త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagadish Reddy | కేసీఆర్ వ‌స్తే నిధుల వ‌ర‌ద‌.. రేవంత్ వ‌స్తే బూతుల కంపు

Jagadish Reddy | కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో న‌ల్ల‌గొండ జిల్లాకు వ‌స్తే నిధుల వరద వచ్చేదని, రేవంత్ వస్తే బూతుల కంపు మాత్రమే వస్తోందని మాజీ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి విమ‌ర్శించారు. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక నల్లగొండకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఆరోపించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో సోమ‌వారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ న‌ల్గొండ జిల్లా ప‌ర్య‌ట‌న‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.

P

Telangana | Published On Jun 29, 2026, 4.32 pm IST

Jagadish Reddy | కేసీఆర్ వ‌స్తే నిధుల వ‌ర‌ద‌.. రేవంత్ వ‌స్తే బూతుల కంపు
Advertisement
  • న‌ల్ల‌గొండ‌లో ఖాళీ కుర్చీల ముంద‌ట వాంతి చేసుకొని పోయిండు
  • రేవంత్ వ‌చ్చాక రూపాయి వ‌చ్చింది లేదు
  • పాత కాంగ్రెస్ నేతలను తొక్కుకుంటూ వచ్చావ్
  • సబ్జెక్టు, సంస్కారం లేనోడు తిట్లు అందుకుంట‌డు
  • సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి ఫైర్‌

Jagadish Reddy | కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో న‌ల్ల‌గొండ జిల్లాకు వ‌స్తే నిధుల వరద వచ్చేదని, రేవంత్ వస్తే బూతుల కంపు మాత్రమే వస్తోందని మాజీ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి విమ‌ర్శించారు. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక నల్లగొండకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఆరోపించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో సోమ‌వారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ న‌ల్గొండ జిల్లా ప‌ర్య‌ట‌న‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఎం నిర్వహించిన సభ పూర్తిగా నిరాశపరిచిందని, జిల్లాకు ఎలాంటి అభివృద్ధి హామీలు ఇవ్వకుండా వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యార‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 'నిన్న నల్లగొండ‌లో సీఎం రేవంత్ రెడ్డి ఖాళీ కుర్చీల ముందట వాంతి చేసుకునిపోయారు. ఏమొచ్చింది నల్లగొండకు?మీటింగ్ కు అధికారుల ప్రయాసపడటం తప్ప వచ్చింది ఏమీ లేదు. అప్పుడ‌వే తిట్లు.. ఇప్పుడవే తిట్లు మాకొచ్చిందేమి లేదు అనే భావన ప్రజల్లో ఉంది' అని మాజీ మంత్రి తెలిపారు.

ఊ అంటే కేసీఆర్ మీద పడి ఏడ్చుడే

'ఊ అంటే కేసీఆర్ మీద ప‌డి ఏడ్చుడే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబిన్ కూడా కేసీఆర్‌నే టార్గెట్ చేశారు. కాంగ్రెస్ బీజేపీని.. బీజేపీ కాంగ్రెస్‌ను ఏమీ అన‌దు. మోదీ కండ్లల్లోకి చూడడు.. మోదీని ఏమనడు. కిషన్‌రెడ్డిని ఏదో అన్నట్టు చేశాడు. రూ.50 కోట్లిచ్చి పీసీసీ పదవి తెచ్చుకుని రూ.50వేల కోట్లు రేవంత్ లాగా సంపాదించుకోవచ్చని తెలిస్తే మేం పీసీసీ చీఫ్ పదవి తెచుకునేవాళ్లమని కొందరు వాపోతున్నారు. పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఈ హైబ్రిడ్ కాంగ్రెస్‌ను చూసి బాధ‌పడుతున్నారు. పాత కాంగ్రెస్ నేతలను తొక్కుకుంటూ వచ్చావ్‌. కేసీఆర్‌కు తొక్కడం తెలియదు. మూడు నిమిషాల్లో నల్లగొండకు కేసీఆర్ చేసిన 300 పనులు చెప్పగలరు. మీకు 300 గంటలు టైమ్ ఇచ్చినా మీరు చేసిందేమిటో చెప్పలేరు. సబ్జెక్టు లేనోడు సంస్కారం లేనోడే తిట్లు అందుకుంటడు. ఆ స్థాయికి మేము దిగజారలేం' అంటూ రేవంత్‌రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు జ‌గ‌దీశ్‌రెడ్డి.

నీళ్లు ఉన్నా ఇవ్వ‌ని ప‌రిస్థితి..

'నాగార్జున సాగర్ లో నీళ్లున్నా సరిగా రైతులకు ఇవ్వని పరిస్థితి. చంద్రబాబు కు నీళ్లు దోచిపెట్టడం తప్ప ఏమీ తెలియదు. మూసీ కంపును మించిన కంపు సీఎం నోటి నుంచి వస్తోంది. మహిళలు తమకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతాడేమొనని ఎదురు చూశారు. నల్లగొండ ప్రజలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి. నిన్ను తొక్కాలంటే కేసీఆర్ అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ మీద మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కాంగ్రెసోళ్లను తొక్కితే తొక్కగలవేమో బీఆర్ఎస్ కార్యకర్తను టచ్ చేయలేవు. కాంగ్రెస్ నేతలు టైం కోసం ఎదురుచూస్తున్నారు. నిన్ను తొక్కి తీరుత‌రు. కేసీఆర్ రాష్ట్ర ఆదాయాన్ని ,ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచారు. కేసీఆర్ అంటే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్. కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి దేశానికే రోల్ మోడల్ అయ్యింది. అసెంబ్లీ అంటేనే సీఎం రేవంత్ పారిపోయే రకం. అసెంబ్లీ కోసం మేము లెటర్ రాయాలా ? మేము నల్లగొండకు రమ్మని లెటర్ రాస్తేనే వచ్చావా? అసెంబ్లీ లో సీఎం మాట్లాడిన దాంట్లో మాకు సగం టైమ్ ఇచ్చినా చాలు వీళ్ళ మొహాలకి కేసీఆర్ రావాలా ? అసెంబ్లీ పెడితే కదా తెలిసేది ఎవరు వస్తారో ఎవరు రారోనని.. కాంగ్రెస్- బీజేపీలు కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నాయంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ బలంగా ఉందని అర్థం' అని మాజీ మంత్రి తెలిపారు.

రేవంత్ సంస్కారహీనత ప్రదర్శించారు : రవీంద్ర కుమార్

మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, నల్లగొండ సభలో సీఎం వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి సంస్కారహీనతను ప్రదర్శించారని విమర్శించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి చెప్పుకోలేక తిట్లకే పరిమితమవుతోందన్నారు. జగదీశ్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి చేశారని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టుల పనులు మూడేళ్లుగా ముందుకు సాగలేదని, కేసీఆర్ హయాంలో 80 శాతం పూర్తయిన ప్రాజెక్టులను కూడా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాధనాన్ని సభల పేరుతో వృథా చేస్తున్నారని, సీఎం మాటలు ప్రజలు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ సభ కోసం రూ.11 కోట్ల వరకు ఖర్చు చేశారంటూ విమర్శించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం కాకుండా మంత్రి పదవి విషయంలో జరిగిన పరిణామాల వల్లే రాజీనామా చేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రూ.1,500 కోట్లతో నల్లగొండ అభివృద్ధి జరిగిందని, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచిన ఘనత జగదీశ్ రెడ్డిదేనన్నారు. నల్లగొండలో ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు రావాలని కోమటిరెడ్డికి సవాల్ విసిరారు. ఆకారాలు కాదు.. అభివృద్ధే ముఖ్యమని పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం దాటవేత ధోరణి కొనసాగిస్తే ప్రజలే కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

కాంగ్రెస్ చేసిందేమీ లేదు : గొంగిడి సునీత

మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ నల్లగొండకు సీఎం వచ్చిన తీరు చూస్తే ప్రజలను ఉద్దేశించి మాట్లాడినట్లు కాకుండా సినిమాల్లో విలన్ పాత్రను తలపించేలా ఉందని వ్యాఖ్యానించారు. జగదీశ్ రెడ్డిపై బాడీ షేమింగ్ చేయడానికి రేవంత్‌కు హక్కు లేదన్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా జగదీశ్ రెడ్డి ఎన్నో విజయాలు సాధించారని, కాంగ్రెస్ ప్రభుత్వం నల్లగొండకు చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేసీఆర్ జిల్లాకు వచ్చిన ప్రతిసారీ వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రకటించేవారని, రేవంత్ మాత్రం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల పేర్లు ప్రస్తావించడం తప్ప చేసిందేమీ లేదన్నారు. జగదీశ్ రెడ్డి శంఖం పూరిస్తే నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు పారిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కే ప్రభాకర్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, బీఆర్‌ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి, పల్లె రవికుమార్, రామచంద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement