త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lawyer Kasarla Jalender Reddy | బిచ్చ‌గాడు సినిమాకు మించిన క‌థ ఇది.. ఈ ‘లాయ‌ర్’ విషాద గాథ వింటే క‌న్నీరు పెట్టుకోవాల్సిందే..!

Lawyer Kasarla Jalender Reddy | అచ్చం బిచ్చ‌గాడు సినిమాను పోలిన క‌థ ఇది. కోట్లకు అధిపతి అయిన వ్యక్తి తల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి యాచకుడిగా మారిన కథను బిచ్చ‌గాడు మూవీలో అద్భుతంగా తెర‌కెక్కించారు. అదే విధంగా నిజ జీవితంలోనూ ఓ న్యాయ‌వాది త‌న భార్య ఆరోగ్యం కోసం అన్నీ వ‌దిలేసి ఓ ఆల‌యం వ‌ద్ద బిచ్చ‌గాడిగా మారాడు.. కాదు కాదు సేవ‌కుడిగా మారాడు.

S

Telangana | Published On Feb 27, 2026, 7.35 am IST

Lawyer Kasarla Jalender Reddy | బిచ్చ‌గాడు సినిమాకు మించిన క‌థ ఇది.. ఈ ‘లాయ‌ర్’ విషాద గాథ వింటే క‌న్నీరు పెట్టుకోవాల్సిందే..!
Advertisement

Lawyer Kasarla Jalender Reddy | త్రినేత్ర‌.న్యూస్ : అచ్చం బిచ్చ‌గాడు సినిమాను పోలిన క‌థ ఇది. కోట్లకు అధిపతి అయిన వ్యక్తి తల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి యాచకుడిగా మారిన కథను బిచ్చ‌గాడు మూవీలో అద్భుతంగా తెర‌కెక్కించారు. ప్రేక్ష‌కుల‌ను కూడా మెప్పించింది ఆ మూవీ. అదే విధంగా నిజ జీవితంలోనూ ఓ న్యాయ‌వాది త‌న భార్య ఆరోగ్యం కోసం అన్నీ వ‌దిలేసి ఓ ఆల‌యం వ‌ద్ద బిచ్చ‌గాడిగా మారాడు.. కాదు కాదు సేవ‌కుడిగా మారాడు. ఇది సేవ‌కుడిగా మారిన ఓ న్యాయ‌వాది నిజ జీవిత క‌థ‌.

పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌నికి చెందిన కాస‌ర్ల జ‌లంధ‌ర్ రెడ్డి వృత్తిరీత్యా లాయ‌ర్. 2006లో రాజ‌న్న సిరిసిల్ల జిల్లా బోయిన‌ప‌ల్లి మండ‌లం విలాసాగ‌ర్ గ్రామానికి చెందిన శిరీష‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి సంతానం క‌ల‌గ‌లేదు. జ‌లంధ‌ర్ రెడ్డి న్యాయ‌వాదిగా క‌రీంన‌గ‌ర్ కోర్టులో ప్రాక్టీస్ చేసేవాడు. బీకాం కంప్యూట‌ర్స్ చ‌దివిని శిరీష ఓ ప్ర‌యివేటు కంపెనీలో ఉద్యోగం చేసేది. జ‌లంధ‌ర్ రెడ్డి లాయ‌ర్‌గా రాణిస్తూ.. ఆర్థికంగా నిల‌దొక్కుకున్నాడు. వీరిద్ద‌రి జీవితం సాఫీగానే సాగిపోతుంద‌న్న స‌మ‌యంలోనే క‌రోనా మ‌హ‌మ్మారి వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది.

క‌రోనా త‌ర్వాత జ‌లంధ‌ర్ రెడ్డి ఆర్థికంగా చితికిపోయారు. పెద్ద‌గా కేసుల్లేవు. అదే స‌మ‌యంలో భార్య శిరీష అనారోగ్యానికి గురైంది. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆస్ప‌త్రుల చుట్టూ తిరిగినా కూడా ఆమెకు వ్యాధి న‌యం కాలేదు. సంతానం లేక‌పోవ‌డంతో.. జీవితం మీద ఆశ‌లు వ‌దులుకున్నారు. రెండేళ్ల క్రితం భార్య వేముల‌వాడ ఆల‌యానికి చేరుకుని.. అక్క‌డే ఉంటూ భ‌క్తులు ఇచ్చే ప్ర‌సాదం, ఆహారంతో క‌డుపు నింపుకుంటుంది. కొన్నాళ్ల‌కు భ‌ర్త జ‌లంధ‌ర్ రెడ్డి కూడా ఆమె వ‌ద్ద‌కు చేరుకున్నాడు. ఇద్ద‌రూ క‌లిసి వేముల‌వాడ ఆల‌యం మెట్ల‌పై ఉంటూ జీవనం కొన‌సాగిస్తున్నారు. వీరు చేయి చాచి ఎవ‌ర్నీ కూడా ఒక్క పైసా అడ‌గ‌రు. ఎవ‌ర‌న్న ప్రేమ‌తో ఇస్తే తీసుకుంటారు త‌ప్ప నోరు తెరిచి అడ‌గ‌రు. ఇక ప్ర‌తిరోజు ఆల‌యం మెట్లు క‌డ‌గ‌డంతో పాటు చిన్న చిన్న ప‌నులు చేస్తూ క‌డుపు నింపుకుంటున్నారు.

ఇలా వెలుగులోకి..

ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్‌‌‌‌‌‌‌‌ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలోని అధికారుల బృందం.. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేసే వాళ్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జలంధర్ రెడ్డి-శిరీష జంటకు సంబంధించిన విషాదగాథ తెలుసుకున్నారు.

అయితే కరోనా మహమ్మారితో తమ బతుకులు దుర్భరంగా మారాయని పేర్కొన్న ఆ జంట.. తమకు ప్రభుత్వం ఏదైనా ఉపాధి చూపించాల‌ని కోరారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామ‌న్నారు. తన భార్యకు వైద్యం చేయించేందుకు ఎన్నో ఆస్పత్రులు తిప్పానని.. నయం కాకపోవడంతో ఆమెకు దేవుడు కలలోకి వచ్చాడని.. దీంతో ఆమె వేములవాడకు వచ్చినట్లు జలంధర్ రెడ్డి తెలిపాడు. ఆ తర్వాత తన భార్యను వెతుక్కుంటూ తాను కూడా ఇక్కడికే వచ్చినట్లు చెప్పాడు. నిత్యం గుడి మెట్లను శుభ్రం చేస్తామని పేర్కొన్నాడు. తమను అధికారులు అనాథాశ్రమానికి తీసుకెళ్లినా.. అక్కడ ఉండలేక తిరిగి ఇక్కడేకి వచ్చినట్లు తెలిపాడు.

 

Advertisement
Advertisement