త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రైతాంగాన్ని కాంగ్రెస్ మోసం చేస్తుంది

KTR | రైతాంగాన్ని కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌పై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతుల సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించారు.

P

Telangana | Published On Apr 28, 2026, 5.45 pm IST

KTR | రైతాంగాన్ని కాంగ్రెస్ మోసం చేస్తుంది
Advertisement
  • బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌
  • రైతు డిక్ల‌రేష‌న్ మోసాన్ని గుర్తు చేస్తూ వ‌రంగ‌ల్‌లో కార్య‌క్ర‌మాలు
  • డిక్లరేషన్ ఇచ్చిన మే 6న స‌మావేశం
  • ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ నేత‌ల‌తో కేటీఆర్ స‌మావేశం
  • పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై దిశా నిర్దేశం

KTR | కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసిందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ల క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు విమ‌ర్శించారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట నాలుగు సంవత్సరాల కిందట అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తన కపట మోసాన్ని కొన‌సాగిస్తోంద‌ని ఆరోపించారు. స్వయంగా కాంగ్రెస్ లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ రైతన్నలను మోసం చేసిన మే 6వ తేదీని పురస్కరించుకొని, కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు గుర్తు చేసేలా రైతన్నలతో ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. సమావేశానికి హాజరుకావాలని కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ రైతు వ్య‌తిరేక స‌మావేశానికి తాను హాజ‌రుతాన‌ని తెలిపారు.

ఆత్మ‌హ్య‌త‌ల‌పై ఆందోళ‌న‌..

కాంగ్రెస్ ప్రభుత్వం వ‌చ్చాక వ్యవసాయరంగంలో ఎరువులు, విత్తనాల కొరత, ధాన్యం కొనుగోళ్లలో తీవ్రమైన సమస్యలు తలెత్తుతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అడ్రస్ లేకుండా పోయిన రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ పాలనలో తిరిగి ప్రారంభమయ్యాయని, కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతాంగానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పోరాటాలకు సిద్ధమవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జిల్లాలో ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగక రైతన్నలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని పార్టీ నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

స‌భ్య‌త్వ న‌మోదుపై దిశానిర్దేశం..

ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లా పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఉమ్మడి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలు కేటీఆర్‌కు పలు వివరాలు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు వంటి సంస్థాగత అంశాలపై కేటీఆర్ కీలక సూచనలు చేశారు. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

స‌ర్‌పై సూచ‌న‌లు..

ఎన్నికల సంఘం నిర్వ‌హించ‌నున్న స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ కార్యక్రమాన్ని ముఖ్యాంశంగా ప‌రిగ‌ణించాల‌న్నారు. ప్రతి బూత్ లో దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని కేటీఆర్ నేతలకు సూచించారు. ప్రత్యేక ఓట‌ర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని వినియోగించుకొని కొత్త ఓటర్లను నమోదు చేయించడంతోపాటు ఏ ఒక్క వ్యక్తికి ఓటు హక్కు కోల్పోకుండా చూసే బాధ్యత తీసుకోవాలని పార్టీ నేతలను కోరారు. ఇందుకు సంబంధించి బూత్ లెవెల్ సహాయకుల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వ.. అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement