త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | పుట్టిన మ‌ట్టి సాక్షిగా నేను ఎప్పుడూ అక్రమ, అనైతిక పనులు చేయలేదు: కేటీఆర్‌

KTR | పుట్టిన మ‌ట్టి సాక్షిగా నేను ఎప్పుడూ అక్రమ, అనైతిక పనులు చేయలేద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. త‌ప్పుడు ప‌ని చేయ‌న‌ప్పుడు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు.

G

Telangana | Published On Jan 23, 2026, 11.05 am IST

KTR | పుట్టిన మ‌ట్టి సాక్షిగా నేను ఎప్పుడూ అక్రమ, అనైతిక పనులు చేయలేదు: కేటీఆర్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: పుట్టిన మ‌ట్టి సాక్షిగా నేను ఎప్పుడూ అక్రమ, అనైతిక పనులు చేయలేద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. త‌ప్పుడు ప‌ని చేయ‌న‌ప్పుడు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. మంత్రుల‌తోపాటు త‌మ అంద‌రి ఫోన్ల‌ను సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నాడ‌ని ఆరోపించారు. రాజ‌కీయ క‌క్ష సాధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. ఆరు గ్యారంటీలు, సింగ‌రేణి బొగ్గు కుంభ‌కోణం నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించేందుకే ఈ కుట్ర‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచార‌ణ‌కు ప‌దిసార్లు పిలిచినా వెళ్తాన‌ని స్ప‌ష్టం చేశారు. అటెన్ష‌న్ డైవ‌ర్ష‌న్ కోస‌మే సిట్ విచార‌ణ పేరుతో కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు ముందు బీఆర్ఎస్ భ‌వ‌న్‌లో పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో కేటీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి కేసులు త‌మ‌కు కొత్తేమీ కాద‌న్నారు. బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఒక్కోరోజు ఒక్కో డ్రామా..

`ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతున్న‌ది. కేసీఆర్ సైనికులుగా ఉద్యమం నుంచే బీఆర్ఎస్‌ ఉద్భవించింది. ఆనాడు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలతో రాష్ట్రం కోసం సుదీర్ఘంగా కొట్లాడాం. రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. నేను మంత్రి అయ్యాను. ప‌దేండ్లలో రాష్ట్రం కోసం ఎంతో పనిచేశాం. తాము ఎన్నడు టైంపాస్ రాజకీయాలు చెయ్య‌లేదు. మా నాయకుడు కేసీఆర్ గొప్పతనం ఏంటి అంటే ఇవ్వని వాగ్దానాలు కూడా నెరవేర్చ‌డం. ఇవ్వాళ బాధ అనిపిస్తుంది. విచారణలకు మేము భయపడం. రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా త‌యారైంది. ఒక్కోరోజు ఒక్కో డ్రామా పేరుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇచ్చిన హామీలు పక్కకు వెళ్ళిపోయాయి.

రెండేండ్లుగా వ్య‌క్తిత్వ హ‌న‌నం..

ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంత‌రాత్మ‌సాక్షిగా నేను ఎటువంటి అక్రమ పనులు నేను చేయలేదు. నా పైన రెండేళ్ల నుంచి వ్యక్తిత్వ హ‌న‌నానికి పాల్పడ్డారు. నేను డ్రగ్స్ తీసుకుంటాన‌ని.. నాకు హీరోయిన్లతో సంబంధం ఉందని వార్తలు రాయించారు. అధికారులు బాధ్యులా..? న‌న్ను, నా కుటుంబాన్ని బాధ పెట్టారు. రెండేండ్ల‌ నుంచి నా పరువు, ప్ర‌తిష్ట‌కు క‌లిగిన న‌ష్టానికి బాధ్యుడు ఎవరు.. రేవంత్ రెడ్డి బాధ్యుడా?.. సమాధానం చెప్పాలి. ఇదే విషయాన్ని సిట్ విచారణలో నేను అడుగుతా.

అన్నీ దొంగ బుద్ధులే..

మా ఎమ్మెల్యేలను కొనేందుకు.. రేవంత్ రెడ్డి అనే దొంగ రూ.50 లక్షలతో దొరికాడు. ఆ విషయం మాకేం తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి అన్ని దొంగ బుద్దులే ఉంటాయి. ఆయన ముఖ్యమంత్రి కాగానే మా పైన ఇలాంటి దాష్టీకానికి పాలపడుతున్నాడు. సింగరేణిలో అతి పెద్ద కుంభకోణం జరిగింది అని హరీశ్‌ రావు బయట పెట్టాడు. ఉదయం ఈ కుంభకోణంపై మాట్లాడగానే, సాయంత్రం లోపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇచ్చారు. సిట్ విచార‌ణ‌కు హాజ‌రైన ఆయ‌న‌.. అధికారులనే ప్రశ్నలు అడిగారు.

డైలీ సీరియల్‌లా లీకులు..

ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో డైలీ సీరియల్‌లా లీకులు ఇచ్చి న‌డిపిస్తున్నారు. ఒక సినిమాలో బ్రహ్మానందం దొంగగా ప్రతిసారీ దొరుకుతాడు. అలానే రెండేళ్ల నుంచి రేవంత్ రెడ్డి దొంగ పనులు చేసుకుంటు దొరికిపోతున్నాడు. దండుపాళ్యం ముఠా అక్రమాలు బయట పెడుతున్నందుకే మాపైన ఇలాంటి కేసులు, విచారణలు. నా వ్యక్తిత్వం హనానికి పాల్పడుతున్న కొందరు పోలీస్ అధికారులను తాము అధికారంలోకి రాగానే వదిలి పెట్టేది లేదు. అర్జునుడి కన్ను పక్షి మీద ఉన్నట్లు.. మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పై పోరాడుతూనే ఉంటాం. నాలుగు కోట్ల ప్ర‌జ‌ల‌ను న‌య‌వంచ‌న చేసిన ముఖ్య‌మంత్రి వ‌దిలిపెట్టేది లేదు. కాగ్రెస్‌ను గ‌ద్దె దించేవ‌ర‌కు మా పోరాటం కొన‌సాగుతుంది` అని కేటీఆర్ అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement