Suryapeta | సూర్యాపేట : తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. చివ్వెంల మండల పరిధిలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 500 మీటర్ల వరకు శకలాలు ఎగిరి పడ్డాయి. అధిక పీడనం కారణంగా హైడ్రాలిక్ ప్రెజర్ ట్యాంక్ పేలిపోయిందని పోలీసులు నిర్ధారించారు. ఈ పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ ఆస్తి నష్టం భారీగా సంభవించింది. పేలుడు సంభవించిన సమయంలో ఆ ప్రాంతంలో కార్మికులు ఎవరూ లేరు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పేలుడు నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిమెంట్ ఫ్యాక్టరీని అక్కడ్నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.