త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | ఈ సారి ముఖాలు చూసి టికెటిచ్చేది లేదు

KCR | బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేసి కొత్తగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సభ్యత్వ నమోదు తక్షణమే ప్రారంభించాలని, టికెట్ల విషయంలో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ రాష్ట్రాన్ని గందరగోళంగా మార్చిందని ఆరోపించారు. రైతుల పంటల కొనుగోళ్లపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

P

Telangana | Published On Apr 27, 2026, 7.10 pm IST

KCR | ఈ సారి ముఖాలు చూసి టికెటిచ్చేది లేదు
Advertisement
  • ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినా ఎందుకు ఓడిపోయామో ఆత్మవిమర్శ చేసుకోవాలి
  • 60 లక్షల సభ్యత్వాలు ఉన్నా ఎలా ఓడిపోయాం
  • రాశి కాదు వాసి ముఖ్యం
  • నేతలందరూ క్షేత్రస్థాయిలో పోరాటాలకు సిద్ధమవ్వాలి
  • రాష్ట్ర కమిటీ మినహా మిగతా పార్టీ కమిటీలన్నీ రద్దు
  • రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ తరగతులు
  • కొత్త సభ్యత్వ నమోదు ప్రారంభం
  • పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన గులాబీ దళపతి కేసీఆర్

KCR | త్రినేత్ర.న్యూస్: గులాబీ దళపతి కేసీఆర్ జోరును పెంచారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్రియాశీలతను ఉధృతం చేసేలా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై పార్టీ నేతలు ఎక్కడిక్కడ పోరాటాలకు సిద్ధం కావాలంటూ ఆదేశించారు. కొత్త కమిటీల నియామకానికి అనువుగా.. రాష్ట్రకమిటీ మినహా మిగతా కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ భవన్‎లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు.

టికెట్ల విషయంలో స్ట్రిక్టుగా ఉంటాం

వచ్చే ఎన్నికల సమయంలో టికెట్లు ఇచ్చే విషయంలో కఠినంగానే ఉంటామని బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ చెప్పారు. ముఖాలు చూసి టికెట్లు ఇచ్చేది ఉండదని స్పష్టం చేశారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క నేత క్రియాశీలకంగా ఉండి తీరాలని తెలిపారు. పదేళ్ల కాలంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినా పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. 60 లక్షల సభ్యత్వాలు ఉన్నా ఎందుకు ఓడిపోయామో సమీక్షించుకోవాలని చెప్పారు. ఇప్పుడు.. పార్టీ సభ్యత్వాల విషయంలో రాశి కన్నా వాసి ముఖ్యమని తెలిపారు

కమిటీలు రద్దు..సభ్యత్వాలు షురూ

భారత రాష్ట్ర సమితలో రాష్ట్ర స్థాయి కమిటీ తప్ప.. అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. తద్వారా కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తక్షణం పార్టీ సభ్యత్వాలను ప్రారంభించాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన కార్యకర్తలకు శిక్షణ తరగతులను నిర్వహించాలని సూచించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదులో సాధారణ సభ్యత్వానికి రూ.10 రుసుము, క్రియాశీల సభ్యత్వానికి రూ.50లుగా నిర్ణయించారు.సభ్యత్వం కోసం ప్రతి జిల్లాకు ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడికి ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించారు.

ఇది ఒక చిల్లర ప్రభుత్వం

కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటుపై ఇస్టం వచ్చినట్టు మాట్లాడితే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా నోరెత్తలేదని ఈ సందర్భంగా కేసీఆర్ మండిపడ్డారు. ఆ సమయంలో బీఆర్ ఎస్ ఎంపీలు ఉండి ఉంటే .. లోక్ సభలో రణరంగం సృష్టించి ఉండేవారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేతకావట్లేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక చిల్లర ప్రభుత్వమంటూ కాంగ్రెస్ సర్కారును దుయ్యబట్టారు. తెలంగాణను కాంగ్రెస్ నాయకులు పెంటకుప్పగా మార్చారని కేసీఆర్ మండిపడ్డారు.

పంటల కొనుగోళ్లపై నిలదీయండి

కాగా.. రాష్ట్రంలో పండిన పంటలన్నీ కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ సందర్భంగా తీర్మానం చేసింది. మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.పంటల కొనుగోళ్లపై బీఆర్ఎస్ శ్రేణులు నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement