త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | దక్షిణాది, చిన్న రాష్ట్రాలను ఏకం చేస్తాం.. పార్లమెంట్‌లో ఆ బిల్లు ఎలా ఆమోదిస్తారో చూస్తాం: సీఎం రేవంత్ ఫైర్

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సాధించిన తమ ఎంపీలు ఇప్పుడు డీలిమిటేషన్‌పై కూడా అదే స్ఫూర్తితో పోరాడుతారని, దక్షిణాది సహా చిన్న రాష్ట్రాలను ఏకం చేసి పార్లమెంటులో బిల్లును అడ్డుకుంటామని హెచ్చరించారు.

J

Telangana | Published On Apr 13, 2026, 7.13 pm IST

CM Revanth Reddy | దక్షిణాది, చిన్న రాష్ట్రాలను ఏకం చేస్తాం.. పార్లమెంట్‌లో ఆ బిల్లు ఎలా ఆమోదిస్తారో చూస్తాం: సీఎం రేవంత్ ఫైర్

సంక్షిప్త సారాంశం

సీట్ల పునర్విభజన పేరుతో కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ డీలిమిటేషన్ బిల్లును అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తామని తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తమ ఎంపీలు ఈ అంశంపైనా రాజీలేని పోరాటం చేస్తారన్నారు. మరోవైపు బీజేపీలో మహిళలకు ప్రాధాన్యం లేదని, 46 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఒక్క మహిళను కూడా జాతీయ అధ్యక్షురాలిగా చేయలేదని ఆయన విమర్శించారు.

Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : "మా ఎంపీలు ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పైనా అదే స్థాయిలో పోరాడుతారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశంలోని చిన్న రాష్ట్రాలను సైతం ఐక్యం చేస్తాం. పార్లమెంట్‌లో ఆ బిల్లును వాళ్లు ఎలా ఆమోదిస్తారో మేము కూడా చూస్తాం" అంటూ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి హెచ్చరికలు పంపారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కేంద్రం తీరు, బీజేపీ విధానాలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

నెంబర్లే ముఖ్యం.. బాగా పనిచేస్తున్న రాష్ట్రాలను శిక్షించొద్దు

రాజ‌కీయాల్లో ప‌ర్సంటేజీలు కాదని, ఎప్పుడైనా నెంబర్లే (సంఖ్యా బలం) ముఖ్యమని రేవంత్ స్పష్టం చేశారు. సంఖ్యా బలం లేకపోతే రాజకీయాల్లో ఎవరూ ఎవరితోనూ కనీసం చర్చలు కూడా జరపరని, ఒకే ఒక్క ఓటు తక్కువై వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయిన చరిత్రను ఆయన గుర్తుచేశారు. జనాభా నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తున్న దక్షిణాది రాష్ట్రాలను సీట్ల పెంపు పేరుతో శిక్షించడం ఏమాత్రం తగదన్నారు. ఈ డీలిమిటేషన్ వల్ల కేవలం దక్షిణాదికే కాకుండా ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అందుకే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాసి వారిని ఐక్యం చేస్తామని ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన 50 శాతం సీట్ల పెంపు జరిగితే.. భవిష్యత్తులో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి బీజేపీ నేతలు ప్రధాని మోదీ ఇంటి ముందు బంట్రోతులుగా నిలబడాల్సి వస్తుందే తప్ప, వారికి ఎలాంటి ప్రాధాన్యత మిగలదని ఎద్దేవా చేశారు.

46 ఏళ్లలో ఒక్క మహిళను అధ్యక్షురాలిని చేశారా?

బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్.. మహిళల పట్ల ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నించారు. "1980 ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భవించింది. ఇప్పటి వరకు ఆ పార్టీకి 15 మంది జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. కానీ ఈ 46 ఏళ్ల కాలంలో ఒక్క మహిళను కూడా బీజేపీ అధ్యక్షురాలిగా ఎందుకు నియమించలేదు?" అని నిలదీశారు. కనీసం జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) పదవి కూడా మహిళలకు ఇవ్వలేదని, మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చిన్నచూపు చూడటమే బీజేపీ లక్షణమని ధ్వజమెత్తారు. బీజేపీకి ఒక మహిళను అధ్యక్షురాలిగా నియమించుకున్న తర్వాతే బండి సంజయ్ మాట్లాడాలని హితవు పలికారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దక్షిణాది రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మహిళలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు.

దేశాన్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్‌దే

ఇందిరాగాంధీ, సోనియా గాంధీల నాయకత్వంలో అత్యధిక కాలం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎన్నడూ అన్యాయం చేయబోదన్నారు. 60 ఏళ్ల చరిత్రలో మహిళల సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందని గుర్తుచేశారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది, రాజ్యాంగాన్ని అమలు చేసింది, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని.. ఇప్పుడు ప్రమాదంలో ఉన్న దేశాన్ని కాపాడుకునే బాధ్యత కూడా తమపైనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement