త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

John Wesley | అవాస్తవాలు మాట్లాడొద్దు: సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ

Trinethra, Trinethra.News, త్రినేత్ర‌, త్రినేత్ర‌.న్యూస్‌, John Wesley, Velugumatla, Congress, CPM, Telangana, Kerala, Khammam

A

Telangana | Published On Mar 3, 2026, 7.20 pm IST

John Wesley | అవాస్తవాలు మాట్లాడొద్దు: సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ
Advertisement

ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చ‌రిక‌

John Wesley | త్రినేత్ర‌.న్యూస్‌: ఖమ్మం పట్టణంలోని వెలుగుమట్ల (Velugumatla) గ్రామంలో ఇళ్ల కూల్చివేత గురించి అవాస్త‌వాలు మాట్లాడకూడ‌ద‌ని కాంగ్రెస్ (Congress) నాయ‌కుల‌కు సీపీఎం (CPM) రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ (John Wesley) హిత‌వు ప‌లికారు. లేనిప‌క్షంలో ప్ర‌జ‌లే త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు. ఈ మేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. దాదాపు 700 కుటుంబాలు ప‌దేళ్లుగా భూదాన్‌ భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తుంటే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది పోలీసులు, బుల్డోజర్‌లతో బలవంతంగా కుటుంబాలను బయటకు పంపించి ఇండ్లను కూల్చేశారని విమ‌ర్శించారు. ఇప్పటికీ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నార‌ని చెప్పారు. ఈ ఘటనపై స్పందిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ రాజ్యాన్ని నడుపుతోందని మండిప‌డ్డార‌ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి దీనిపై మాట్లాడుతూ ఇదంతా అవాస్తవమని, కేరళ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికలు ద ష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారనడం సరైందికాదన్నారు. దీనిని తీవ్రంగా ఖండించారు.

వెలుగుమట్లలో ఎంత విధ్వంసం జరిగిందో, కుటుంబాలు ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నరో రాష్ట్ర ప్రజానీకానికి తెలుసని చెప్పారు. శిబిరాల్లో వున్నవారికి కనీస సౌకర్యాలు కూడా లేవనే విషయం మీడియాలో, పత్రికల్లో వస్తున్నదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అక్కడికి వెళ్ళిన మీడియా ప్రతినిధులను కూడా అరెస్టు చేసి, నిర్భంధిస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. ఖమ్మం జిల్లాలో సీపీఎం పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నది వాస్తవం కాదా అని ప్ర‌శ్నించారు. ఆ ఎంపీకి ఈ పోరాటాలు క‌నిపించ‌డం లేదా, వినిపించ‌డం లేదా అని ఎద్దేవా చేశారు. ఊహాగానాలతో మాట్లాడటం సమంజసం కాదని అభిప్రాయ‌ప‌డ్డారు. అవాస్తవాలను మాట్లాడటం సరైందికాదన్నారు. ఇప్పటికైనా అక్కడున్న పేదలకు అక్కడే ఇండ్లు నిర్మించి, స్ధిర నివాసం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అవాస్తవాలను మాట్లాడి ప్రజలను మభ్యపెట్టదలచుకుంటే తప్పకుండా ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు.

ఇక్కడి ప్రభుత్వం ఇలాంటి వైఖరి అనుసరిస్తే కేరళలో వున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి వైఖరే అనుసరిస్తుందని అక్కడి ప్రజలు కూడా అర్ధం చేసుకునే అవకాశం వుంటుందన్నారు. అక్కడి వామపక్ష ప్రభుత్వం ప్రజలకు అండదండలు అందిస్తూ పేదరికాన్ని నిర్మూలిస్తూ , ఇండ్లు కట్టిస్తూ, విద్య వైద్యం ఉచితంగా అందిస్తూ నిరుద్యోగ నిర్మూలనకు ఉపాధి కల్పించే చర్యలు తీసుకుంటూ, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పెద్దఎత్తున పేద ప్రజల పక్షాల నిలబడుతున్నది కేరళలో వున్న ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం మాత్రమేన‌ని వివ‌రించారు. అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పన్నుతున్నదని విమ‌ర్శించారు. విచ్చిన్నకరమైన చర్యలకు పాల్పడుతున్నదని ధ్వ‌జ‌మెత్తారు. వాటన్నింటినీ ఎదుర్కొని అక్కడి ప్రజలు గుణపాఠం చెపుతారని ఆశాభావం వ్య‌క్తం చేశారు. తెలంగాణలో వున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తే ఇక్కడి కూడా ప్రజలు అదే విధంగా గుణపాఠం చెపుతారన్నారు.

Advertisement
Advertisement