త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ద‌మ్ముంటే అసెంబ్లీ ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లు.. నువ్ మ‌ళ్లీ గెల‌వ‌డం క‌లే

KTR | ఇక రేవంత్ రెడ్డి తిరిగి ఎన్నికయ్యేది కలేన‌ని, దమ్ముంటే అసెంబ్లీ ర‌ద్దు చేసి ఎన్నికలకు వెళ్లాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌వాల్ విసిరారు. రేవంత్ సొంత సర్వేలోనే బీఆర్ఎస్‌కు 78 సీట్లు వచ్చింది ముమ్మాటికీ నిజ‌మ‌న్నారు. సర్వే చేయించుకోలేదని రేవంత్ రెడ్డి దేవునిపై ఒట్టేసి చెప్పాలని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Jul 11, 2026, 3.53 pm IST

KTR | ద‌మ్ముంటే అసెంబ్లీ ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లు.. నువ్ మ‌ళ్లీ గెల‌వ‌డం క‌లే
Advertisement
  • రేవంత్ సొంత‌ స‌ర్వేలో బీఆర్ఎస్‌కు 78 సిట్లు వ‌చ్చింది ప‌చ్చి నిజం
  • స‌ర్వే చేయ‌లేద‌ని దేవుడిపై ఒట్టేసి చెప్పు
  • రేవంత్ మాటల్లో పిచ్చి వాగుడు, వట్లు, తిట్లు తప్పించి ఇంకేమీ లేవ్
  • కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయ‌కుండా ప్ర‌జ‌ల‌ను ప‌గ‌బ‌ట్టిండు
  • మీడియా స‌మావేశంలో సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: ఇక రేవంత్ రెడ్డి తిరిగి ఎన్నికయ్యేది కలేన‌ని, దమ్ముంటే అసెంబ్లీ ర‌ద్దు చేసి ఎన్నికలకు వెళ్లాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌వాల్ విసిరారు. రేవంత్ సొంత సర్వేలోనే బీఆర్ఎస్‌కు 78 సీట్లు వచ్చింది ముమ్మాటికీ నిజ‌మ‌న్నారు. సర్వే చేయించుకోలేదని రేవంత్ రెడ్డి దేవునిపై ఒట్టేసి చెప్పాలని డిమాండ్ చేశారు. తన పాలనపై నమ్మకం ఉంటే మళ్లీ గెలుస్తాన‌న్న‌ది నిజమైతే వెంటనే ఉప ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. కాలేశ్వరం నీటిని ఎత్తిపోయకుండా తెలంగాణ ప్రజలపై పగబట్టాడని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

మేడిగడ్డతో సంబంధం లేకుండా గోదావరి బేసిన్‌లో ఉన్న అన్ని రిజర్వాయర్లు చెరువులు నింపవచ్చు. కాలేశ్వరం వరదతో సంబంధం లేని భద్రాచలం మునిగిపోతుంది అంటూ రేవంత్ అబద్ధాలు చెప్పాడు. కరువు ముంగిట తెలంగాణ ఉన్న‌ప్ప‌టికీ కిందికి నీళ్లను వదిలేస్తున్నాడు. రేవంత్ రైతు ద్రోహిగా మిగిలిపోతాడు. రాముడిపై ఒట్టు వేసి అబద్ధాలు చెబితే రేవంత్ రెడ్డికి నష్టం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు లేదా పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు, లేదంటే అసెంబ్లీని రద్దు చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలి అని కేటీఆర్‌ స‌వాల్ విసిరారు.

రేవంత్‌కు నీళ్లు ఎత్తిపోయడం తెలవదు. సంచుల్లో పైసలు నింపి ఢిల్లీకి కట్టే ఈఎంఐ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొలవది అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమించి, సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్. అలాంటి ఆయన గురించి రేవంత్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. రేవంత్‌కు ఎత్తు ఒక్కటే తక్కువ అనుకున్నా.. కానీ బుర్ర కూడా తక్కువే అని ఇప్పుడు తెలిసింది. రాహుల్ గాంధీ 2014 నుంచి పదుల సంఖ్యలో ఎన్నికలు ఓడిపోయిండు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టేనా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

78 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. దీంతోపాటు మరో మూడు, నాలుగు సర్వేల్లో కూడా బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని తెలిసింది. ఈ సర్వేలపైన నమ్మకం లేకుంటే రేవంత్ రెడ్డి తాను నిజంగానే సర్వే చేయించలేదనే విషయంపై దేవుడిపై ప్రమాణం చేసి చెప్పాలి అని డిమాండ్ చేశారు.

లక్షల క్యూసెక్కుల నీరు కిందికి పారుతుంటే తెలంగాణని కరువు కాటకాల ముందు నిలబెట్టే కుట్ర చేస్తుండు. కాళేశ్వరంలో మేడిగడ్డతో సంబంధం లేకుండా మొత్తం గోదావరి పరీవాహక ప్రాంతం రైతన్నలకు ప్రజలకు నీళ్లు అందించే అవకాశం ఉంది. అయినా రేవంత్ రెడ్డి మూర్ఖత్వంతో, తెలివి తక్కువతనంతో గత ప్రభుత్వంపై నింద‌లు వేస్తున్నారు. కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని అక్కడ పారుతున్న నదిని ప్రజలకు చూపించడంతోనే తన బండారం బయటపడింది. రేవంత్ రెడ్డికి పిచ్చి లేసి అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడారు. ఒకవైపు ప్రజలు రిటైర్డ్ ఇంజినీర్లు పార్టీలు నీటిని ఎత్తిపోసి రానున్న కరువును ఆపాలని డిమాండ్ చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ నీళ్లను తన గురువు కోసం కిందికి వదిలిపెడుతున్నారు అని కేటీఆర్ ఆరోపించారు.

లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోయే ప్రమాదముంది..

ఈరోజు రాష్టంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. వర్షపాత లోపం ఉంది. రానున్న రోజుల్లో వర్షం కూడా పడకపోవచ్చ‌ని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావం ఉంది. ఈ స‌మ‌యంలో గోదావరి బేసిన్‌లో ఉన్న రిజర్వాయర్ల స్టోరేజీ కూడా సగానికి పైగా ఖాళీగా ఉంది. మరోవైపు కన్నెపల్లి దగ్గర లక్షల క్యూసెక్కుల నీరు కిందికి పారుతుంది. రానున్న అక్టోబర్ వరకు కూడా ఈ లక్షల క్యూసెక్కుల నీరు కిందికి వృథాగా పోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ నీటిని రానున్న 100 రోజుల పాటు కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ప్రారంభించి ఎత్తిపోస్తే గోదావరి బేసిన్ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఇదే మాటను తాజాగా తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు ముఖ్యమంత్రికి వివరిస్తూ లేఖ రాశారు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గుర్తు చేశారు.

పట్టిసీమ పంప్ హౌస్ ద్వారా నీటిని తోడుకుంటున్నారు..

కాంగ్రెస్ ప్రభుత్వానికి మాపై కోపం ఉండవచ్చు లేదా ద్వేషం ఉండవచ్చు. కానీ తెలంగాణ ప్రజలపై, రైతన్నలపై అక్కసు పెట్టుకోకుండా కిందికి పారుతున్న నీటిని ఎత్తిపోస్తే అందరికీ మంచి జరుగుతుంది. రేవంత్ రెడ్డి మాత్రం మేడిగడ్డ బ్యారేజీ పేరు చెప్పి అది కూలిపోతుంది అని ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజలను అటెన్షన్ డైవర్షన్ చేస్తూ కిందికి నీళ్లను పంపిస్తుంటే.. పక్క రాష్ట్రం వాళ్లు పట్టిసీమ పంప్ హౌస్ ద్వారా, పంపులతో భారీగా నీటిని తోడుకుంటున్నారు. మేడిగడ్డతో ఎలాంటి సంబంధం లేకుండానే, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఒక్క గేటు కూడా మూయకుండానే, కన్నెపల్లి నదీ ప్రవాహం దగ్గర 93 మీటర్ల ప్రవాహం నమోదైన ప్రతిసారి భారీగా నీళ్లను ఎత్తిపోసుకోవచ్చు. ప్రతిరోజు ఒక హుస్సేన్ సాగర్‌లో ఉన్న స్థాయిలో ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉన్నది అని ఆయ‌న వివ‌రించారు.

ఈరోజు దాదాపు 97 మీటర్ల నదీ ప్రవాహం కన్నెపల్లి దగ్గర పారుతున్నది. ఒక్క బటన్ ద్వారా పంపులు ప్రారంభించి నీటిని ఎత్తిపోస్తే తెలంగాణ కరువు నుంచి దూరం అవుతుంది. రానున్న 100 రోజుల పాటు కనీసం 200 టీఎంసీల నీటిని గోదావరి బేసిన్‌లో ఉన్న రిజర్వాయర్లు, ప్రాజెక్టులకు నింపవచ్చు. మిడ్ మానేరు, లోయర్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అనంతగిరి, మల్కపేట, బస్వపూర్ రిజర్వాయర్లు అన్నీ నిండుతాయి. దీంతో సగం తెలంగాణకి వ్యవసాయ సంక్షోభం, తాగునీటి సంక్షోభం రాకుండా చూసుకోవచ్చు.

బోడి గుండుకు మోకాలికీ ముడి వేసినట్టు..

కానీ ముఖ్యమంత్రి మతిలేని మాటలు మాట్లాడుతూ తెలంగాణను కరువు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మేడిగడ్డకు, కన్నెపల్లికి లింకు పెట్టి బోడి గుండుకు మోకాలికీ ముడి వేసినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికే అన్నారం, సుందిళ్ల విషయంలో కూడా గ్రౌటింగ్ పూర్తయింది. అక్కడ సురక్షితంగా నీటిని నిల్వ చేసి వాడుకోవచ్చు అని ప్రభుత్వంలోని ఇంజినీర్లే స్పష్టం చేస్తున్నారు. అయినా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు.

మొన్న మేం కన్నెపల్లి వెళ్లి అక్కడ పారుతున్న లక్షల క్యూసెక్కుల నీటిని ప్రజలందరికీ చూపించాం. మేడిగడ్డ గేట్లు మూసి నీళ్లు ఎత్తాలని మేం ఏనాడు చెప్పలేదు. కన్నెపల్లి ద్వారానే భారీగా నీళ్లు ఎత్తిపోసుకోవచ్చని చెప్పిన విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి అచ్చోసిన ఆంబోతులా నోటికి వచ్చినట్లు రంకెలు వేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మాటల్లో పిచ్చి వాగుడు, వట్లు, తిట్లు తప్పించి ఇంకేమీ లేదు. తెలంగాణ ముంగిట నిలబడ్డది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అని కేటీఆర్ చెప్పారు.

మేడిగడ్డ గురించి, తెలంగాణ ప్రాజెక్టుల గురించి దారుణంగా మాట్లాడుతున్న దరిద్రపుగొట్టు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులు కొట్టుకుపోతాయంటూ సొంత ముఖ్యమంత్రి తన రాష్ట్ర ప్రాజెక్టుల గురించి దరిద్రంగా మాట్లాడుతున్నారు. కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రాజెక్టులను, నీళ్లు ఎలా నింపుకోవచ్చో ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డకు సంబంధమే లేని, ఎక్కడో సుదూరాన ఉన్న భద్రాచలం రాముడితో పాటు 44 ఊర్లు నిండిపోతాయని, మునిగిపోతాయని అబద్ధాలు చెప్తున్నాడు. ఇదే మేడిగడ్డ గత 500 సంవత్సరాలలో ఎప్పుడూ రానంత భారీగా 28.5 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా కొట్టుకుపోకుండా గట్టిగా నిలబడింది. అలాంటిది లక్ష క్యూసెక్కుల నీటిని తట్టుకోదు అని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు.

2022 నాటి వరద ఫోటోలు చూపించి కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిందని అబద్ధాలు చెప్తున్నారు. కన్నెపల్లి దగ్గర నీళ్లు లేకుంటే, మరి కిందికి పోతున్న ఆ నీటితోనే పక్క రాష్ట్రంలోని పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎలా పనిచేస్తుంది? వందల టీఎంసీలను ఎలా ఎత్తిపోస్తుందో రేవంత్ రెడ్డి చెప్పాలే. కేవలం తన తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడితే తన గురువుకి కోపం వస్తుందనే రేవంత్ రెడ్డి లేనిపోని అబద్ధాలు చెబుతున్నారు. భద్రాచలానికి ప్రమాదం ఉంది అంటే అది ముమ్మాటికి పక్క రాష్ట్రం కడుతున్న పోలవరంతోనే కానీ, కాళేశ్వరంతో కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పంప్ హౌస్‌లు ప్రారంభించి, నీళ్లను ఎత్తిపోయకుంటే రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు తిరగబడతారు.

వర్షాలు పడకున్నా గోదావరిలో నది నీళ్లు కిందికి పారుతున్నా పట్టించుకోకుండా కావాలనే రైతాంగంపై కుట్ర చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని ఇంకో రెండు, మూడు వారాలు చూసి పార్టీగా భారీ కార్యాచరణ ప్రకటిస్తాం అని కేటీఆర్ తెలిపారు.

హరీష్ రావు గారి గురించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. హరీష్ రావు కేసీఆర్ తయారు చేసిన క్రమశిక్షణ కలిగిన సైనికుడని, పార్టీ ప్రారంభం నుంచి ఆయనకి అండగా నిలబడ్డ నాయకుడ‌న్నారు. రేవంత్ రెడ్డి లాంటి పార్టీలు మారే వ్యక్తి ఇతరుల గురించి మాట్లాడడం సిగ్గుచేట‌న్నారు. పొద్దున లేస్తే కాంగ్రెస్ తో, అర్ధరాత్రి అయిన తర్వాత బీజేపీతో కలిసి ఉండే రేవంత్ రెడ్డి ఇతరుల గురించి మాట్లాడడం ఆపాలన్నారు. అర్ధరాత్రి కాగానే తనపై కేసుల భయంతో బీజేపీ కాళ్ళు పట్టుకునే రేవంత్ రెడ్డి ఇతర పార్టీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కేటీఆర్ హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement