త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana State Formation Day | ప్ర‌జ‌ల‌కు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన కేసీఆర్‌

Telangana State Formation Day | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణవాసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుని వారికి ఘన నివాళులు అర్పించారు.

P

Telangana | Published On Jun 1, 2026, 8.45 pm IST

Telangana State Formation Day | ప్ర‌జ‌ల‌కు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన కేసీఆర్‌
Advertisement

Telangana State Formation Day | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణవాసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుని వారికి ఘన నివాళులు అర్పించారు. దశాబ్దాల పాటు కొనసాగిన వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించుకుందని కేసీఆర్ పేర్కొన్నారు. అనేక ఆటంకాలు ఎదురైనా శాంతియుత పార్లమెంటరీ మార్గంలో ఉద్యమాన్ని విజయవంతం చేసి తెలంగాణను ఆవిష్కరించుకున్నామని అన్నారు.

అభివృద్ధి ప‌థంలో న‌డిపించాం..

ఉమ్మడి రాష్ట్ర పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను స్వయం పాలనలో అభివృద్ధి పథంలో నడిపించామని, ‘పరిపాలన చేతకాదు’ అంటూ విమర్శించిన వారికే సమాధానంగా పదేళ్లలోనే ప్రగతి ఫలితాలు చూపించామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రెండు చక్రాలుగా ముందుకు సాగుతూ తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతి దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు కరవుతో అల్లాడిన ప్రాంతాలను సాగునీటితో సస్యశ్యామలం చేసి, కోటి ఎకరాల మాగాణంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.

ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి..

అభివృద్ధికి చిరునామాగా నిలిచిన తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే శక్తుల నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణలో బీఆర్ఎస్ ఎల్లప్పుడూ రక్షణ కవచంలా నిలుస్తుందని స్పష్టం చేశారు. స్వరాష్ట్ర సాధనలో ప్రదర్శించిన ఉద్యమ స్ఫూర్తిని, రాష్ట్ర పునర్నిర్మాణంలో చూపిన సంకల్పాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. వ్యవసాయం, రైతాంగ సంక్షేమం విషయంలో నిరంతర శ్రద్ధ అవసరమని పేర్కొన్న ఆయన, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించి పచ్చని పంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రైతులు, కార్మికులు, శ్రమజీవులు, సబ్బండ వర్గాలు సహా అన్ని వర్గాల ప్రజల జీవితాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని కోరుకున్నారు.

Advertisement
Advertisement