త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shiva Temple | యంగ్ ఇండియా స్కూల్ కోసం.. 800 ఏండ్ల నాటి చారిత్ర‌క శివాల‌యం నేల‌మ‌ట్టం..

Shiva Temple | రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజ‌ర్ (Congress Govt) పాల‌న సాగిస్తున్న‌ది. హైడ్రా పేరుతో హైద‌రాబాద్‌లో పేద‌ల ఇండ్ల‌ను కూల్చివేస్తున్న ప్ర‌భుత్వం.. ఆల‌యాల‌ను వ‌దిలిపెట్ట‌డం లేదు. ఓవైపు మూసీ నది తీరంలో ఉన్న ఓంకారేశ్వర ఆలయాన్ని(Omkareshwara temple) వంద‌ల కోట్ల‌తో పునరుద్ధరిస్తున్న‌ స‌ర్కార్‌..  మరోవైపు, కాకతీయ సామ్రాజ్య (Kakatiya dynasty) వైభవానికి ప్ర‌తీక‌గా నిర్మించిన 800 ఏండ్ల‌ నాటి ఒక శివాల‌యాన్ని (Shiva Temple) నేలమట్టం చేసింది.

G

Telangana | Published On May 6, 2026, 8.02 am IST

Shiva Temple | యంగ్ ఇండియా స్కూల్ కోసం.. 800 ఏండ్ల నాటి చారిత్ర‌క శివాల‌యం నేల‌మ‌ట్టం..
Advertisement

Shiva Temple | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజ‌ర్ (Congress Govt) పాల‌న సాగిస్తున్న‌ది. హైడ్రా పేరుతో హైద‌రాబాద్‌లో పేద‌ల ఇండ్ల‌ను, రోడ్‌సైడ్ చిన్న‌చిన్న‌ దుకాణాల‌ను ఎడాపెడా కూల్చివేస్తున్న ప్ర‌భుత్వం.. ఆల‌యాల‌ను వ‌దిలిపెట్ట‌డం లేదు. అభివృద్ధిపేరుతో పురాత‌న శివాల‌యాన్ని కూల్చివేసింది. ఓవైపు మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలోని మూసీ నది తీరంలో ఉన్న ఓంకారేశ్వర ఆలయాన్ని(Omkareshwara temple) వంద‌ల కోట్ల‌తో పునరుద్ధరిస్తున్న‌ది. మరోవైపు, వరంగల్ జిల్లాలో కాకతీయ సామ్రాజ్య (Kakatiya dynasty) వైభవానికి ప్ర‌తీక‌గా నిర్మించిన 800 ఏండ్ల‌ నాటి ఒక శివాల‌యాన్ని (Shiva temple) నేలమట్టం చేసింది.

వందల ఏండ్లు, భీకర వరదలను తట్టుకొని సగర్వంగా నిలబడిన 13వ శ‌తాబ్దానికి చెందిన‌ మట్టికోట.. దాని మధ్యన ఉన్న శిథిలావస్థకు చేరిన శివాలయం ఇప్పుడు ఆనవాళ్లు కోల్పోయింది. వరంగల్ (Warangal) జిల్లా ఖానాపూర్‌ మండలం అశోక్‌నగర్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నారు. దీనికి మార్గం సుగ‌మం చేయ‌డానికి రాష్ట్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న 800 ఏండ్లనాటి ఈ కాకతీయ కట్టడ్డాన్ని జేసీబీల‌తో పూర్తిగా ఆన‌వాళ్లు లేకుండా చేసింది. ఓరుగ‌ల్లుగా ప్ర‌సిద్ధి చెందిన వ‌రంగ‌ల్‌లో కాకతీయ పాలకుడు గణపతి దేవుని హయాంలో క్రీ.శ. 1199 నుంచి 1262 మధ్య కాలంలో ఈ శివాల‌యాన్ని నిర్మించారు.

అసలేం జరిగిందంటే..

అశోక్‌నగర్‌లో సైనిక్‌స్కూల్‌ను (Sainik School) ఆనుకొని ఉన్న స్థలంలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ను (Young India Integrated School) నిర్మించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీంతో అధికారులు సైనిక్‌స్కూల్ ప‌రిస‌రాల‌లోని 20 ఎకరాల స్థలాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు కేటాయించారు. ఆ స్థలంలోనే 800 ఏండ్ల క్రితం కాకతీయులు నిర్మించిన శివాలయం ఉన్నది. దాని చుట్టూ మట్టికోట ఉన్నది. అది కేవలం శివాలయమే కాకుండా కాకతీయ చరిత్ర, వారసత్వ సంపదకు నెలవైన శిల్పరీతులు, ఘనమైన వారసత్వానికి ప్రతీకగా ప్రతాపరుద్రుడు వేయించిన శాసనం (చరిత్రకారులు దీన్ని అశోక్‌నగర్‌ శాసనంగా రికార్డు చేశారు) ఉంది. అయితే ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణంలో భాగంగా చారిత్ర‌క క‌ట్ట‌డంతోపాటు శిల్ప సంపద, ఘనమైన వారసత్వ కట్టడాన్ని బుల్డోజ‌ర్లు ఆనవాళ్లు లేకుండా చేశాయి.

ఈ పాపం ఎవ‌రిది?

కాకతీయ శిల్పకళా సౌరభానికి, తెలంగాణ ఘనమైన వారసత్వ కొనసాగింపునకు ఆన‌వాలుగా నిలిచిన‌ నిర్మాణం నేలమట్టమ‌వ‌డంతో చరిత్రకారులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. నిర్మాణానికి ప్రతిపాదించిన పాఠశాల ప్రాంగణంలో ఈ ఆలయం ఉండటంతో వ‌చ్చిన ఇబ్బంది ఏంట‌ని కొత్త తెలంగాణ చ‌రిత్ర బృందం స‌మ‌న్వ‌య‌క‌ర్త ఎస్ హ‌ర‌గోపాల్ ప్ర‌శ్నించారు. చారిత్రక కట్టడాన్ని ఎందుకు కూల్చివేశార‌ని, ఈ పాపం ఎవరిద‌ని ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు.

ఆలయంలో లభించిన శిలాశాసనాల్లో గణపతి దేవుడిని `మహారాజు`గా అంటే రాజులకే రాజుగా పేర్కొన్నారని చెప్పారు. కళాత్మకంగా చెక్కబడిన స్తంభాలు, ఇతర నిర్మాణాలతో కూడిన ఆ శాసనాల‌ను నిర్మించడానికి, తీర్చిదిద్దడానికి ఏండ్ల‌ తరబడి సమయం పట్టి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అవి ఒక బుల్డోజర్ దెబ్బకు ఒక్క రోజులోనే నేలమట్టమైయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అవన్నీ శిథిలాల కింద కూరుకుపోయాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement