త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Damodar Rajanarasimha | హైద‌రాబాద్‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ మెడిక‌ల్ టూరిజం ఈవెంట్ : మంత్రి రాజ‌న‌ర్సింహ‌

Damodar Rajanarasimha | జూన్‌లో హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. విదేశీ ప్రతినిధులు పాల్గొనే కార్యక్రమంతో నగరాన్ని గ్లోబల్ మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముంద‌డుగు వేస్తున్న‌ట్లు మంత్రి రాజ‌న‌ర్సింహ వెల్ల‌డించారు.

P

Telangana | Published On Apr 28, 2026, 6.37 pm IST

Damodar Rajanarasimha | హైద‌రాబాద్‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ మెడిక‌ల్ టూరిజం ఈవెంట్ : మంత్రి రాజ‌న‌ర్సింహ‌
Advertisement

Damodar Rajanarasimha | ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో జూన్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో ఆరోగ్య, పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మెడికల్ టూరిజం అభివృద్ధి, అమలు చేయాల్సిన చర్యలు, కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా చర్చించారు. పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు.

ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించాలి..

ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించాలని, దేశ, విదేశీ వైద్య, ఫార్మా రంగ ప్రముఖులను ఈవెంట్‌లో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు నిమ్స్, టిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రతినిధులు సందర్శించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అలాగే టిమ్స్ ఆసుపత్రుల్లో ఇంటర్నేషనల్ పేషెంట్ సర్వీసెస్ విభాగాలను ఏర్పాటు చేయాలని, ప్రతి ఆసుపత్రిలో 50 పడకలతో ప్రత్యేక అంతర్జాతీయ రోగుల వార్డులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. విదేశీ రోగుల రాకతో ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదాయం పెరిగి, సేవల నాణ్యత మరింత మెరుగవుతుందని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ప్రతి ఏడాది కనీసం ఒక అంతర్జాతీయ మెడికల్ టూరిజం ఈవెంట్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

నర్సింగ్ ఆఫీసర్ల నియామకాలు మే 12న

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ పూర్తయినట్లు మంత్రి తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నియామక పత్రాలు అంద‌జేస్తామ‌న్నారు. ఈ మేర‌కు ఏర్పాట్లు చేయాల‌ని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న వివిధ పోస్టుల భర్తీపై కూడా సమీక్ష జరిగింది. వచ్చే నెల 15 నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఫార్మసిస్ట్, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో ఉన్న లీగల్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. గత రెండేళ్లలో సుమారు 12,650 పోస్టులు భర్తీ చేసినట్లు అధికారులు వెల్లడించగా, మిగిలిన నియామకాలు పూర్తయితే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement