త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లే లేవు

Harish Rao | తుమ్మిడిహెట్టి వద్ద.. తెలంగాణ ఆశిస్తున్నన్ని నీళ్లు లేవని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయాన్ని 2015లో కేంద్ర జల సంఘం స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు.

S

Telangana | Published On Oct 26, 2026, 6.55 pm IST

Harish Rao | తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లే లేవు
Advertisement

మనకు అవసరమైన నీటి లభ్యత లేదు
ఈ విషయాన్ని 2015లోనే
కేంద్ర జల సంఘం రూఢీ చేసింది
మీ అసమర్థత వల్లే ఈ కరువు
ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

Harish Rao | త్రినేత్ర న్యూస్ : తుమ్మిడిహెట్టి వద్ద.. తెలంగాణ ఆశిస్తున్నన్ని నీళ్లు లేవని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయాన్ని 2015లో కేంద్ర జల సంఘం స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎల్ నినోపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. "2015 ఫిబ్రవరిలోనే కేంద్ర జల సంఘం తెలంగాణకు లేఖ రాసింది. మనకు అవసరమైనన్ని నీళ్లు లేవని ఆ లేఖలో స్పష్టంగా చెప్పింది. అందుకే ప్రత్యామ్నాయం కూడా చూసుకోవాలంటూ సలహా ఇచ్చింది. మీరు తుమ్మిడిహెట్టి సాధించుకొని వస్తే మేం స్వాగతిస్తాం. కానీ ఇప్పటికే 240 టీఎంసీలు ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి.. జనాల్ని కరువు కరువు అని ఎందుకు బెదిరిస్తున్నారు? కేవలం కేసీఆర్ గారికి పేరు వస్తదనే రాజకీయ కక్షతోనే కన్నెపల్లి మోటర్లు ఆన్ చేయకుండా, నీళ్లు ఎత్తకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు లేని కరువును రుద్దుతోంది. 'కరువు కరువు' అని ప్రజల మీద లేని ప్రేమను చూపుతూ, మనుషులు, పక్షులు చచ్చిపోతాయని ప్రజలను భయపెడుతున్నారు... కానీ నీళ్లుండి కూడా శ్రీశైలంలో, కల్వకుర్తిలో నీళ్లు ఎత్తలేని అసమర్థత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది" అని విమర్శించారు.

ఎన్ని మోటార్లు నడుపుతున్నారు

ఎత్తిపోతల పథకాల్లో ఎక్కడ ఎన్ని పంపులు ఎన్ని గంటలు నడుపుతున్నారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. "కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరకి మా కేటీఆర్ గారు, మా ఎమ్మెల్యేలు వెళ్లి మరి చెప్పారు పంపులు ఆన్ చేయమని...రిటైర్డ్ ఇంజనీర్లు సైతం మోటర్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తమని చెబితే... ఆ రిటైర్డ్ ఇంజనీర్లను బెల్ట్‌తో కొడతామని, జైల్లో పెడతాను అని రేవంత్ రెడ్డి అనటం ఎంత వరకు సమంజసం? ఐదు మోటర్లు ఉన్న కల్వకుర్తిలో ప్రస్తుతం కేవలం రెండే మోటర్లు నడుపుతున్నారు. రోజుకు 24 గంటలు నడపాల్సింది పోయి, కేవలం 12 గంటలే నడిపిస్తున్నారు. శ్రీశైలంలో తెలంగాణ ఎంత వాడింది, ఆంధ్రప్రదేశ్ ఎంత వాడింది, కల్వకుర్తి మోటర్లు ఎన్ని రోజులు, ఎన్ని గంటలు నడిపారో ప్రభుత్వం వెంటనే వైట్ పేపర్ విడుదల చేయాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టిసీమ మోటార్లు 100 రోజులు, 24 గంటలు నిరాటంకంగా నడిచి గోదావరి-కృష్ణా డెల్టాను కాపాడుకుంటున్నాయి. మరి అదే గోదావరి నదిపై సమ్మక్క బ్యారేజ్ కట్టి, దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి మీ చేతిలో పెడితే మీరేం చేస్తున్నారు? సమ్మక్క బ్యారేజ్ నుంచి దేవాదులలో మీరు ఎన్ని రోజులు మోటార్లు నడిపారు? ఎన్ని గంటలు నడిపారు? ఎన్ని నీళ్లు ఎత్తారో దమ్ముంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పజెప్పిన ప్రాజెక్టులను నడపచేతగాక, నీళ్లు ఎత్తక, వరంగల్ జిల్లా ప్రజల మీద లేని కరువును రుద్దింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దేవాదుల ప్రాజెక్టును సరిగ్గా నడిపిస్తే కరీంనగర్‌తో పాటు హుస్నాబాద్‌కు నీళ్లు వచ్చి మొత్తం వరంగల్ జిల్లా సస్యశ్యామలం అయ్యేది" అని విమర్శించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement