త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కాంగ్రెస్ యూత్ డిక్ల‌రేష‌న్ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రిద్దాం.. విద్యార్థుల యువ‌జ‌న స‌భ‌లో అన్నీ చెబుదాం

KTR | హైద‌రాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో ఈ నెల 18న యువత, విద్యార్థులతో భారీ యువజన సదస్సు నిర్వహించి కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజల ముందుంచనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు.

S

Telangana | Published On Jul 16, 2026, 6.14 pm IST

KTR | కాంగ్రెస్ యూత్ డిక్ల‌రేష‌న్ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రిద్దాం.. విద్యార్థుల యువ‌జ‌న స‌భ‌లో అన్నీ చెబుదాం
Advertisement
  • ఈ ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల‌ను మోసం చేసింది
  • ఎల్లుండి స‌రూర్‌న‌గ‌ర్ స‌భ‌లో గ‌ట్టిగా ప్ర‌శ్నిద్దాం
  • గ్రేటర్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల స‌మావేశంలో కేటీఆర్  

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో ఈ నెల 18న యువత, విద్యార్థులతో భారీ యువజన సదస్సు నిర్వహించి కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజల ముందుంచనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. గురువారం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. స‌భ‌కు కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని, అలాంటి ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. సగం పదవీకాలం పూర్తికాక ముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన మోసకారి ప్రభుత్వంగా కాంగ్రెస్ త‌యారైంది. అందుకే సమాజంలోని ప్రతి వర్గం ఆ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆడబిడ్డల నుంచి అన్నదాతల వరకు, విద్యార్థుల నుంచి నిరుద్యోగ యువత వరకు ఏ ఒక్కరికీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, అవినీతి, స్కామ్‌లు, అక్రమాలు, అరాచకాలనే పాలనగా మార్చుకున్నారు అని కేటీఆర్ ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు, అనుసరిస్తున్న విధానాలు, సాగిస్తున్న పాలన ప్రజా కంటకంగా మారాయి. స్వయంగా ముఖ్యమంత్రి చేయించుకున్న సర్వేలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ కాలం ముగిసిపోతుందనే ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతూ తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు ప‌డుతుంటే వారికి భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి "రక్తం పారిస్తా" అన్నట్లుగా మాట్లాడటం అత్యంత దురదృష్టకరం అని ఆయ‌న‌ అన్నారు.

ఒకవైపు రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో, కరువు అంచున ఉంది. ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలందరిలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. చివరకు రైతులు కూడా "మా రక్తాన్ని తీసుకోండి.. కానీ మా పొలాలకు నీళ్లు ఇవ్వండి" అని డిమాండ్ చేసే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది.

యువత, నిరుద్యోగుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం "యూత్ డిక్లరేషన్" పేరిట భారీ మోసం చేసింది. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎప్పటికప్పుడు ఆ మోసాన్ని ఎండగడుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లలోని హామీల అమలు వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ వరుసగా సభలు నిర్వహిస్తోంది. వరంగల్ రైతు సభ అనంతరం ఈ నెల 18న సరూర్‌నగర్ స్టేడియంలో యువత, విద్యార్థులతో భారీ యువజన సదస్సు నిర్వహించి కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజల ముందుంచుతాం అని కేటీఆర్ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ నాయ‌కులు మాట్లాడుతూ హైదరాబాద్‌తో పాటు పరిసర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా భారీ సంఖ్యలో యువత స్వచ్ఛందంగా సభకు తరలివస్తారని కేటీఆర్‌కు వివరించారు.

 

Advertisement
Advertisement