త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummidihetti Barrage | మా వాళ్లు వ్యతిరేకించకపోతేనే.. మేం తుమ్మిడిహెట్టి ఎత్తుపై పరిశీలిస్తాం

Tummidihetti Barrage | మహారాష్ట్ర ప్రజలు వ్యతిరేకించకపోతే తుమ్మిడి హెట్టి బ్యారేజీ( Tummidihetti Barrage ) ఎత్తుపై తాము పున:సమీక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్( Devendra Fadnavis ) స్పష్టం చేశారు. బ్యారేజీ ఎత్తుకు సంబంధించి సాంకేతిక అధ్యయనాలు జరిగిన తర్వాతే ఓ తుది నిర్ణయానికి రావాల్సి ఉంటుందని చెప్పారు.

S

Telangana | Published On Oct 26, 2026, 7.03 pm IST

Tummidihetti Barrage | మా వాళ్లు వ్యతిరేకించకపోతేనే.. మేం తుమ్మిడిహెట్టి ఎత్తుపై పరిశీలిస్తాం
Advertisement
  • అన్ని అంశాలపై మళ్లీ అధ్యయనం జరగాలి
  • ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం
  • మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్
  • ముంబైలో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ
  • 152 మీటర్ల ఎత్తుపై నిర్ణయించాలన్న
  • తెలంగాణ ప్రతిపాదనపై కీలక చర్చలు
  • మహారాష్ట్ర సీఎం సానుకూలంగా స్పందించారు : సీఎం రేవంత్ రెడ్డి

ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాలి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానంగా వెనుకబడిన అటవీ ప్రాంతం. కొమురం భీమ్ సాగించిన జల్, జంగిల్, జమీన్ పోరాటం చిరస్మరణీయం. ఆ పోరాట కాలం నుంచి ఆదిలాబాద్ ప్రాంత ప్రజలు సాగు, తాగునీటి సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారు. దశాబ్దాలుగా వారి ఆకాంక్షలు నెరవేరలేదు. ఆదిలాబాద్ గిరిజనులు, ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉంది. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు మీరు (మహా రాష్ట్ర సీఎం ఫడ్నవీస్) తప్పకుండా హాజరుకావాలి.

- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పరిహారం చెల్లిస్తాం

2016లో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరింది. ఆ ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే తెలంగాణ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవు. తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడమే అత్యంత ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయం. బ్యారేజీ నిర్మాణంతో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు మహారాష్ట్రలో అమల్లో ఉన్న భూసేకరణ నిబంధనలు, ఆ రాష్ట్ర పరిహార విధానం ప్రకారం రైతులకు పరిహారం చెల్లిస్తాం.

- నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మా వాళ్లు వ్యతిరేకించకపోతే.. మేం ఓకే

తుమ్మిడిహెట్టి బ్యారేజీ 148 మీటర్ల ఎత్తు అంశాన్ని పున: పరిశీలించేందుకు మేం సిద్ధమే. కానీ తుది నిర్ణయానికి వచ్చే ముందు అనేక అంశాలపై అధ్యయనం చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు వ్యతిరేకించకపోతే మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో కేంద్ర జల సంఘం (CWC) తన పరిధిలో అవసరమైన అధ్యయనాలు చేపడుతుంది. సాంకేతిక పరిశీలనలు కొనసాగిస్తుంది. ఈలోపు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలి.బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యతపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయాలి. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములు, ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాలి. పరిహారం, ఇతర సాంకేతిక అంశాలను కూడా అధ్యయనం చేయాలి.

- మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

Tummidihetti Barrage | త్రినేత్ర న్యూస్ : మహారాష్ట్ర ప్రజలు వ్యతిరేకించకపోతే తుమ్మిడి హెట్టి బ్యారేజీ( Tummidihetti Barrage ) ఎత్తుపై తాము పున:సమీక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్( Devendra Fadnavis ) స్పష్టం చేశారు. బ్యారేజీ ఎత్తుకు సంబంధించి సాంకేతిక అధ్యయనాలు జరిగిన తర్వాతే ఓ తుది నిర్ణయానికి రావాల్సి ఉంటుందని చెప్పారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ), నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ సంజయ్ జాజూ, ప్రధాన సలహాదారు రామకృష్ణారావుల బృందం ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమైంది. ఈ భేటీకి రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై కీలక చర్చలు జరిగాయి. బ్యారేజీ ఎత్తు పెంపు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, ఇతర సాంకేతిక అంశాలపై చర్చించారు.

148 మీటర్ల ఎత్తుతో.. నీళ్లు రావు : మంత్రి ఉత్తమ్

తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మహారాష్ట్ర సీఎంకు, అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించేందుకు 1975 అక్టోబర్ 6న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, ఎస్బి చవాన్ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి.. ఈ రోజు వరకు వివిధ దశల్లో ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. 2016లో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరిందని గుర్తుచేశారు. అయితే, ఈ ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే తెలంగాణ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ పరిస్థితుల్లో తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడమే అత్యంత ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయమని వివరించారు. మహారాష్ట్రలో అమల్లో ఉన్న భూసేకరణ నిబంధనలు, ఆ రాష్ట్ర పరిహార విధానం ప్రకారం రైతులకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు.

కలిసికట్టుగా ముందుకు సాగుదాం : సీఎం రేవంత్ రెడ్డి

ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ–మహారాష్ట్ర మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తుచేశారు. కొమురం భీమ్ సాగించిన జల్, జంగిల్, జమీన్ పోరాటాన్ని గుర్తుచేశారు. ఆ పోరాట కాలం నుంచి ఆదిలాబాద్ ప్రాంత ప్రజలు సాగు, తాగునీటి సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదన్నారు. రెండు రాష్ట్రాలను భౌతికంగా అనుసంధానించే వారధిగా కూడా నిలుస్తుందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమానికి రెండు రాష్ట్రాల సహకారం అవసరమన్నారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు.

పరిశీలిస్తాం.. కానీ : మహా సీఎం ఫడ్నవీస్

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును పెంచాలన్న తెలంగాణ అభ్యర్థనను మరోసారి పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే, తుది నిర్ణయానికి వచ్చే ముందు పలు అంశాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్రకు, తమ ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోతే 148 మీటర్ల ఎత్తు ఒప్పందాన్ని పున: పరిశీలించేందుకు అభ్యంతరం లేదన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో కేంద్ర జల సంఘం తన పరిధిలో అవసరమైన అధ్యయనాలు చేపడుతుందని తెలిపారు. సాంకేతిక పరిశీలనలు కొనసాగిస్తుందన్నారు. ఈలోపు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ ప్రతిపాదించారు. బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యతపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములు, ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాలన్నారు. పరిహారం, ఇతర సాంకేతిక అంశాలను కూడా అధ్యయనం చేయాలన్నారు. ముంపు ప్రభావం, ప్రభావిత భూముల విస్తీర్ణంపై రెండు రాష్ట్రాల అంచనాలను పరిశీలించాలని సూచించారు. ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయాలను కూడా అధ్యయనం చేయాలన్నారు.

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సుకు ఆహ్వానం

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు హాజరుకావాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తి ఉందని తెలిపారు. హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement