త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HARISHRAO | కేసీఆర్ జాతిపితే.. నువ్వే బూతు పిత‌వు.. రాష్ట్ర ప్రధాతపై నీ ప్రతాపమేంది?

కేసీఆర్ ముమ్మాటికీ తెలంగాణ జాతిపితే అని.. సీఎం రేవంత్ మాత్రం బూతు పితా అని మాజీ మంత్రి హరీశ్ రావు విమ‌ర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్‌లో గురువారం ఆయ‌న పర్యటించి, భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. కేసీఆర్ అభివృద్ధిని వివ‌రించి రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగట్టారు.

S

Telangana | Published On Feb 5, 2026, 5.49 pm IST

HARISHRAO | కేసీఆర్ జాతిపితే.. నువ్వే బూతు పిత‌వు.. రాష్ట్ర ప్రధాతపై నీ ప్రతాపమేంది?
Advertisement

- ఎరువుల‌ బస్తాలియ్య‌వు.. వడ్లు కొనే తెలివి లేదు..
- కేసీఆర్ మీద నోరు పారేసుకుంట‌వా?
- దమ్ముంటే 11లోగా రైతుబంధు వేయ్‌
- వేయకపోతే కాంగ్రెస్ పార్టీని రైతులు చీల్చి చెండాడత‌రు
- సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఫైర్

త్రినేత్ర.న్యూస్‌: కేసీఆర్ (KCR) ముమ్మాటికీ తెలంగాణ జాతిపితే అని.. సీఎం రేవంత్ మాత్రం బూతు పితా అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harishrao) విమ‌ర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ (Gajwel) నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్‌లో గురువారం ఆయ‌న పర్యటించి, భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అభివృద్ధిని వివ‌రించి రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగట్టారు. గజ్వేల్‌లో ఎన్నికలొచ్చాయ‌ని మనకు అన్నం పెట్టిన వాళ్లకు, పని చేసిన వాళ్ల‌కే ఓటేయాలని కోరారు. సద్ది తిన్న రేవు తలవాల‌ని.. గజ్వేల్ అభివృద్ధి ప్రధాత కేసీఆర్‌ను మ‌ర‌వ‌కుండా బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకోవాలన్నారు. కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండే? ఇప్పుడు ఎట్లుంది? ఆలోచించండి.. అని అన్నారు. ఆనాడు గజ్వేల్ దవాఖానా పందులకు నిలయంగా ఉండేద‌ని.. ఇప్పుడు 250 పడకల ఆసుపత్రిగా మారి పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న‌దంటే దానికి కేసీఆర్ కార‌ణం కాదా అని ఉద్గాటించారు.

గజ్వేల్ కు రైలు మార్గం...
గజ్వేల్ కు ఆర్డీవో ఆఫీస్, రైలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఊర చెరువు, పాండవుల చెరువు సుందరీకరణ చేసింది కేసీఆర్ (KCR) కాదా అని అన్నారు. కల్యాణ‌ లక్ష్మి, షాదీ ముబారక్ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.1,00,116 అందించి మేనమామలా ఆదుకున్నార‌ని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే కేసీఆర్ కిట్‌తో పాటు 13,000 అందించిన ఘనత కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, బీసీ, ఎస్సీ, మైనారిటీ బిడ్డ‌ల‌ కోసం గురుకులాలు స్థాపించి చదువుల విప్లవం తెచ్చార‌ని కొనియాడారు. ఒకప్పుడు గజ్వేల్‌లో మూడు రోజులకోసారి నీళ్లు వచ్చే పరిస్థితి పోయి ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు అందించార‌న్నారు. బిందెలు పట్టే గోసను తీర్చిన దేవుడు కేసీఆర్ అని భావోద్వేగం చెందారు.

ఎంత బాధొచ్చినా రైతుబంధు ఆప‌లే..
రైతుబంధు ఎందుకు వేయలేద‌ని అడిగితే ఎలక్షన్ అయ్యాక ఇస్తామ‌ని చెప్ప‌డం రేవంత్‌కే సాధ్య‌మైంద‌న్నారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ 11 సార్లు రైతుబంధు ఆపలేదని,. ఇంటింటికీ బియ్యం, మందులు పంపిన‌ట్లు గుర్తు చేశారు. కానీ రేవంత్ వచ్చాక ఇప్పటికి రెండు రైతుబంధులు ఎగ్గొట్టిండని ఎద్దేవా చేశారు. మూడు రైతుబంధులు క‌లిపి వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తామే ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాస్తామ‌ని.. మాకు ఎటువంటి అభ్యంతరం లేదని వివ‌రించారు. 11వ తేదీలోగా రైతుబంధు వేయకపోతే రైతులు చీల్చి చెండాడతారని హెచ్చ‌రించారు.

హోదాను మ‌రిచి బూతు మాట‌లా?
ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. పెన్షన్ అడిగితే లాగుల తొండలు వదులుతా, హామీలు అడిగితే పేగులు మెడలో వేసుకుంటా అన‌డం ఆయ‌న ముర్ఖ‌త్వానికి ప‌రాకాష్ట అన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి వచ్చానని చెప్పుకునే రేవంత్ రెడ్డి బుద్ధి కుక్క తోక వంకర అన్న చందంగానే ఉంద‌న్నారు. రూ. 4000 ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి సగం కాలం గడిచినా ఒక్క రూపాయి పెంచలేదని ఫైర‌య్యారు. ఇప్పటివరకు ఒక్కో అవ్వ, తాతకు రూ. 52,000 ప్రభుత్వం బాకీ పడింద‌ని, మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నాడ‌ని.. ఎవరికైనా వచ్చిందా? అక్క‌డున్న ప్ర‌జ‌ల‌నుద్దేశించి అన్నారు.

పువ్వు గుర్తొళ్లు ఒక్క రూపాయి పని చేశారా?
అక్షింతలు పంచడం తప్ప పువ్వు గుర్తొళ్లు ఏమైనా చేశారా? అని ప్ర‌శ్నించారు. యాదాద్రి (Yadadri) నరసింహ స్వామి ఆల‌యం కట్టింది కేసీఆర్. గజ్వేల్ వెంకటేశ్వర స్వామి, రామాలయం, శివాలయం అద్భుతంగా కట్టించిన కేసీఆర్ ను మ‌నం ఆద‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. పని చేసే వాళ్లకు ఓటేద్దామా? అక్షింతలు వేసే వాళ్లకు ఓటేద్దామా? అని ఓట‌ర్ల‌నుద్దేశించి ప్ర‌సంగించారు. రేవంత్‌కు ఎరువు బస్తాలిచ్చే తెలివి లేదుగాని కేసీఆర్ మీద నోరు పారేసుకునే బుద్ధి ఉంద‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ తెచ్చిన‌ పథకాలన్నీ బంద్ చేసి రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. తెలంగాణను కాపాడుకోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలని కోరారు. ప్రజ్ఞాపూర్ గౌరవం నిలబడాలంటే బీఆర్ఎస్ గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement