త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | బండి సంజ‌య్ త‌న‌యుడు విదేశాలకు వెళ్ల‌కుండా లుక్ అవుట్ నోటీస్ జారీ చేయాలి : క‌విత‌

Kavitha | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి, విదేశాలకు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

P

Telangana | Published On May 13, 2026, 5.54 pm IST

Kavitha | బండి సంజ‌య్ త‌న‌యుడు విదేశాలకు వెళ్ల‌కుండా లుక్ అవుట్ నోటీస్ జారీ చేయాలి : క‌విత‌
Advertisement

Kavitha | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి, విదేశాలకు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ కుమారుడిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆయన ప్రధాని పాల్గొన్న వేదికపై కనిపించడం ఆందోళన కలిగించే విషయమని కవిత అన్నారు. కుటుంబ సభ్యులపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఆయన ఆ కార్యక్రమానికి హాజరుకావడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. పెద్దల పిల్లలు ఏం చేసినా చర్యలు ఉండవన్న భావన సమాజంలోకి వెళ్లేలా ప్రధాని సభ దారి తీసిందని విమర్శించారు.

బీజేపీకి అది అల‌వాటైంది..

నిందితులను దేశం దాటించడమే బీజేపీకి అలవాటైందని, ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతం ఇందుకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. బండి సంజయ్ కుమారుడు విదేశాలకు వెళ్లకుండా వెంటనే లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో కొందరు సమస్య పరిష్కరించినట్టు ప్రచారం చేసుకుంటూ రాజకీయ బిల్డప్ ఇస్తున్నారని కవిత విమర్శించారు. అలాంటి వ్యాఖ్యలపై తమ స్పందనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. మైనర్ బాలికకు సంబంధించిన అంశంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సమాజం మగపిల్లల్ని క్షమించినంత సులభంగా ఆడపిల్లలను క్షమించదని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ సోష‌ల్ మీడియాతోనే ఫొటోలు బ‌య‌ట‌కు..

బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం వల్ల బాధిత బాలిక ఫొటోలు బయటకు వచ్చినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల వివరాలు బహిర్గతమైతే వారి జీవితం తీవ్రంగా ప్రభావితమవుతుందని హెచ్చరించారు. ఫొటోలు షేర్ చేసిన ఖాతాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాజకీయాలు చేయాలనే ఉద్దేశం తనకు లేదని, బాధితురాలికి న్యాయం జరగడమే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనపై కూడా కవిత విమర్శలు చేశారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆశించినా, ఆ స్థాయిలో ఎలాంటి హామీలు రాలేదని అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందని భావించినప్పటికీ, బదులుగా పొదుపు సూచనలు మాత్రమే వినిపించాయని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం నిధులు కేటాయించడం గమనించాల్సిన విషయమని అన్నారు.

సీఎం నిర్ల‌క్ష్యం చేస్తున్న‌రు..

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కవిత ఆరోపించారు. రాష్ట్ర నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం గట్టిగా నిలబడటం లేదని ప్రశ్నించారు. జాతీయ హోదా కోసం ప్రధానికి లేఖ రాయాలని రేవంత్ రెడ్డిని ఆమె కోరారు. బీఆర్ఎస్ కూడా ఈ అంశంపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని కవిత మరోసారి ఆరోపించారు. 16 రాష్ట్రాలకు ప్రాజెక్టుల జాతీయ హోదా ఇచ్చినప్పుడు తెలంగాణను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని కోరారు.

మహిళలకు ప్రత్యేక కోటా ఉండాలని..

జనగణనలో కుల గణనతో పాటు సామాజిక, ఉపవర్గాల వివరాలు కూడా పొందుపరచాలని సూచించారు. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్ర నీటి వనరులపై మాట్లాడిన కవిత, తెలంగాణ ఏర్పడిన లక్ష్యం నీళ్ల కోసమేనని గుర్తు చేశారు. గోదావరి, కృష్ణా నదుల నీటిని సరైన స్థాయిలో వినియోగించుకోవడంలో రాష్ట్రం వెనుకబడి ఉందని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా ఖర్చు చేసినా, నీటి వినియోగ వ్యవస్థ పూర్తిస్థాయిలో అభివృద్ధి కాలేదని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి 3000 ఎకరాలకు ఒక లష్కర్ నియమిస్తామని, అన్ని నదులపై దీర్ఘకాలికంగా నిలిచే చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తామని వివరించారు.

జెండా పండుగ పార్టీ నిర్మాణానికి పునాది..

ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే జెండా పండుగ పార్టీ నిర్మాణానికి పునాది వేస్తుందని కవిత అన్నారు. వివిధ నియోజకవర్గాల్లో తాను పాల్గొంటానని తెలిపారు. ఈ కార్యక్రమ పనితీరుపై ఆధారపడి పదవులు నిర్ణయిస్తామని చెప్పారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ అంశంపై ఉద్యమిస్తామని వెల్లడించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై కూడా ఆమె తీవ్ర విమర్శలు చేశారు. టెక్నాలజీ పెరిగినా పేపర్ లీక్‌లు ఆగకపోవడం ప్రభుత్వ వైఫల్యమని అన్నారు.

నాంప‌ల్లి కోర్టుకు..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కామారెడ్డిలో జరిగిన రైల్ రోకో కేసులో కవిత బుధవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లి సికింద్రాబాద్ సెకండ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్ల మేరకు ఆమె వ్యక్తిగతంగా హాజరయ్యారు. తదుపరి విచారణ జూలై 17కి వాయిదా పడింది. అనంత‌రం మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. కేసులకు భయపడేది లేదని, అవసరమైతే నిరవధిక రైల్ రోకోకూ సిద్ధమని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement