త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | దేవాల‌యాల్లో స్థానిక వేద పండితుల‌నే నియ‌మించాలి

Harish Rao | తెలంగాణ ప్రముఖ దేవాలయాల్లో రాష్ట్ర వేద పండితులనే నియమించాలని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది వేద పండితులున్నారని.. వారికి దక్కాల్సిన అవకాశాలు ఇతర రాష్ట్రాల వారికి ఇవ్వడంపై ఆయ‌న‌ ఆందోళన వ్యక్తం చేశారు.

S

Telangana | Published On Jun 30, 2026, 12.50 pm IST

Harish Rao | దేవాల‌యాల్లో స్థానిక వేద పండితుల‌నే నియ‌మించాలి
Advertisement
  • వేదాలు వల్లించే పండితులను కాంగ్రెస్ వేధిస్తోంది
  • యాదాద్రి, బాస‌ర‌, భ‌ద్రాచ‌లం ఆల‌యాల్లో అన్యాయం జ‌రుగుతోంది
  • స్థానిక రిజ‌ర్వేష‌న్ నిబంధ‌న‌లు క‌చ్చితంగా అమ‌లు చేయాలి
  • మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణ ప్రముఖ దేవాలయాల్లో రాష్ట్ర వేద పండితులనే నియమించాలని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఇక్క‌డి దేవాలయాల్లో ఇతర రాష్ట్రాల వేద పండితులను నియమించడం బాధాకరమ‌న్నారు. రాష్ట్రంలో ఎంతో మంది వేద పండితులున్నారని.. వారికి దక్కాల్సిన అవకాశాలు ఇతర రాష్ట్రాల వారికి ఇవ్వడంపై ఆయ‌న‌ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆయన మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో డిమాండ్ చేశారు.

తెలంగాణలోని యాదాద్రి, బాసర, భద్రాచలం తదితర ప్రముఖ దేవాలయాల్లో జరుగుతున్న వేద పండితుల నియామకాల్లో స్థానికులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ తెలంగాణ వేద పండితుల ప్రతినిధులు హరీశ్‌రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడారు.

వేద పండితుల నియామకాల్లో, సెలెక్షన్ కమిటీల్లో స్థానిక వేద పండితులకే అవకాశాలు ఇవ్వాలి. ప్రముఖ దేవాలయాల్లో వేదాలు వల్లించే వేద పండితులను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేధించడం బాధాకరం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రంలోని దేవాలయాల్లో స్థానిక వేద పండితులకు దక్కాల్సిన అవకాశాలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి వెళ్తున్నాయన్న ఆరోపణలు ఆందోళనకరం. తెలంగాణ యువత, స్థానిక వేద పండితుల హక్కులను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

ఇక్క‌డి దేవాలయాల్లో భర్తీ చేసే వేద పండితుల పోస్టుల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలి. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జ‌ర‌గాలి. ఇంటర్వ్యూ బోర్డుల్లో కూడా తెలంగాణకు చెందిన అర్హులైన వేద పండితులకే అవకాశం కల్పించాలి. స్థానికుల హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యం. స్థానిక వేద పండితులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండకూడదు అని ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన అర్హులైన వేద పండితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నియామక ప్రక్రియను సమీక్షించాలి. స్థానికులకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలి అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement