త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Teenmar Mallanna | సెప్టెంబ‌ర్ 17 నుంచి పాద‌యాత్ర చేస్తా.. రెడ్లు, వెలమల‌ దోపిడీ లెక్కలు ఇంటింటికీ వివరిస్తా

Teenmar Mallanna | వచ్చే సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్రంలో పాద‌యాత్ర చేస్తాన‌ని టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. ప్రతి గడపకు చేరుకుని రెడ్లు, వెల‌మ‌లు చేసిన‌ దోపిడీ లెక్క‌ల‌ను వివ‌రిస్తాన‌న్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీల‌ను ఖాళీ చేసి తెలంగాణ‌లో ఆ పార్టీలు క‌నిపించ‌కుండా చేస్తాన‌న్నారు.

S

Telangana | Published On Aug 30, 2026, 7.04 pm IST

Teenmar Mallanna | సెప్టెంబ‌ర్ 17 నుంచి పాద‌యాత్ర చేస్తా.. రెడ్లు, వెలమల‌ దోపిడీ లెక్కలు ఇంటింటికీ వివరిస్తా
Advertisement
  • కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఖాళీ చేస్తా.. ఇక‌ ఆ పార్టీలు తెలంగాణలో కనిపించవు
  • 2029లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రే ఉంట‌డు
  • రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం 
  • టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్య‌లు

Teenmar Mallanna | త్రినేత్ర‌.న్యూస్:  2029లో రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఉంటాడ‌ని జోస్యం చెప్పారు. ఇక రేవంత్‌రెడ్డే చివ‌రి ఓసీ సీఎం అని పేర్కొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం తీన్మార్ మల్లన్న అధ్యక్షతన జ‌రిగిన‌ రాష్ట్ర కమిటీ సమావేశం సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజిని కుమార్ యాదవ్ సమావేశ ఎజెండాను ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ప్ర‌జల ఆకాంక్షలు, ఆశయాల సాధన కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సెప్టెంబర్ 17 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పార్టీ ప్లీనరీ నిర్వహించాలని రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీ ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ప్రజలకు చేరువై, అనేక ప్రజా సమస్యలపై పోరాటాలకు కేంద్ర బిందువుగా మారిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ప్రజలకు నమ్మకం తగ్గిపోయిందని, ప్రస్తుతం ప్రజలందరి చూపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపే ఉందని మల్లన్న అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా టీఆర్పీ ఎదుగుతోందని తెలిపారు. ముఖ్యంగా బీసీలకు జరుగుతున్న అన్యాయంపైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన గళాన్ని విప్పుతూ ప్రజలకు మరింత చేరువైందన్నారు. పాదయాత్ర ద్వారా ఊరూరా ప్రజలను చైతన్యం చేస్తూ, బీసీలకు జరిగిన అన్యాయాలను, రాజకీయంగా జరిగిన మోసాలను ఇంటింటికీ తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు.

రాజ్యాధికారం ద‌క్కేవ‌ర‌కు పోరాటం..

ఈ పోరాటం కేవలం రాజకీయ పోరాటం కాదని, బీసీల రాజ్యాధికార సాధన కోసం జరుగుతున్న సామాజిక ఉద్యమమని మల్లన్న స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించకుండా ఉద్యమాన్ని కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత బలంగా తీసుకెళ్లాలని, ప్రతి నాయకుడు ప్రతి బీసీ కుటుంబాన్ని కలుస్తూ చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వాల వైఫల్యాలను ఎక్కడికక్కడ పాదయాత్రలో ఎండగడతామని స్పష్టం చేశారు.

సెప్టెంబ‌ర్ 7న రాష్ట్ర‌స్థాయి స‌మావేశం..

పాదయాత్రకు సంబంధించిన పూర్తి కార్యాచరణ, మార్గరేఖ, ప్రారంభ స్థలం తదితర అంశాలపై సెప్టెంబర్ 7న రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించి జిల్లా ముఖ్య నాయకులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పార్టీ జిల్లా కమిటీల ఏర్పాటు దాదాపు 90 శాతం పూర్తయ్యిందని, మండల, గ్రామస్థాయి కమిటీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పార్టీ అనుబంధ సంఘాలను మరింత బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

తెలంగాణలో బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రాజ్యాధికారం సాధించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని మల్లన్న పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు చేసిన అన్యాయాలు, ఇచ్చిన హామీల అమలులో విఫలమైన తీరును ప్రజలకు వివరించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు లింగాల గంగాధర్, మదన్ మోహన్ చారి, ఆర్ భావన వెంకటేష్, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, జ్యోతి పండల్, కోశాధికారి కొక్కలకొండ మనోజ్, ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, ఆకుల హనుమాన్లు, కోమల మంజుల గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్, మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, మైనారిటీ అధ్యక్షుడు సల్మాన్, సోషల్ మీడియా కన్వీనర్ మనోజ్ ఆకుల, రాష్ట్ర కార్యదర్శులు రమేష్ యాదవ్, నగేష్ ముదిరాజ్,అఖిల్ పాషా, కడారి శ్రీనివాస్, గట్ల రాజన్న, సహాయ కార్యదర్శులు ఐలయ్య యాదవ్, భిక్షపతి గౌడ్ రాష్ట్ర నాయకులు పిట్టల శంకర్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement