త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR on Revanth Reddy | రూ.30 వేల కోట్లు ఎగ్గొట్టి.. ఆశీర్వాద సభల పేరిట నాటకాలా? సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

రైతు భరోసా కింద రూ.30 వేల కోట్లు ఎగగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆశీర్వాద సభల పేరిట డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

J

Telangana | Published On Jun 30, 2026, 8.56 pm IST

KTR on Revanth Reddy | రూ.30 వేల కోట్లు ఎగ్గొట్టి.. ఆశీర్వాద సభల పేరిట నాటకాలా? సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
Advertisement
  • రైతు భరోసా నిధులు ఎగగొట్టి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారన్న కేటీఆర్ 
  • రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత నుంచి రైతుల దృష్టి మళ్లించేందుకే ఆశీర్వాద సభలని విమర్శ
  • రుణమాఫీ, పంట కొనుగోళ్లలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపాటు
  • కేసీఆర్ రైతు బాంధవుడు అయితే, రేవంత్ రెడ్డి చరిత్రలో 'రైతు ద్రోహి'గా మిగిలిపోతారని ఫైర్

KTR on Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో రైతుల సమస్యలు, రైతు భరోసా అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతన్నలకు రూ. 30 వేల కోట్ల రైతు భరోసా ఎగగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు యూరియా కొరత నుంచి రైతుల అటెన్షన్ డైవర్ట్ (Attention divert) చేసేందుకే ఆశీర్వాద సభల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

పీఆర్ స్టంట్స్ కోసం అరకొర నిధులు

కేవలం పబ్లిసిటీ కోసం, పీఆర్ స్టంట్స్ (PR stunts) కోసమే కంప్యూటర్ బటన్ నొక్కి అరకొర నిధులు విడుదల చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రతి ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని గ్యారెంటీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక కేవలం ఒకటి, రెండు ఎకరాలకు మాత్రమే సాయం అందించి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. ఏకంగా నాలుగు సార్లు రైతు భరోసాను ఎగ్గొట్టి దాదాపు 70 లక్షల మంది రైతుల ఉసురు పోసుకున్నారని ఫైర్ అయ్యారు.

రుణమాఫీ ఫెయిల్.. ఢిల్లీ టూర్లకు మాత్రం కోట్లు

రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ రైతులను నిలువునా మోసం చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు. రూ. 50 వేల కోట్లతో పూర్తి చేయాల్సిన రెండు లక్షల రుణమాఫీలో కనీసం పావలా వంతు కూడా చేయలేదని ఆరోపించారు. సీఎం ఢిల్లీ టూర్లకు, పబ్లిక్ మీటింగ్స్ (Public meetings) కోసం పెడుతున్న కోట్లాది రూపాయల ఖర్చును ఆదా చేస్తే రైతులకు పెట్టుబడి సాయం అందేదన్నారు. మరోవైపు పంట కొనుగోళ్ల బాధ్యతను కేంద్రంపై నెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడం వారి చేతకానితనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

కేసీఆర్ రైతు బాంధవుడు.. రేవంత్ రైతు ద్రోహి

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండుగలా సాగిందని కేటీఆర్ గుర్తుచేశారు. టంచన్‌గా 11 సార్లు, సుమారు రూ. 73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసి కేసీఆర్ 'రైతు బాంధవుడి'గా నిలిచారని ప్రశంసించారు. కానీ రైతుల గొంతు కోసి.. వెన్నుపోటు పొడిచిన రేవంత్ రెడ్డి మాత్రం చరిత్రలో 'రైతు ద్రోహి'గానే మిగిలిపోతారని, రైతులు పెడుతున్న ఈ శాపం ఆయనను ఎప్పటికీ వెంటాడుతుందని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు.

Advertisement
Advertisement