త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | నేతన్న పిలుపుతో సిరిసిల్లకు కేటీఆర్‌

KTR | నేతన్న విజయ్‌ ఆహ్వానం మేరకు సిరిసిల్లలోని ఆయన ఇంటికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ఎలక్ట్రానిక్‌ జాకార్డ్‌ టెక్నాలజీతో రూపొందించిన కొత్త హ్యాండ్‌లూమ్ మ‌గ్గ‌డంతో పాటు అదే మ‌గ్గంపై త‌యారు చేసిన ‘వెండి వెన్నెల’ చీర‌ను ఆవిష్క‌రించారు. ఆధునిక సాంకేతికతను చేనేత రంగంలోకి తీసుకొస్తున్న విజయ్‌ ప్రయత్నాన్ని కేటీఆర్‌ అభినందించారు.

P

Telangana | Published On Sep 5, 2026, 6.47 pm IST

KTR | నేతన్న పిలుపుతో సిరిసిల్లకు కేటీఆర్‌
Advertisement
  • ఎలక్ట్రానిక్‌ జాకార్డ్‌తో కొత్త హ్యాండ్‌లూమ్‌ మగ్గం ఆవిష్కరణ
  • ‘వెండి వెన్నెల’ చీరను ఆవిష్కరించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌
  • నేతన్న విజయ్‌ను అభినందించిన కేటీఆర్‌

KTR | నేతన్న విజయ్‌ ఆహ్వానం మేరకు సిరిసిల్లలోని ఆయన ఇంటికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ఎలక్ట్రానిక్‌ జాకార్డ్‌ టెక్నాలజీతో రూపొందించిన కొత్త హ్యాండ్‌లూమ్ మ‌గ్గ‌డంతో పాటు అదే మ‌గ్గంపై త‌యారు చేసిన ‘వెండి వెన్నెల’ చీర‌ను ఆవిష్క‌రించారు. ఆధునిక సాంకేతికతను చేనేత రంగంలోకి తీసుకొస్తున్న విజయ్‌ ప్రయత్నాన్ని కేటీఆర్‌ అభినందించారు. సిరిసిల్ల ప్రధానంగా పవర్‌లూమ్‌ పరిశ్రమకు పేరుగాంచినప్పటికీ.. హ్యాండ్‌లూమ్‌ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని విజయ్‌ తెలిపారు. గతంలో సిరిసిల్లలో హ్యాండ్‌లూమ్‌ మగ్గాలకు మంచి ప్రాధాన్యం ఉండేదని.. పవర్‌లూమ్‌ల విస్తరణతో ఆ రంగం క్రమంగా తగ్గిందన్నారు. ఎలక్ట్రానిక్‌ జాకార్డ్‌లను హ్యాండ్‌లూమ్‌లకు అనుసంధానం చేసి కొత్త డిజైన్లతో చీరలు తయారు చేస్తున్నామని చెప్పారు. గోల్డ్‌, సిల్వర్‌ సారీస్‌ వంటి ప్రత్యేక చీరలకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు.

ప్రత్యేకత కలిగిన చీరలకు అదనపు ధర చెల్లించేందుకు వినియోగదారులు ముందుకు వస్తుండటంతో నేతన్నలకు ఆదాయం పెరుగుతోందని తెలిపారు. ఎలక్ట్రానిక్‌ జాకార్డ్‌ టెక్నాలజీతో పని వేగం పెరగడంతోపాటు నేత కార్మికుల శ్రమ తగ్గుతుందని విజయ్‌ వివరించారు. ముఖ్యంగా మహిళా కార్మికులకు పని సులభతరం అవుతుందని.. తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతుందని చెప్పారు. ఆధునిక సాంకేతికతను చేనేత రంగంలోకి తీసుకురావడం ద్వారా ఉపాధి, ఆదాయ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. చేనేత రంగంలో కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టి హ్యాండ్‌లూమ్‌ రంగాన్ని ఆధునికీకరిస్తున్న విజయ్‌ ప్రయత్నం అభినందనీయమని కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల చేనేతకు కొత్త సాంకేతికతను జోడించి వినూత్న ఉత్పత్తులు తయారు చేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

నేతన్నల నైపుణ్యానికి సాంకేతికత తోడైతే చేనేత రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించడంలో కేటీఆర్‌ ఎప్పుడూ ముందుంటారని విజయ్‌ తెలిపారు. గతంలో తాము రూపొందించిన వినూత్న చీరలను కూడా కేటీఆర్‌ చేతుల మీదుగా ఆవిష్కరించామని.. వాటికి మంచి ఆదరణ లభించిందన్నారు. ఈసారి కొత్త సాంకేతికతతో ఏర్పాటు చేసిన హ్యాండ్‌లూమ్‌ మగ్గాన్ని, దానిపై రూపొందించిన ‘వెండి వెన్నెల’ చీరను కేటీఆర్‌ చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సిరిసిల్లను కేవలం పవర్‌లూమ్‌ కేంద్రంగా కాకుండా.. ఆధునిక సాంకేతికతతో కూడిన హ్యాండ్‌లూమ్‌ చేనేతకు కూడా కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని విజయ్‌ తెలిపారు. నేతన్నల సృజనాత్మకతకు ఆధునిక సాంకేతికతను జోడిస్తే సిరిసిల్ల చేనేతకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement