త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India GDP Growth | భారత ఆర్థిక వృద్ధికి బ్రేకులు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతమే..

India GDP Growth | పశ్చిమాసియా సంక్షోభం, ద్రవ్యోల్బణం, రూపాయి బలహీనత, వ్యవసాయంపై ఎల్‌నినో ప్రభావం వంటి ప్రతికూలతల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 6.8 శాతానికి పరిమితం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.6 శాతం వృద్ధితో పోలిస్తే ఇది తక్కువ.

S

Business | Published On Aug 18, 2026, 5.31 pm IST

India GDP Growth | భారత ఆర్థిక వృద్ధికి బ్రేకులు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతమే..
Advertisement

India GDP Growth | పశ్చిమాసియా సంక్షోభం, ద్రవ్యోల్బణం, రూపాయి బలహీనత, వ్యవసాయంపై ఎల్‌నినో ప్రభావం వంటి ప్రతికూలతల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 6.8 శాతానికి పరిమితం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.6 శాతం వృద్ధితో పోలిస్తే ఇది తక్కువ. ఈ మేరకు ఒక ప్ర‌క‌ట‌న‌లో వివ‌రాల‌ను వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇండియా రేటింగ్స్ గతంలో మే నెల‌లో అంచనా వేసిన 6.7 శాతం వృద్ధి రేటును స్వల్పంగా పెంచి 6.8 శాతంగా అంచనా వేసింది. దేశీయ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం కొనసాగుతోందని పేర్కొంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల ప్రారంభంలో 2026-27 వృద్ధి అంచనాను 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. తాజాగా ఇండియా రేటింగ్స్ అంచనా ఆర్బీఐ అంచనా కంటే కూడా కొద్దిగా ఎక్కువగా ఉంది.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌ల అంచ‌నాలు..

ఫిచ్ గ్రూప్‌కు చెందిన ఇండియా రేటింగ్స్, 2026-27 ఆర్థిక సంవత్సరంలో సగటు ముడి చమురు ధర అంచనాను బ్యారెల్‌కు 95 అమెరికన్ డాలర్ల నుంచి 85 డాలర్లకు తగ్గించింది. అలాగే రూపాయి-డాలర్ మారకం రేటు సగటున 93.98గా ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంచనా వేసింది. మే నెల‌లో వేసిన 94.28 అంచనాతో పోలిస్తే ఇది మెరుగైన స్థాయి అయినప్పటికీ, ఏడాది ప్రాతిపదికన రూపాయి విలువ 6.4 శాతం తగ్గే అవకాశం ఉందని తెలిపింది. విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ బ్యాంకు డిపాజిట్లు, బాహ్య వాణిజ్య రుణాల ద్వారా సుమారు 70 బిలియన్ అమెరికన్ డాలర్ల మూలధన ప్రవాహాలు వస్తాయని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికాల వారీగా స్థూల దేశీయోత్పత్తి వృద్ధి ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6.9 శాతం, జూలై-సెప్టెంబర్‌లో 6.6 శాతం, అక్టోబర్-డిసెంబర్‌లో 6.7 శాతం, జనవరి-మార్చిలో 6.9 శాతంగా ఉంటుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. ఇదే కాలాలకు రిజర్వ్ బ్యాంక్ అంచనాలు వరుసగా 7, 6.4 శాతం, 6.5, 6.8 శాతంగా ఉన్నాయి.

ఎల్‌నినోతో క‌ష్ట‌మే..

ఇండియా రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్, పబ్లిక్ ఫైనాన్స్ హెడ్ దేవేంద్ర పంత్ మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో భారత బాస్కెట్ ముడి చమురు ధర సగటున బ్యారెల్‌కు 101.31 డాలర్లుగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు ఈ సగటు 96.49 డాలర్లుగా నమోదైందన్నారు. 2026-27లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 85 డాలర్లుగా ఉంటుందని తమ అంచనా అని దేవేంద్ర పంత్ తెలిపారు. చమురు ధరలు తగ్గడం వల్ల వాణిజ్య లోటు, కరెంట్ అకౌంట్ లోటు తగ్గి భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూల ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అయితే ఎల్‌నినో కారణంగా ద్రవ్యోల్బణం పెరిగితే, తక్కువ చమురు ధరల వల్ల లభించే వృద్ధి ప్రయోజనం పరిమితం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వివరించారు.

ద్ర‌వ్య‌లోటును పూడ్చలేరా..

2026-27 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.9 శాతంగా ఉంటుంద‌ని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. 2025-26లో నమోదైన 2 శాతంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల కాగా ఇదే సమయంలో కరెంట్ అకౌంట్ లోటు స్థూల దేశీయోత్పత్తిలో 0.6 శాతం నుంచి 1.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించిన 4.3 శాతం ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధించడం కూడా కష్టతరంగా ఉంటుంద‌ని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. వంటగ్యాస్, ఎరువులపై సబ్సిడీల భారం దీనికి ప్రధాన కారణమని తెలిపింది. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు, పన్నేతర ఆదాయం లక్ష్య సాధనకు సహాయపడతాయ‌ని దేవేంద్ర పంత్ అన్నారు. అయితే పరోక్ష పన్నుల వసూళ్లు మాత్రం సవాళ్లు సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement