KTR | కాంగ్రెస్‌ది ప్రజా పాలన కాదు.. అవినీతి పాలన: కేటీఅర్
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 శాతం కమీషన్ ఇవ్వనిదే పనులు కావడం లేదని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్సంటేజీ ఇవ్వనిదే పనులు జరగడం లేదని చెబుతుంటే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) రూ.5 లక్షల కోట్ల దోపిడీ, టెండర్లలో అవినీతి, కుంభకోణాల ఆరోపణలు చేస్తున్నారని గుర్తు చేశారు.
KTR | త్రినేత్ర న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 శాతం కమీషన్ ఇవ్వనిదే పనులు కావడం లేదని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్సంటేజీ ఇవ్వనిదే పనులు జరగడం లేదని చెబుతుంటే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) రూ.5 లక్షల కోట్ల దోపిడీ, టెండర్లలో అవినీతి, కుంభకోణాల ఆరోపణలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇది ప్రజా పాలన కాదని, అవినీతి పాలన అని కాంగ్రెస్ నాయకులే అంగీకరిస్తున్నారని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తుండటం కాంగ్రెస్ పాలనలో (Congress Govt) పరిస్థితికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రపంచ బ్యాంకుకే అర్జీలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో పరిస్థితి ఘోరంగా ఉందని, ఉన్న నిధులన్నీ కొడంగల్‌కు తరలించుకుపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. తాము కేవలం పెళ్లిళ్లు, చావులకు మాత్రమే పరిమితమయ్యామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులే ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.
రేవంత్ రెడ్డి అవినీతి సొమ్ముతో ఓటుకు రూ.15 వేలు ఇచ్చి ప్రజలను కొనుగోలు చేయవచ్చని భావిస్తున్నారని విమర్శించారు. డబ్బులు పంచితే ప్రజలు తనకే ఓటు వేస్తారనే భ్రమలో ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు. ఏడాది తర్వాత వచ్చేది గులాబీ జెండానేనని, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తామని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన వారిలో ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
పెన్షన్లలో కోతలు విధించి..
పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 44 లక్షల 70 వేల పెన్షన్లు (Pension) ఉండేవన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది 1.50 లక్షలు, రెండో ఏడాది మరో 1.50 లక్షలు, మూడో ఏడాది 1.70 లక్షల పెన్షన్లు తొలగించిందని, మొత్తం 4 లక్షల 70 వేల పెన్షన్లకు కోత పెట్టిందని పేర్కొన్నారు. మరోవైపు కొత్తగా 4 లక్షల 63 వేల పెన్షన్లు మాత్రమే మంజూరు చేసిందని, తొలగించిన పెన్షన్లతో పోలిస్తే కొత్తగా ఇచ్చినవి 7 వేల తక్కువని విమర్శించారు. ఉన్న పెన్షన్లను తొలగించి, అంతకంటే తక్కువ మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చి గొప్పగా ప్రచారం చేసుకోవడం విడ్డూరమన్నారు. నిజంగానే పెన్షన్లు పెంచితే బడ్జెట్ కూడా పెరగాలి కదా అని ప్రశ్నించారు. కానీ పెన్షన్ల బడ్జెట్ పెరగలేదని, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫించన్‌ను రూ.4,000కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. నవంబర్‌లో రూ.2 వేలు, డిసెంబర్ నుంచి రూ.4,000 ఇస్తామని చెప్పారని, మూడు డిసెంబర్లు గడిచినా ఇప్పటికీ రూ.2,000 మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. అది కూడా గతంలో కేసీఆర్ (KCR) ప్రభుత్వం ఇచ్చిన మొత్తమేనని, కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని ఒక్క రూపాయి కూడా పెంచలేదని మండిపడ్డారు. వృద్ధులు, వికలాంగులు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం పెన్షన్‌ను రూ.200 నుంచి రూ.2,000కు పెంచిందని, తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఇప్పటికే రూ.4,000 పెన్షన్ వచ్చేదని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముందు ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అఫిడవిట్‌తో హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేశారని గుర్తు చేశారు. గ్యారంటీ కార్డులను క్రెడిట్ కార్డుల్లా భద్రంగా పెట్టుకోవాలని చెప్పిన నాయకులు, మూడేండ్లు కావస్తున్నా హామీలను అమలు చేయలేకపోయారని విమర్శించారు. ప్రజలు ఆ గ్యారంటీ కార్డులను ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలని ప్రశ్నించారు.
ఢిల్లీ పార్టీలకు బాడీగార్డుల్లా..
కాంగ్రెస్, బీజేపీ (BJP) నాయకులు తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నించకుండా ఢిల్లీ పార్టీలకు బాడీగార్డుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి వణికిపోతున్నారని, ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు బాడీగార్డులా పక్కకు వెళ్లారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో బైక్‌పై వెళ్తుంటే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి వెనుక పరుగులు తీశారని విమర్శించారు.
బీజేపీలోనూ ఇదే పరిస్థితి ఉందని, అమిత్ షా (Amit Shah) హైదరాబాద్‌కు వచ్చినప్పుడు రామచంద్రరావు ఆయన కాళ్లు మొక్కుతున్నారని కేటీఆర్ విమర్శించారు. అమిత్ షా కంటే వయసులో పెద్దవారైన నాయకులు కూడా ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటం ఆత్మగౌరవ పోరాటమని, అలాంటి తెలంగాణలో మళ్లీ ఢిల్లీ పార్టీలకు గులాములుగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పైసలు ఢిల్లీకి పోతున్నాయని, ఢిల్లీ పెద్దలకు చెల్లించాల్సిన ఈఎంఐలు కట్టకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుందని ఎద్దేవా చేశారు. అందుకే రేవంత్ రెడ్డి రెగ్యులర్ ముఖ్యమంత్రి కాదని, రెన్యువల్ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌కు బలంగా మారుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం
- ●HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!
- ●Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం
- ●AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!
- ●Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- ●Nagarguna Sagar | నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో నిర్మాణాలపై ఇంజినీర్ల బృందం ఆరా

Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం

HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!

Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం

AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!





