త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ప్రజల పక్షాన పోరాటం కొన‌సాగిస్తాం : కేటీఆర్‌

KTR | తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాకు వివరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారని, రైతు సమస్యలు, కాంగ్రెస్ పాలనపై అసంతృప్తి, పార్టీ సంస్థాగత మార్పులపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిపారు.

P

Telangana | Published On Apr 27, 2026, 8.11 pm IST

KTR | ప్రజల పక్షాన పోరాటం కొన‌సాగిస్తాం : కేటీఆర్‌
Advertisement

KTR | తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాకు వివరించారు. ఉద్యమ సహచరులకు కృతజ్ఞతలు తెలపడం నుంచి పార్టీ సంస్థాగత మార్పులు, రైతు సమస్యలు, కేంద్ర–రాష్ట్ర రాజకీయాలపై తీసుకున్న తీర్మానాల వరకు సమావేశంలో చర్చించిన అంశాలను ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి అండగా నిలిచిన జర్నలిస్టులు, లాయర్లు, విద్యార్థులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపినట్లు కేటీఆర్ చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్యాయం, నీళ్లు, నిధులు, నియామకాలలో వివక్ష, సాగునీరు, విద్యుత్ సంక్షోభాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారని వివరించారు. పదవులను త్యజించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన తీరును కూడా ఆయన స్మరించుకున్నారని చెప్పారు.

రైతుబంధును నిర్వీర్యం చేస్తోంది..

రాష్ట్ర అభివృద్ధి, రైతు బంధు పథకం అమలు వెనుక ఉన్న కారణాలను కేసీఆర్ వివరించినట్లు కేటీఆర్ చెప్పారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం కారణంగా రైతులు దళారుల పాలవుతున్నారని సమావేశంలో ఆందోళన వ్యక్తమైందని తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే గ్రామస్థాయిలో ఉద్యమాలు చేస్తామని నిర్ణయించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ (SIR) అంశంపై సమావేశంలో విస్తృత చర్చ జరిగిందని కేటీఆర్ వెల్లడించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో 95 లక్షలు, బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించిన ఉదాహరణలను ప్ర‌స్తావించార‌ని, తెలంగాణలో అలాంటి పరిస్థితులు రాకుండా బూత్ స్థాయి నుంచి అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో దొంగ ఓట్ల వ్యవహారం జరిగిన విషయాన్ని కూడా గుర్తు చేసినట్లు చెప్పారు.

కొత్త క‌మిటీలు..

పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన వ్యాఖ్యలను సమావేశం తీవ్రంగా ఖండించిందని కేటీఆర్ తెలిపారు. ఆ సమయంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు స్పందించకపోవడాన్ని తప్పుబట్టారని, బీఆర్‌ఎస్ ఎంపీలు ఉంటే వెంటనే స్పందించి క్షమాపణ చెప్పించేవారని అభిప్రాయపడినట్లు వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం డీలిమిటేషన్‌తో ముడిపెట్టి ఆలస్యం చేస్తోందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు చెప్పారు. దానిని వెంటనే అమలు చేయాలని తీర్మానం చేసినట్లు చెప్పారు. పార్టీ సంస్థాగత మార్పులపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేస్తున్నారని, బూత్ స్థాయి నుంచి కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో నిర్వహిస్తామని, సంఖ్య కంటే నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలాయ్‌..

కాంగ్రెస్ పాలనపై కూడా సమావేశంలో తీవ్ర విమర్శలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలుతున్నాయని సమావేశం అభిప్రాయపడినట్లు చెప్పారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చ‌రించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలపై స్పందిస్తూ, హామీల అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సమావేశం అభిప్రాయపడినట్లు కేటీఆర్ వివరించారు. కేసీఆర్ పేరు ప్రస్తావనతోనే గుర్తింపు వస్తుందన్న భావనలో సీఎం ఉన్నారని కూడా చర్చ జరిగినట్లు చెప్పారు. పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టం చేసినట్లు కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement