త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jalamandali | గోదావరి ఫేజ్–2, 3 తాగునీటి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి

Jalamandali | హైదరాబాద్ మహానగర భవిష్యత్తు తాగునీటి అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్–2, 3 పనులను మరింత వేగవంతం చేయాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, ఐఏఎస్ అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు.

S

Telangana | Published On Nov 9, 2026, 7.48 pm IST

Jalamandali | గోదావరి ఫేజ్–2, 3 తాగునీటి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి
Advertisement

ఘన్‌పూర్‌లో 1,170 ఎంఎల్‌డీ డబ్ల్యూటీపీ,
80 ఎంఎల్ ఎంబీఆర్ నిర్మాణ పనుల పరిశీలన
కాంక్రీట్ నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దు
పైప్‌లైన్, టన్నెల్ పనులకు
అదనపు యంత్రాలు, కార్మిక బృందాలను సమకూర్చాలి
ప్రతి 15 రోజులకు ఒకసారి నిర్దేశించిన లక్ష్యాలకు
అనుగుణంగా పురోగతి సాధించాలి
అక్టోబర్ 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా
పనులు వేగవంతం చేయాలి
జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి

Jalamandali | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ మహానగర భవిష్యత్తు తాగునీటి అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్–2, 3 పనులను మరింత వేగవంతం చేయాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, ఐఏఎస్ అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు.

సోమవారం గోదావరి ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎండీ, పైప్‌లైన్ నిర్మాణం, టన్నెల్ తవ్వకం, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనుల పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, పెండింగ్ పనులు, నిర్దేశించిన మైలురాళ్లు, వాటి పూర్తికి అవసరమైన కాలవ్యవధిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఘన్‌పూర్‌లో 80 ఎంఎల్ ఎంబీఆర్ పనుల పరిశీలన:

ఘన్‌పూర్ వద్ద నిర్మిస్తున్న 80 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎండీ పరిశీలించారు. ముఖ్యంగా రిజర్వాయర్ కాంక్రీట్ పనులను పరిశీలించి, నిర్మాణ నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. కాంక్రీట్ పనుల్లో నిర్దేశించిన సాంకేతిక ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తూ నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. పనుల వేగంతో పాటు నిర్మాణాల నాణ్యత, పటిష్ఠతకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

1,170 ఎంఎల్‌డీ డబ్ల్యూటీపీ పనులను వేగవంతం చేయాలి:

అనంతరం ఘన్‌పూర్ వద్ద నిర్మిస్తున్న రోజుకు 1,170 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసే సామర్థ్యం గల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులను ఎండీ పరిశీలించారు. ప్లాంట్‌లోని వివిధ యూనిట్ల నిర్మాణ పురోగతి, సివిల్ పనులు, ఇతర సాంకేతిక అంశాలపై అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా పనుల్లో వేగం పెంచాలని, వివిధ విభాగాల పనులను సమాంతరంగా చేపట్టాలని ఆదేశించారు. పైపుల తయారీ, రవాణా, ట్రెంచింగ్, లేయింగ్, వెల్డింగ్, జాయింటింగ్ తదితర పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. అవసరమైన అదనపు యంత్రాలు, కార్మిక బృందాలను రంగంలోకి దించి వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో పనులు చేపట్టాలని సూచించారు.

టన్నెల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి:

ప్రాజెక్టులో భాగంగా కొనసాగుతున్న టన్నెల్ నిర్మాణ పనుల పురోగతిపైనా ఎండీ ప్రత్యేకంగా సమీక్షించారు. టన్నెల్ తవ్వకం, ఇతర అనుబంధ పనులను వేగవంతం చేయాలని, అందుబాటులో ఉన్న యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. పైప్‌లైన్, టన్నెల్, డబ్ల్యూటీపీ, ఎంబీఆర్ నిర్మాణ పనులు ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్నందున అన్ని పనులను సమాంతరంగా, సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రతి 15 రోజులకు ఒకసారి పురోగతి సమీక్ష:

ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన రోజునే ప్రతి 15 రోజులకు ఒకసారి పనుల పురోగతిని సమీక్షించాలని సూచించినట్లు ఎండీ గుర్తుచేశారు. ప్రతి సమీక్షలో నిర్దేశించిన లక్ష్యాలు, వాస్తవంగా పూర్తయిన పనులు, పెండింగ్ పనులు, జాప్యానికి గల కారణాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ సంస్థలు ప్రతి పనికి స్పష్టమైన మైలురాళ్లు నిర్ణయించుకుని, వాటికి అనుగుణంగా పురోగతి సాధించాలని సూచించారు. పనుల పూర్తికి అవసరమైన మానవ వనరులు, యంత్ర సామగ్రి, మెటీరియల్‌ను ముందుగానే సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు.

అక్టోబర్ 2027 నాటికి పూర్తి చేయాలి:

గోదావరి ఫేజ్–2, 3 ప్రాజెక్టును అక్టోబర్ 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా పనులు వేగవంతం చేయాలని ఎండీ ఆదేశించారు. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ (PMC), జలమండలి ఇంజినీరింగ్ అధికారులు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిర్మాణ సంస్థలు పూర్తి బాధ్యతతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. మహేష్ కుమార్, జీఎం, డీజీఎంలు, ఇతర ప్రాజెక్టు అధికారులు, సంబంధిత నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement