త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malla Reddy | బీజేపీలోకి మ‌ల్లారెడ్డి..? ముహూర్తం ఫిక్స్‌

Malla Reddy | బీఆర్ఎస్ కీల‌క నేత మ‌ల్లారెడ్డి బీజేపీలో చేర‌నున్నారా..? అంటే అవున‌నే అంటున్నారు తెలంగాణ నేత‌లు. గత కొద్ది రోజులుగా బీఆర్ ఎస్ పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం.. పార్టీ పిలుపునిస్తున్న ఆందోళనల్లో పాలు పంచుకోకపోవడం ఈ రాజకీయ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. త్వ‌ర‌లోనే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు మ‌ల్ల‌న్న సిద్ధ‌మైన‌ట్లు టాక్‌. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందంటూ చ‌ర్చ న‌డుస్తోంది.

D

Telangana | Published On Jul 11, 2026, 3.42 pm IST

Malla Reddy | బీజేపీలోకి మ‌ల్లారెడ్డి..? ముహూర్తం ఫిక్స్‌
Advertisement
  • రంగం సిద్ధం చేసుకుంటున్న మల్లారెడ్డి
  • లక్ష మందితో సభకు ఏర్పాట్లు
  • ప్రధాని మోదీకి ఆహ్వానం
  • దేశ వ్యాప్తంగా విద్యాసంస్థల విస్తరణకు ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో చర్చలు
  • తిరుపతి, విజయవాడ, లక్నోల్లో కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు

మన రాష్ట్రంలో 12,760 గ్రామాలు ఉంటే.. మన కేసీఆర్ .. ప్రతి గ్రామానికి ట్యాంకరించిండు. నీళ్లిచ్చిండు. కరెంటిచ్చిండు. రైతు బంధు ఇచ్చిండు. రైతు బీమా ఇచ్చిండు. మంచి మంచి పార్కులు ఇచ్చిండు. గ్రామాలను అందంగా తీర్చిదిద్దిండు. అందుకే మళ్లీ బీఆర్ఎస్సే రావాలి. మళ్లీ మన కేసీయారే సీఎం కావాలె..అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.. 

ఏప్రిల్ 15న పీర్జాదిగూడలో బీఆర్ ఎస్ పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి

Malla Reddy | త్రినేత్ర.న్యూస్: "తెలంగాణ అంటేనే కేసీఆర్. కేసీఆర్ అంటేనే తెలంగాణ. చావు అంచు వరకు పోయి తెలంగాణ తెచ్చిన దేవుడు కేసీఆర్. కేసీఆర్ వంటి విజనరీ దేశంలోనే లేడు" అని ఎన్నో వేదికలపై పార్టీ పట్ల విశ్వాసాన్ని, అధినేతకు విధేయతను బహిరంగంగానే చాటుకున్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నారా? పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవి ఇచ్చిన పార్టీకి వీడ్కోలు పలుకుతున్నారా? గత కొద్ది రోజులుగా బీఆర్ ఎస్ పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం.. పార్టీ పిలుపునిస్తున్న ఆందోళనల్లో పాలు పంచుకోకపోవడం ఈ రాజకీయ ఊహాగానాలకు బలం ఇస్తున్నది. దీంతో మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.

ఢిల్లీ పర్యటన తర్వాత మారిన సీన్

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతి రెడ్డి తో గత ఏప్రిల్ 17న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. తమ విద్యాసంస్థల్లో జరిపే 150 ఏళ్ల వందేమాతరం ఉత్సవాలకు ప్రధానమంత్రిని ఆహ్వానించామని అంతకు మించి పెద్దగా రాజకీయ విశేషాలు లేవని ప్రీతిరెడ్డి మీడియాకు వెల్లడించారు. దీనిపై ఆ తర్వాత కూడా మల్లారెడ్డి పెద్దగా స్పందించలేదు. తిరిగి ఏప్రిల్ 24న ప్రీతిరెడ్డి.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి.. పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని కలిశారు. తమది కేవలం మర్యాద పూర్వక భేటీగానే చెప్పుకొచ్చారు. అయితే.. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మల్లారెడ్డి రాజకీయ శైలి మలుపు తిరిగింది. ఆ తర్వాత మల్లారెడ్డి ఏప్రిల్ 27న తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి హాజరయ్యారు. ఆ తర్వాత కేవలం ఒకట్రెండు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మే 10న ఆయన కొంతమంది కార్యకర్తలు పార్టీలో చేర్చుకున్నారు. అదే ఆయన చివరిసారిగా పాల్గొన్న పార్టీ కార్యక్రమం. అప్పటి నుంచి ఈ రో్జు వరకు ఆయన తెలంగాణ భవన్ లో అడుగు పెట్టింది లేదు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొన్నదీ లేదు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నివాసంలో గురువారం బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సర్..సమావేశానికి నగరానికి చెందిన అందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కానీ మల్లారెడ్డి మాత్రం ఈ సమావేశానికి రాలేదు. తలసాని శ్రీనివాస యాదవ్ స్వగృహం చేరుకోవడానికి మల్లారెడ్డి ఇంటి నుంచి పది నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. అయినా..మల్లారెడ్డి ఈ సమావేశానికి ఉద్దేశపూర్వకంగానే రాలేదని భేటీలో నేతలు చర్చించుకున్నారు.

ప్రధాన నగరాల్లో మెడికల్ కాలేజీలు..

వ్యాపార విస్తరణ, వారసత్వ శ్రేయస్సు కోసమే మల్లారెడ్డి మెలమెల్లగా
బీఆర్ ఎస్ కు దూరం అవుతున్నారనేది మేడ్చల్ రాజకీయ వర్గాల భోగట్టా. వ్యాపార విస్తరణ లో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మెడికల్ కాలేజీలు స్థాపించే వ్యూహంతో ముందుకు వెళుతున్నట్టు సమాచారం. అందుకు అవసరమైన అనుమతుల కోసం బీజేపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకే ప్రధానమంత్రి మోదీని కలిసినట్టు తెలుస్తున్నది. కాగా ఈ ఏడాది తిరుపతిలో ప్రారంభించిన కాలేజీకి నిన్ననే డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించింది. ఇటువంటివే మరో రెండు కాలేజీలు విజయవాడ, లక్నో నగరాల్లో నిర్మాణంలో ఉన్నాయి.

జమిలి ఎన్నికల్లో.. కోడలుకు ఎంపీ టికెట్

కాగా, వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డిని మేడ్చల్ శాసన సభ నియోజకవర్గం నుంచి.. కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డిని పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నిలబెట్టాలని భావిస్తున్నారు. తెలంగాణ శాసన సభ గడువు 2028 డిసెంబరులోనే ముగియనున్నా.. జమిలి ఎన్నికలు వస్తే గనుక 2029లోనే జరుగుతాయని మల్లారెడ్డి భావిస్తున్నారు.జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని.. అందువల్ల కుమారుడికి, కోడలికి బీజేపీ నుంచి టికెట్ ఇప్పించాలని ఆశిస్తున్నారు. రాజకీయాలకు శాశ్వతంగా వీడ్కలో పలకాలని భావిస్తున్నారు.

వచ్చే నెల ముహూర్తం

అయితే.. మల్లారెడ్డి ఆగస్టు నెలలో లక్ష మంది విద్యార్థులతో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి ప్రధాన మంత్రి మోదీ సమక్షంలో బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చేరికకు రావాల్సిందిగా మోదీకి ఆహ్వానం అందినా..ఆయన ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు.. బీఆర్ ఎస్ పార్టీ పనైపోయిందని ఇక ఆ పార్టీకి తాను దూరమైనట్టేనని మల్లారెడ్డి బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ విందులో తన అనుచరులతో మాట్లాడుతూ.. "బీఆర్ ఎస్ ఇక లేవదయ్యా. ఆ పార్టీ పనైపోయింది. జమిలి ఎన్నికలు వస్తే బీఆర్ ఎస్ కు ఓటు వెయ్యరు. బీజేపీకే వేస్తారు. కేసీఆర్ కూడా నాకు ఫోన్ చేస్తున్నడు. కానీ నేనే పోతలేను. రాజకీయాల్లో నైనా, వ్యాపారంలోనైనా ముందుచూపుతో వ్యవహరించాలి. అందుకే గెలిచే అవకాశాలు ఉన్న పార్టీలో చేరుతున్నా" అని ముచ్చటించినట్టు సమాచారం.

Also Read..

క్రికెట్ లీగ్ వేలంలో కీర్తి సురేష్ - కోట్లు కుమ్మ‌రించి ఆట‌గాళ్ల‌ను కొన్న మ‌హాన‌టి - అస‌లు క‌థ ఏంటంటే?

దేశంలోని ఇతర మెట్రో నగరాలను కాదని హైదరాబాద్‌లో సరికొత్త సెమీకండక్టర్ హబ్

చాట్‌జీపీటీ వాయిస్‌లో భారీ అప్‌డేట్.. ఇక మనిషిలా మాట్లాడే కొత్త మోడళ్లు..

Advertisement
Advertisement