త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | ప్రజాస్వామ్యాన్ని అణచివేయాల‌ని చూస్తే.. ప్రజలే తగిన సమాధాన‌మిస్తారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy | ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వ‌మే స్వయంగా దానిని ఖూనీ చేస్తున్నద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Kishan Reddy) విమ‌ర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన క‌లిగిస్తున్నాయ‌న్నారు.

G

Telangana | Published On Feb 22, 2026, 1.33 pm IST

Kishan Reddy | ప్రజాస్వామ్యాన్ని అణచివేయాల‌ని చూస్తే.. ప్రజలే తగిన సమాధాన‌మిస్తారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Advertisement

Kishan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వ‌మే స్వయంగా దానిని ఖూనీ చేస్తున్నద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Kishan Reddy) విమ‌ర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన క‌లిగిస్తున్నాయ‌న్నారు. కామారెడ్డి (Kamareddy) బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై (MLA Venkata Ramana Reddy) నిరాధార ఆరోపణలు చేసి, ఆయన వాటిని నిరూపించాలని సవాల్ చేసిన వెంటనే హౌజ్ అరెస్టుకు పాల్పడటం ముమ్మాటికీ కక్షసాధింపేన‌ని చెప్పారు. అనవసర ఆరోపణలు చేయడం, వాటికి సమాధానం ఇవ్వమంటే అధికారాన్ని దుర్వినియోగం చేసి అరెస్టులకు దిగడం దౌర్భాగ్యకరమ‌ని మండిప‌డ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటును కాంగ్రెస్ (Congress) నాయకులు తమ కారుతో గుద్ది ధ్వంసం చేయడం రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి ఉదాహరణ అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని తెలిపారు.

ఎమ్మెల్యేకు సంఘీభావంగా కామారెడ్డికి వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్టు చేయడం తెలంగాణలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని చెప్పారు. ఇది ప్రజాస్వామ్య హక్కులపై బహిరంగ దాడియేన‌ని వెల్ల‌డించారు. రాజకీయంగా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి భయపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారాన్ని ప్రతీకార రాజకీయాలకు వాడుకుంటున్న‌ద‌ని విమ‌ర్శించారు. ప్రజలు ఇస్తున్న తీర్పును జీర్ణించుకోలేక ప్రతిపక్షాల గొంతును అణచివేయాలని కుట్రలు చేస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు. ప్రజాస్వామ్యంలో రాజకీయంగా విభేదాలు సహజమ‌ని, కానీ విపక్షాల గొంతు నొక్కేయడం కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న అసహనానికి నిదర్శనమ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

చట్టం అందరికీ సమానంగా ఉండాలని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని పోలీసు యంత్రాంగాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధ‌మ‌ని చెప్పారు. మీ తాటాకు చప్పుళ్లకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేద‌న్నారు. ఈ అరెస్టులు, బెదిరింపులతో త‌మ‌ను అడ్డుకోవాలన్న భ్రమల్లో నుంచి బయటకు రావాల‌ని చెప్పారు. ప్రజా సమస్యలపై త‌మ‌ స్వరాన్ని మరింత బలంగా వినిపిస్తామ‌న్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజకీయ అరెస్టులను నిలిపివేసి, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాల‌ని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ ప్రజలే ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ముందుకు వస్తారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనే ప్రతి ప్రయత్నానికి ప్రజలే తగిన సమాధానం ఇస్తార‌ని చెప్పారు.

Advertisement
Advertisement