త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran 7 Conditions US Talks | చర్చలా లేక భీకర యుద్ధమా?.. అమెరికాకు ఇరాన్ ‘7 షరతుల’ అల్టిమేటం! ట్రంప్ నిర్ణయంపైనే అంతా

అమెరికాతో యుద్ధం ముగింపుపై ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఖతార్ ద్వారా ట్రంప్‌కు 7 ప్రధాన షరతులు పంపుతూ.. తేలకపోతే తేల్చుకుందామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

J

International | Published On Sep 20, 2026, 3.23 pm IST

Iran 7 Conditions US Talks | చర్చలా లేక భీకర యుద్ధమా?.. అమెరికాకు ఇరాన్ ‘7 షరతుల’ అల్టిమేటం! ట్రంప్ నిర్ణయంపైనే అంతా
Advertisement
  • శాంతి చర్చలు పునఃప్రారంభించాలంటే 7 షరతులు ఒప్పుకోవాల్సిందేనంటూ అమెరికాకు ఇరాన్ స్పష్టీకరణ
  • అన్ని వైపులా దాడులు ఆపాలని, నిలిపివేసిన నిధులను విడుదల చేయాలని, నేవల్ బ్లాకేడ్ ఎత్తివేయాలని ప్రధాన డిమాండ్లు
  • షరతులకు తలొగ్గకుంటే తీవ్రమైన నిర్ణయాత్మక యుద్ధానికి తాము సిద్ధమని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ మొహ్సెన్ రెజాయ్ హెచ్చరిక
  • ఖతార్, పాకిస్థాన్ ల మధ్యవర్తిత్వం
  • ట్రంప్ నిర్ణయంపై ఆధారపడ్డ భవిష్యత్తు పరిణామాలు

Iran 7 Conditions US Talks | త్రినేత్ర.న్యూస్ : అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ టెహ్రాన్ అత్యంత కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని శాశ్వతంగా ముగించి చర్చలు ప్రారంభించాలంటే తాము విధించిన 7 ప్రధాన షరతులకు వాషింగ్టన్ అంగీకరించాల్సిందేనని తేల్చిచెప్పింది. లేనిపక్షంలో ఏ క్షణమైనా 'నిర్ణయాత్మక యుద్ధానికి' (Decisive War) సిద్ధపడాల్సి ఉంటుందని వైట్‌హౌస్‌ను నేరుగా హెచ్చరించింది.

ఖతార్ దౌత్య మార్గాల ద్వారా ఈ నిబంధనల పత్రాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చేరవేసినట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ అల్ జజీరాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం తాము ట్రంప్ ఇచ్చే సమాధానం కోసమే వేచి చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్ ముందుంచిన ప్రధాన డిమాండ్లు ఇవే

  • అన్ని రకాల సైనిక ఫ్రంట్లపై తక్షణమే దాడులు నిలిపివేయాలి.
  • అంతర్జాతీయంగా నిలిపివేసిన (ఫ్రోజెన్) ఇరాన్ నిధులను విడుదల చేయాలి.
  • ఎర్ర సముద్రం, పరిసర జలాల్లో విధించిన నేవల్ బ్లాకేడ్ (నౌకాదిగ్బంధం)ను ఎత్తివేయాలి.

"ఈ షరతులను అంగీకరించడం వాషింగ్టన్‌కే మంచిది. ట్రంప్ బెదిరింపులతో ఎలాంటి ఫలితం ఉండదు. తాడోపేడో తేల్చుకునే సమరానికి మేము అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాం. అమెరికా ఈ సంక్షోభ ఊబి నుంచి బయటపడాలంటే ఇరాన్ హక్కులను, డిమాండ్లను గుర్తించక తప్పదు" అని రెజాయ్ తన సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్' లో స్పష్టం చేశారు.

అమెరికా నౌకాదళాలే టార్గెట్

అమెరికా సైన్యం మరోసారి వైమానిక దాడులు చేసే అవకాశం ఉందని, తాము దానిని ఎదుర్కొనేందుకు మిలిటరీ ప్లానింగ్‌ను పూర్తిగా మార్చినట్లు రెజాయ్ చెప్పారు. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రాల్లో ఉన్న అమెరికా నావికాదళాలే తమ ప్రధాన టార్గెట్ అని వెల్లడించారు. ఇటీవల తాము అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ సమీపంలో 'మల్టీ-వార్‌హెడ్ యాంటీ-షిప్ క్షిపణి'ని విజయవంతంగా ప్రయోగించామని గుర్తుచేశారు. మున్ముందు దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు వాణిజ్య ప్రయోజనాలపైనా దెబ్బకొడతామని హెచ్చరించారు.

దౌత్య మార్గాల్లో శాంతి ప్రయత్నాలు.. కానీ

ఒకవైపు కఠిన హెచ్చరికలు జారీ చేస్తూనే, సంక్షోభాన్ని త్వరగా ముగించేందుకు ఖతార్, పాకిస్థాన్ వంటి దేశాల ద్వారా దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని టెహ్రాన్ తెలిపింది. ఇక అణు ఒప్పందం నుంచి తప్పుకునే ఆలోచన ప్రస్తుతానికి లేనప్పటికీ, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ద్వారా మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తే తీవ్ర నిర్ణయాలు తీసుకోక తప్పదని హెచ్చరించింది.

మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల యాక్సియోస్ (Axios)తో మాట్లాడుతూ.. ఇరాన్‌పై భారీ సైనిక చర్య తీసుకోవాలా వద్దా అనే అంశంపై పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. "ఇరాన్ పాలక వ్యవస్థను పూర్తిగా తుడిచిపెట్టేయాలా వద్దా అనే దానిపై నిర్ణయం నా చేతుల్లో ఉంది.. నాతో ఏదైనా జరగొచ్చు" అని ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, తాజా ఇరాన్ అల్టిమేటం పశ్చిమాసియా రాజకీయాల్లో మరింత తీవ్ర సంచలనం రేపుతోంది.

Advertisement
Advertisement