త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | త‌వ్విన కొద్ది.. గుట్ట‌ల కొద్ది అప్పులు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. గ‌త ప్ర‌భుత్వ అప్పుల‌పై దృష్టి సారిస్తే.. త‌వ్విన కొద్ది గుట్ట‌ల కొద్ది అప్పులు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దాదాపు 18 మంది ముఖ్య‌మంత్రులు రూ. 69 వేల కోట్ల అప్పులు చేస్తే.. కేవ‌లం ప‌దేండ్ల‌లో ఒకే ఒక్క క‌ల్వ‌కుంట్ల కుటుంబం రూ. 8 ల‌క్ష‌ల 11 వేల కోట్లు అప్పు చేసింద‌ని సీఎం గుర్తు చేశారు.

S

Telangana | Published On Jun 30, 2026, 8.09 pm IST

CM Revanth Reddy | త‌వ్విన కొద్ది.. గుట్ట‌ల కొద్ది అప్పులు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. గ‌త ప్ర‌భుత్వ అప్పుల‌పై దృష్టి సారిస్తే.. త‌వ్విన కొద్ది గుట్ట‌ల కొద్ది అప్పులు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దాదాపు 18 మంది ముఖ్య‌మంత్రులు రూ. 69 వేల కోట్ల అప్పులు చేస్తే.. కేవ‌లం ప‌దేండ్ల‌లో ఒకే ఒక్క క‌ల్వ‌కుంట్ల కుటుంబం రూ. 8 ల‌క్ష‌ల 11 వేల కోట్లు అప్పు చేసింద‌ని సీఎం గుర్తు చేశారు. శిల్పాక‌ళా వేదిక‌లో రైతు భ‌రోసా నిధుల పంపిణీ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా సీఎం ప్ర‌సంగించారు.

రైతు సోద‌రులారా ఈనాడు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జా పాల‌న చేప‌ట్టింది. 30 నెల‌ల పాల‌న‌లో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించుకుంటూ ముందుకు పోతున్నాం. రైతు సంక్షేమం కోసం రైతును త‌లెత్తుకునే విధంగా, ఆత్మ‌గౌర‌వంతో బ‌తికే విధంగా వ్య‌వ‌సాయాన్ని పండుగ‌లా ఈనాడు తీర్చిదిద్దాల‌ని ప్ర‌య‌త్నం చేస్తుంది ప్ర‌జా ప్ర‌భుత్వం అని సీఎం పేర్కొన్నారు.

మ‌న మీద మ‌న్నుక‌ప్పి

మ‌ద్రాస్ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయిన ఆనాడు ప్ర‌కాశం పంతులు, బెజ‌వాడ‌ గోపాల్ రెడ్డి సీఎంలుగా, హైద‌రాబాద్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి బూర్గుల రామ‌కృష్ణారావు నుంచి మొద‌లుపెడితే ఉమ్మ‌డి ఏపీ సీఎం నీలం సంజీవ‌రెడ్డి నుంచి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి వ‌ర‌కు కావొచ్చు.. 1947 నుంచి 2014 వ‌ర‌కు ఆరు ద‌శాబ్దాల‌కు పైగా ప‌రిపాల‌న సాగించి, మ‌న రాష్ట్రం మీద‌, రాష్ట్ర విడిపోయిన‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన అప్పు 69 వేల కోట్లు. జూన్ 2, 2014 నుంచి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు తెలంగాణ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టి డిసెంబ‌ర్ 7, 2023 నాడు ప్ర‌జా పాల‌న‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన అనంత‌రం తెలంగాణ సీఎంగా నాకు బాధ్య‌త అప్ప‌జెప్పిన‌ప్పుడు రూ. 8 ల‌క్ష‌ల 11 వేల కోట్లు. 18 మంది సీఎంలు 69 వేల కోట్లు చేస్తే, కేవ‌లం ఒకే ఒక్క కుటుంబం 7 ల‌క్ష‌ల‌కు పైగా అప్పు చేసింది. 16 వేల కోట్ల మిగులు ధ‌నిక రాష్ట్రంగా సోనియా, మ‌న్మోహ‌న్ సింగ్ అప్ప‌జెప్పితే అప్పుల ఊబిలో నిండా ముంచేశారు కేసీఆర్. మ‌న మీద మ‌న్నుక‌ప్పి, అప్పులు, త‌ప్పులు చేసి 8 ల‌క్ష‌ల 11 వేల కోట్ల‌తో అప్ప‌జెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

4 ల‌క్ష‌ల కోట్లు కూడా లేద‌ని బుకాయించే ప్ర‌య‌త్నం

ఎన్నిక‌ల సంద‌ర్భంలో 6 ల‌క్ష‌ల కోట్ల అప్పు ఉందని మేం అంటే కాంగ్రెస్ అబ‌ద్దాలు చెబుతుంద‌న్నారు. 4 ల‌క్ష‌ల కోట్లు కూడా లేద‌ని బుకాయించే ప్ర‌య‌త్నం చేశారు. సీఎంగా బాధ్య‌త చేప‌ట్టిన త‌ర్వాత భ‌ట్టి విక్ర‌మార్కకు తొలి మంత్రివ‌ర్గ స‌మావేశంలో పూర్తిగా మ‌న రాష్ట్ర అప్పు ఎంత..? ఏ విధ‌మైన అప్పు ఉంది..? ప్ర‌త్య‌క్షంగా తెచ్చ‌కున్న అప్పు ఎంత‌..? కార్పొరేష‌న్ల ద్వారా తెచ్చుకున్న అప్పు ఎంత‌..? శాఖ‌ల మీద ఎంత అప్పు ఉందో లెక్క‌లు తీయండి.. శ్వేత‌ప‌త్రం స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టి వివ‌రాలు అందిద్దామ‌ని ప్ర‌య‌త్నం చేశారు. త‌వ్విన కొద్ది గుట్ట‌ల కొద్ది అప్పులు బ‌య‌ట‌ప‌డ్డాయని సీఎం తెలిపారు.

క‌ష్ట‌మైనా జీతాలు ఇవ్వాల్సిందే అని మొద‌టి ఆదేశం

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు నెల‌కు జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి ఉంద‌ని సీఎస్ చెప్పారు. ఇది వాస్త‌వం. ప్ర‌భుత్వం అంటే య‌జ‌మాని.. ఒక‌టో తేదీ నాడు జీతం ఇవ్వ‌క‌పోతే భ‌రోసా ఉండ‌దు.. ప‌ని చెప్పాలంటే కూడా య‌జ‌మానికి ధైర్యం ఉండ‌దు. అట్ల కుదర‌దు అని క‌ష్ట‌మైనా జీతాలు ఇవ్వాల్సిందే అని మొద‌టి ఆదేశం ఇచ్చాను. స‌ర్పంచ్‌ల‌కు బ‌కాయిలు పెట్టారు. స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు ధ‌ర్నాలు చేశారు. బ‌కాయిలు పెట్టిందేమో బ‌కాసురుడు.. క‌ట్టే పాపం ఏమో నా మీద ప‌డ్డ‌ది అని సీఎం విమ‌ర్శించారు.

త‌ప్పించుకు తిర‌గ‌కుండా పాల‌న చేస్తున్నా

అప్పులు జేసుడు కాదు.. అడ్డ‌గోలుగా త‌ప్పులు చేశారు. ఢిల్లీకో పోతే, గ‌ల్లీకి పోతే ఇజ్జ‌త్ లేదు.. 30 నెల‌ల్లోనే స‌మాజంలో గౌర‌వం పెంచుకుంటూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకుంటూ విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్తున్నాం. మీ మ‌ధ్య‌లోనే ఉంటూ త‌ప్పించుకు తిర‌గ‌కుండా పాల‌న చేస్తున్నా. ఫామ్ హౌజ్‌లో ప‌డుకోకుండా ప‌ని చేస్తున్నామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement