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఆ పరిచయంతోనే ఆయన అజ్ఞాత జీవితం వైపు నడిపించాయని సన్నిహితులు చెబుతుంటారు. గ్రామంలో ఉన్న సమయంలోనే నరహరి కూలీ రేట్ల పెంపు కోసం ఉద్యమాలు చేపట్టడంతో పాటు భూస్వాములు, స్థానిక గుండాలపై పోరాటాలకు నాయకత్వం వహించినట్లు చెబుతున్నారు. అప్పట్లో రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఆర్‌ఈసీ)లో ఉన్న ఉద్యమ నేతల ప్రసంగాలు ఆయనపై తీవ్ర ప్రభావం చూపినట్లు సమాచారం.

తర్వాత పోలీసుల ఒత్తిడి, నిర్బంధం పెరగడంతో ఆయన అడవి బాట పట్టి పూర్తిగా అజ్ఞాత జీవితం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ మావోయిస్టు ఉద్యమంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. దీర్ఘకాలంగా అజ్ఞాతంలో కొనసాగిన కేంద్ర కమిటీ సభ్యుడి లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగులుతోంది. పెద్ద ఎత్తున మావోయిస్టులు అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. పలు ఎన్‌కౌంటర్లలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు వదిలారు. లొంగిపోయిన, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో అగ్రనేతలు సైతం ఉన్నారు.

Advertisement
Advertisement