త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన సభకు అట్టహాసంగా ఏర్పాట్లు..

Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ (ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం)లో జరగనున్న ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికేలా ఈ సభను నిర్వహించనున్నారు.

P

Telangana | Published On Apr 24, 2026, 7.17 pm IST

Kavitha | కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన సభకు అట్టహాసంగా ఏర్పాట్లు..
Advertisement

Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ (ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం)లో జరగనున్న ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికేలా ఈ సభను నిర్వహించనున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవిత, జాగృతి స్థాపనతో ప్రజా జీవితంలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా కొత్త రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు రాబోతున్నారు.

20 ఎకరాల విస్తీర్ణంలో..

మునీరాబాద్‌లోని కన్వెన్షన్ సెంటర్‌తో పాటు సమీపంలోని 20 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం 10 గంటలకు కవిత పార్టీ పేరును ప్రకటించి జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం ఆమె ప్రసంగం ప్రారంభమై సుమారు గంటన్నరపాటు కొనసాగనుంది. శనివారం ఉదయం 7.30 గంటలకు బంజారాహిల్స్‌లోని నివాసం నుంచి కవిత ర్యాలీగా బయల్దేరి అమరవీరుల స్తూపానికి చేరుకుంటారు. ఉదయం 8.15 గంటలకు అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం 8.25 గంటలకు అక్కడి నుంచి మునీరాబాద్‌కు బయల్దేరనున్నారు. ఉదయం 9.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.

వేదికకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరు..

ప్రధాన సభా వేదికకు ‘ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం’గా నామకరణం చేశారు. ప్రధాన ద్వారానికి ‘ప్రజాకవి కాళోజీ నారాయణరావు ద్వారం’, ఇతర ద్వారాలకు రాణి రుద్రమదేవి, మారోజు వీరన్న, చాకలి ఐలమ్మ పేర్లు పెట్టారు. మీడియా కోసం ఏర్పాటు చేసిన భోజన శాలకు ‘షోయబుల్లా ఖాన్ భోజన శాల’గా పేరు పెట్టారు. కార్యకర్తలు, అతిథుల కోసం ప్రత్యేకంగా మూడు భోజన శాలలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది కార్యకర్తలు సభకు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

విందులో వంటకాలు..

సభ అనంతరం కార్యకర్తలు, అతిథులకు తెలంగాణ సంప్రదాయ రుచులతో భారీ భోజన విందు ఏర్పాటు చేశారు. మొత్తం 34 రకాల వంటకాలు సిద్ధం చేశారు. నాన్‌వెజ్‌లో తలకాయ కూర, బోటీ ఫ్రై, తెలంగాణ మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, ఎగ్ ఇగురు, బొమ్మిడాయల పులుసు వంటి వంటకాలు ఉంటాయి. వెజిటేరియన్ వంటకాల్లో బగరా బైంగన్, ఆలూ టమాటా, చామగడ్డ పులుసు, మామిడి పప్పు, కందగడ్డ ఫ్రై వంటి వంటకాలు సిద్ధం చేశారు. తెలంగాణ ప్రత్యేక వంటకాలుగా జొన్న రొట్టె, సర్వపిండి, బూరెలు, అరిసెలు, మక్క గారెలు కూడా మెనూలో చేర్చారు. బగరా రైస్, సాంబార్, పచ్చి పులుసు, ఆవకాయ, రైతా, మజ్జిగ, రాగి అంబలి కూడా అందుబాటులో ఉంటాయి. డెజర్ట్‌లో షాహీ తుక్డా, జిలేబీ, బటర్ స్కాచ్ ఐస్‌క్రీమ్ వడ్డించనున్నారు.

Advertisement
Advertisement