త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | చామ‌ల‌, ఐల‌య్య‌కు ద‌మ్ముంటే స‌బ్‌స్టేష‌న్ల వ‌ద్ద‌ చ‌ర్చ‌కు రావాలి

Harish Rao | భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలకు దమ్ముంటే రాత్రిపూట సబ్ స్టేషన్ల వద్ద కరెంట్ సరఫరాపై బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హ‌రీశ్ రావు స‌వాల్ విసిరారు.

S

Telangana | Published On Sep 20, 2026, 4.00 pm IST

Harish Rao | చామ‌ల‌, ఐల‌య్య‌కు ద‌మ్ముంటే స‌బ్‌స్టేష‌న్ల వ‌ద్ద‌ చ‌ర్చ‌కు రావాలి
Advertisement
  • క‌రెంట్ స‌మ‌స్య‌పై బ‌హిరంగంగా చ‌ర్చిద్దాం
  • మీ యాత్ర రేవంత్ మీద చేయండి.. ఊర్ల మీద కాదు
  • సీఎం రేవంత్‌రెడ్డి ఎల్‌నినో కంటే డేంజ‌ర్‌గా త‌యారైండు
  • కోమ‌టిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎందుకు సైలెంట్‌గా ఉన్న‌డో చెప్పాలి
  • మోటకొండూర్‌లో మాజీ మంత్రి హ‌రీశ్‌రావు స‌వాల్‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలకు దమ్ముంటే రాత్రిపూట సబ్ స్టేషన్ల వద్ద కరెంట్ సరఫరాపై బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హ‌రీశ్ రావు స‌వాల్ విసిరారు. క‌రెంటు ఎందుక ఇస్త‌లేరో రైతుల‌కు స‌మాధానం చెప్పాల‌న్నారు. యాదాద్రి దేవుడి మీద ఒట్లు పెట్టి రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి పట్టిన ఎల్‌నినో కంటే డేంజర్‌గా మారాడని మండిప‌డ్డారు. బొగ్గు లేదనే కుంటిసాకుతో యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెంలో 3,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆపేసి రైతుల పొట్టగొడుతున్నార‌ని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గం పరిధిలోని మోటకొండూర్ డా. బి.ఆర్. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆదివారం ఆయ‌న మాట్లాడారు.

2019, 2023 అఫిడవిట్లలో బాజాప్తా చూపించాం..

మీరు వెళ్లిన అజీజ్ నగర్ భూములు 2019, 2023 ఎలక్షన్ అఫిడవిట్లలో బాజాప్తా చూపించాం. 12 సంవత్సరాల క్రితమే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో చూపించి, మా సొంత డబ్బులతో చెక్కులు ఇచ్చి కొనుక్కున్న భూములే తప్ప అందులో ఎక్కడా కూడా ఎలాంటి తప్పుల్లేవు.

లాగ్‌బుక్‌ను మాయం చేశారు..

కరెంట్ కోతల గుట్టు బయటపడుతుందనే భయంతోనే.. మోటకొండూరు సబ్ స్టేషన్‌లో లాగ్ బుక్‌ను ముందే మాయం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నది నిజమైతే.. లాగ్ బుక్ చూపించడానికి ఈ భయమెందుకు? స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ డైవర్షన్ పాలిటిక్స్ మాని, సబ్ స్టేషన్ల వద్దకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలి. రైతులకు నాణ్యమైన కరెంట్ వచ్చేదాకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పోరాటాలకు శ్రీకారం చుడుతుంది.

కాంగ్రెస్ చేతకాని పాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ఫైల్ క్లియర్ కావాలంటే 30%, బిల్లు పాస్ కావాలంటే 15%.. ఇది ముమ్మాటికీ 30% కమిషన్ల కాంగ్రెస్ ప్రభుత్వం. నిషేధిత భూముల జాబితా 22ఏ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆస్తుల విలువను సున్నా చేసి, నడిరోడ్డున పడేసింది. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన కేసీఆర్ చావును కోరుకోవడం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారానికి, రాక్షసత్వానికి నిదర్శనం.

కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అనుకున్నాం.. కానీ ఇప్పుడు ఎల్‌నినో కంటే రేవంత్ రెడ్డి డేంజర్‌గా తయారయ్యాడు. ఉచిత కరెంట్ ఇవ్వడం ఇష్టం లేక, రైతుల పంట పండితే కొనాల్సి వస్తుందనే దురుద్దేశంతోనే ఈ కరెంట్ కోతలు, నీటి కోతలు విధిస్తున్నాడు. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు ఏమాత్రం గంట కరెంట్ పోయినా సబ్ స్టేషన్ల దగ్గరకు వెళ్లి లాగ్ బుక్స్ చెక్ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నేడు ఆరు గంటల కరెంట్ కూడా రాక రైతులు అల్లాడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావో సమాధానం చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, ప్రభుత్వ విప్ ఉన్నప్పటికీ ఈరోజు వందలాది మంది సీనియర్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరుతున్నారంటే.. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రాబోతోందనడానికి ఇది స్పష్టమైన సంకేతం. మూడేళ్ల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఎలక్షన్లు పెడితే ఎవరు గెలుస్తారనే సర్వేలన్నీ మళ్లీ కేసీఆర్ రావాలనే చెబుతున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు ఏ వర్గం చూసినా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. కేసీఆర్ ది రైతు పాలన అయితే, రేవంత్ రెడ్డిది రాక్షస పాలన. ఆనాడు 24 గంటల కరెంట్ వస్తే.. నేడు 6, 7 గంటల కరెంటు మాత్రమే వస్తోంది.

అది కూడా ట్రిప్పుల మీద ట్రిప్పులు అవుతూ వోల్టేజ్ లేక రైతులు మోటార్లు పంచుకుని నీళ్లు పారించుకునే దయనీయ స్థితికి రాష్ట్రం చేరుకుంది. రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కేసీఆర్ రైతుబంధు ఆగకుండా ఇచ్చి రైతులను కాపాడారు. రేవంత్ రెడ్డి 15,000 ఇస్తానని చెప్పి.. ఒక పంటకు రెండు ఎకరాలకే వేసి, ఇంకో పంటకు ఎకరానికే పరిమితం చేసి రైతులను నిలువునా మోసం చేశాడు. సాక్షాత్తూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టుపెట్టి దేవుణ్ని కూడా మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి. ఆగస్టు 15 డెడ్ లైన్లు మూడు దాటిపోయినా ఇప్పటికీ సగానికి సగం మందికి రుణమాఫీ కాలేదు.

బ్రోక‌ర్ల చేతిలో తోలుబొమ్మ‌..

రైతు ఏ కారణం చేత చనిపోయినా వారం రోజుల్లో 5 లక్షల బీమా ఇచ్చిన కేసీఆర్ ఎక్కడ.. అసలు రైతు బీమానే లేకుండా చేసిన రేవంత్ రెడ్డి ఎక్కడ? కాంగ్రెస్ పాలనలో వడ్ల బస్తాకు 2 నుంచి 5 కిలోల తరుగు తీశారు. అసెంబ్లీలో కూర్చుని తరుగు తీస్తే తోలుతీస్తానని డైలాగులు కొట్టిన రేవంత్ రెడ్డి.. వాస్తవానికి మిల్లర్లు, బ్రోకర్ల చేతుల్లో తోలుబొమ్మలా మారిపోయాడు. కేసీఆర్ పాలనలో ఆటోలో ఇంటికే యూరియా బస్తాలు వస్తే, నేడు యూరియా దొరక్క రైతులు క్యూ లైన్లలో నిలబడుతున్నారు. 1300 ఉండే డీఏపీ ధర నేడు 2100, 2200 కు పెరిగింది.

ప్రశ్నిస్తే కేసులు, జైళ్లు తప్ప ఈ ప్రభుత్వంలో ఏమీ లేదు. కేసులు పెడతాం, జైల్లో వేస్తాం అని రేవంత్ రెడ్డి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. 14 ఏళ్లు తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లిన ఉద్యమకారులం మేం.. నీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. కరెంట్ రాకపోతే ఎల్‌నినో, నీళ్లు రాకపోతే ఎల్‌నినో అని సాకులు చెబుతున్నారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి వైఫల్యం వల్ల వచ్చిన కరువు.

కృష్ణా నదిలో నీళ్లున్నా కల్వకుర్తిలో ఐదు మోటార్లకు రెండే నడుపుతున్నారు. ఏఎంఆర్, ఎస్ఎల్బీసీ మోటార్లు ఆన్ చేయడం లేదు. పట్టిసీమ, వెలిగొండ, రాయలసీమ లిఫ్టుల ద్వారా ఆంధ్రాకు నీళ్లు పోతుంటే.. తెలంగాణకు మాత్రం కన్నీళ్లు మిగిల్చారు. బొగ్గు లేదనే సాకుతో మన నల్గొండ జిల్లాలోని 4000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్, 500 మెగావాట్ల భద్రాద్రి, 800 మెగావాట్ల కొత్తగూడెం ప్లాంట్లలో ఏకంగా 3,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగా ఆపేశారు.

మోటకొండూర్, ఆలేరు, భువనగిరి ప్రాంతాల్లో ఎంతోమంది రైతులు, పేదల భూములను రాత్రికి రాత్రి 22A నిషేధిత జాబితాలో పెట్టి వారి ఆస్తుల విలువను సున్నా చేశారు. దీనిపై నేను ప్రశ్నిస్తే నాపై బురదజల్లుతున్నారు. నెలకు రూ. 2000 చొప్పున 33 నెలలకు ఒక్కో అవ్వతాతకు రూ. 66,000 రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. మహిళలకు ఇస్తానన్న రూ. 2500 ఏ ఒక్కరి ఖాతాలోనూ పడలేదు. 100 రోజుల్లో ఇస్తామన్న గొర్రెపిల్లల హామీ వెయ్యి రోజులైనా అమలుకాలేదు. గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా ఆపేశారు.

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట పది పాసైతే 10 వేలు, ఇంటర్ పాసైతే 20 వేలు, డిగ్రీకి 50 వేలు, పీజీకి లక్ష ఇస్తామన్న రేవంత్ రెడ్డి.. ఒక్క దళిత విద్యార్థికైనా ఒక్క రూపాయి ఇచ్చాడా? 30 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేసి వారి చదువులను ఆగం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. కేసీఆర్ ప్రభుత్వం ప్రాసెస్ పూర్తి చేసిన 16,000 ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది.

ఊర్ల మీద కాదు.. రేవంత్ మీద యాత్ర చేయండి..

ఈ మోటకొండూర్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త చెరువు తవ్వారా? ఒక్క కాలువ తీశారా? నేడు ఇంత మంచి పంటలు పండుతున్నాయంటే అది ఆనాడు కేసీఆర్ తవ్విన చెరువులు, కట్టిన చెక్ డ్యామ్‌ల చలవే. ఫైల్ క్లియర్ కావాలంటే 30%, బిల్లు పాస్ కావాలంటే 15%.. ఇది ముమ్మాటికీ 30% కమిషన్ల కాంగ్రెస్ ప్రభుత్వం. మీ కుంభకోణాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు మేము సిద్ధం, మీరు సిద్ధమా అని సవాల్ చేస్తే కాంగ్రెస్ తోక ముడిచింది. ఎంపీలు యాత్రలు చేయాల్సింది ఊర్ల మీద కాదు. రీజినల్ రింగ్ రోడ్, మెట్రో ఫేజ్-2, కృష్ణా జలాల్లో వాటా కోసం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మీద దండయాత్ర చేయాలి. ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ ఇంటి మీద యాత్ర చేయాలి.

చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ చావును ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి కోరుకోవడం ఆయన వికృత మనస్తత్వానికి నిదర్శనం. నీకు చేతనైతే కేసీఆర్ కంటే ఎక్కువగా 15,000 రైతుబంధు, 4000 పెన్షన్, 24 గంటల కరెంటు ఇచ్చి చూపించు. చేతకాకపోతే చెంపలేసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పు. కేసీఆర్ ప్రభుత్వంలో కంటి వెలుగు, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, దళిత బంధు, గొర్రెపిల్లల పంపిణీ అన్నీ సక్రమంగా జరిగేవి. నేడు కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా పిల్లలు పుట్టి, ఏడాదో రెండేళ్లో అయ్యాక గానీ రావడం లేదు.

రేవంత్ రెడ్డి పాత రోజులు తెస్తా అన్నాడు.. నిజంగానే పాత రోజులు తెచ్చాడు. ఎరువుల కోసం లైన్లలో నిలబడే పాత రోజులు, కరెంటు కోసం రాత్రంతా ఎదురుచూసే పాత రోజులు, ఊర్లన్నీ చెత్తకుప్పలుగా మారిన పాత రోజులను మళ్లీ తెచ్చాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మందులు లేవు. ఎక్స్‌రే ఫిల్మ్ లేక ఫోన్లలోనే చూస్తున్నారు. కుట్లు వేయడానికి దారం లేక బయట కొనుక్కోమని రాసిస్తున్నారు. ఇదీ ఈరోజు కాంగ్రెస్ తెచ్చిన మార్పు.

ఆలేరు నియోజకవర్గంలోని యువత, విద్యార్థులకు ఒక్కటే చెబుతున్నా.. అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే, మీకు అన్యాయం చేసిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ కోసం, రైతుల కోసం, ఆరు గ్యారెంటీల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన నిలబడి అలుపెరగని పోరాటం చేస్తుంది.

అంత‌కుముందు ఆలేరు నియోజకవర్గం పరిధిలోని మోటకొండూర్ డా. బి.ఆర్. అంబేద్కర్ చౌరస్తా వద్ద హరీశ్ రావు సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిరబోయిన మల్లేష్ యాదవ్, వేణు గార్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సునీతా మహేందర్ రెడ్డి, భిక్షమయ్య గౌడ్, పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేతలు కర్నె ప్రభాకర్, క్యామ మల్లేశం, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement