త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | హ‌క్కుదారుల‌కు హామీ ఇస్తున్నా.. 22ఎ వ‌ల్ల‌ గ‌జం భూమిని కూడా పోనివ్వం

Ponguleti Srinivas Reddy | 22ఎ వ‌ల్ల నిజ‌మైన హ‌క్కుదారుల‌కు చెందిన గ‌జం భూమిని కూడా పోనివ్వ‌మ‌ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకున్నవారి భూమి నిషేధిత జాబితాలో ఉంటే మొదటి ప్రాధాన్యంతో పరిష్కరించి రిజిస్ట్రేషన్‌కు అవకాశం క‌ల్పిస్తామ‌ని చెప్పారు.

S

Telangana | Published On Aug 17, 2026, 7.48 pm IST

Ponguleti Srinivas Reddy | హ‌క్కుదారుల‌కు హామీ ఇస్తున్నా.. 22ఎ వ‌ల్ల‌ గ‌జం భూమిని కూడా పోనివ్వం
Advertisement
  • నిజ‌మైన హ‌క్కుదారుల‌కు న్యాయం చేసే బాధ్య‌త నాది
  • నిషేధిత జాబితాలో ఉంటే మొదటి ప్రాధాన్యంతో పరిష్కరిస్తాం
  • ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కానివ్వం
  • నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్థాయి క‌మిటీ వేస్తున్నం
  • అవ‌స‌ర‌మైతే స్లాట్ బుకింగ్‌ల సంఖ్య, కార్యాలయాల పని వేళలు పెంచుతాం
  • ఉన్న‌తాధికారుల సమీక్షా సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్ల‌డి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: 22ఎ వ‌ల్ల నిజ‌మైన హ‌క్కుదారుల‌కు చెందిన గ‌జం భూమిని కూడా పోనివ్వ‌మ‌ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకున్నవారి భూమి నిషేధిత జాబితాలో ఉంటే మొదటి ప్రాధాన్యంతో పరిష్కరించి రిజిస్ట్రేషన్‌కు అవకాశం క‌ల్పిస్తామ‌ని చెప్పారు. ఓవైపు ప్రభుత్వ భూములను ర‌క్షిస్తూ సామాన్యులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాన‌న్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి హామీ ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్న‌తాధికారులు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అధికారుల‌తో సోమ‌వారం నిర్వ‌హించిన‌ స‌మీక్షా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా 22ఎ స‌మ‌స్య‌లు, ప‌రిష్కార మార్గాల‌పై దిశానిర్దేశం చేశారు.

ప్ర‌జ‌ల‌ను కార్యాల‌యాల చుట్టూ తిప్పొద్దు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారిగా ఉంటుంది. 22ఎ ను భూతంగా చూపించి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదు. 22ఎ కు సంబంధించి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, ఈ నెలాఖరులోగా పరిష్కరించాలి. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారం ఎవరికీ లేదు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం, కావాలని జాప్యం చేయడం, చిన్న సమస్యను పెద్ద సమస్యగా మారిస్తే ఇకపై సహించేది లేదు. ప్రజల సమస్యను పరిష్కరించడం అధికారులుగా మీ బాధ్యత.

నిజమైన భూ హక్కుదారుడికి న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కదానిని అధికారులు నిర్లక్ష్యం చేసినా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. 22ఎ లో భూమి ఉందనే ఒక్క కారణంతో ప్రజలను తిరస్కరించకూడదు. ఆ భూమి ఎందుకు నిషేధిత జాబితాలోకి వచ్చింది, సంబంధిత రికార్డులు ఏమి చెబుతున్నాయో, వాస్తవ పరిస్థితి ఏమిటో సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.

సబ్ రిజిస్ట్రార్‌లకు పహాణి యాక్సెస్ ఇచ్చాం..

ఇప్పటివరకు మొత్త 757 మంది 22ఎ కు సంబంధించి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఇప్పటికే భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ఇచ్చిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్‌, లేఅవుట్‌ అనుమతులు తదితర రికార్డులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. సబ్ రిజిస్ట్రార్‌లకు పహాణి యాక్సెస్ కూడా ఇచ్చాం. రికార్డులను పరిశీలించి జెన్యూన్‌ కేసులను వెంటనే పరిష్కరించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇందుకోసం అవసరమైతే స్లాట్ బుకింగ్‌ల సంఖ్య పెంచాలి. కార్యాలయాల పని వేళలు కూడా పెంచాలి.

సామాన్యులు ఇబ్బంది ప‌డింది వాస్త‌వం..

రిజిస్ట్రేషన్‌ చేయడానికి అవకాశం లేని కేసుల్లో ఎందుకు చేయలేమో ప్రజలకు స్పష్టమైన కారణం చెప్పాలి. రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించినట్లయితే నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించాలి. గ‌తంలో హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో అప్ప‌ట్లో అధికారులు నిషేధిత భూముల జాబితా నుంచి తొల‌గించిన భూముల వివ‌రాల‌ను వ‌దిలేయ‌డంతో అవి నేటికీ కొన‌సాగుతూ నిషేధిత జాబితాలో ఉండిపోయినందున అధికారుల చ‌ర్య‌ల‌తో సామాన్యులు కూడా ఇబ్బందిప‌డ్డ మాట వాస్తవం.

భూదాన్, దేవాదాయ, ఫారెస్ట్ భూముల పక్కన ఉండి ఒకే సర్వే నంబర్ ఉండటం వల్ల కూడ కొన్ని ప్రైవేటు భూములు నిషేధిత జాబితాల్లోకి వెళ్లాయి, వాటి గుర్తించి క్లియర్ చేస్తాం. ఇద్దరు అధికారులతో ఈ 22ఎ సమస్యను మొత్తాన్ని పరిష్కరించేలా ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నాం. సందేహాల నివృత్తి కోసం, సమ‌స్యలు తెల‌ప‌డానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ 18005994788 నంబరు ఏర్పాటు చేశాం అని మంత్రి పొంగులేటి స్ప‌ష్టం చేశారు.

ఈ స‌మీక్ష‌లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌లు, అడిషనల్ కలెక్టర్‌లు, ఆర్డీవో, సబ్ రిజిస్టర్‌లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement