త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | విష ప్ర‌చారం న‌మ్మ‌కండి.. అంగుళం భూమి కూడా తీసుకోం

Ponguleti Srinivas Reddy | ద‌ళితులు, గిరిజ‌నులకు సంబంధించిన అంగుళం భూమిని కూడా తీసుకోమ‌ని.. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భ‌రోసా ఇచ్చారు.

S

Telangana | Published On Sep 20, 2026, 3.19 pm IST

Ponguleti Srinivas Reddy | విష ప్ర‌చారం న‌మ్మ‌కండి.. అంగుళం భూమి కూడా తీసుకోం
Advertisement
  • దళితులకు, గిరిజనులకు భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్‌ది
  • ఎవరూ ఆందోళన చెందొద్దు
  • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ద‌ళితులు, గిరిజ‌నులకు సంబంధించిన అంగుళం భూమిని కూడా తీసుకోమ‌ని.. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భ‌రోసా ఇచ్చారు. భూములను లాక్కోవడం ప్రజా ప్రభుత్వ విధానం కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం దళితుల భూములకు సంపూర్ణ రక్షణగా నిలుస్తుందన్నారు. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయ‌న పేద‌ల‌కు భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల క్రితం దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, పేదల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎప్పుడూ ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయని తెలిపారు.

దేశంలో, రాష్టం లో పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చ‌రిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. భూ సంస్కరణలు, భూ పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా భూమిలేని దళితులకు భూములు ఇచ్చి ఆ భూమిపై హక్కు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉందన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో దళితులకు సుమారు 25 లక్షల ఎకరాల భూముల పంపిణీ,అలాగే పోడు భూముల విషయంలో గిరిజనులకు సుమారు 2 లక్షల ఎకరాలపై హక్కులు కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్‌దేనని తెలిపారు.

దొర‌వారి మాట‌లు న‌మ్మొద్దు..

భూమిలేని వారికి భూమి, హక్కులు లేని వారికి హక్కులు కల్పించడమే కాంగ్రెస్ విధానం అని స్పష్టం చేశారు. దళిత, గిరిజనుల భూ హక్కులను కాపాడుతూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అధికారంలోకి వస్తే దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించిన దొరవారి మాటలు నమ్మకూడదని విజ్ఞప్తి చేశారు.

రెవెన్యూ శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున దళిత కుటుంబాలకు తాను స్పష్టమైన హామీ ఇస్తున్నానని “మీ అంగుళం భూమి కూడా ప్రభుత్వం లాక్కోదు. మీ భూమిని తీసుకునే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మీ భూముల విషయంలో మీరు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది” అని ఆయన అన్నారు. భూములకు సంబంధించిన రికార్డుల పరిశీలన, సర్వేలు, భూ సమస్యల పరిష్కారం వంటి ప్రక్రియలను ప్రజల భూములను లాక్కోవడానికి చేస్తున్న చర్యలుగా చూడటం సరికాదు. భూములపై ప్రజలకు ఉన్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూ వివాదాలను పరిష్కరించడం, భూ హక్కులకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశం.

దళితుల భూముల విషయంలో కొంతమంది దొరలు కావాలనే భయాందోళనలు సృష్టిస్తూ విషప్రచారం చేస్తున్నారని, తమ స్వార్థ ప్రయోజనాల కోసం దళితులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. “ఎవరో ఏదో చెప్పారని భయపడాల్సిన అవసరం లేదు. మీ భూముల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇస్తోంది. వాస్తవాలను తెలుసుకోకుండా ఎలాంటి విషప్రచారాన్ని నమ్మవద్దు. ” అని మంత్రి పేర్కొన్నారు.

దళితులను రెచ్చగొట్టి వారి భూముల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూసే ప్రయత్నాలను అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా భూములపై హక్కులు లేక ప్రభుత్వ ప్రయోజనాలకు దూరమైన దళిత, గిరిజనులకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. రీ-సర్వే ద్వారా భూముల వాస్తవ పరిస్థితులను గుర్తించి దళితులకు, గిరిజనులకు హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు.

సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల ప్రాంతంలోని 15 రెవెన్యూ గ్రామాల్లో, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం చూపించామన్నారు. భూమిపై హక్కులు కల్పించడం ద్వారా వారికి ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దళిత, గిరిజనులకు వారి భూములపై హక్కులను కల్పించి మరింత పటిష్టం చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమ‌న్నారు. దళిత కుటుంబాలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement