త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Toll charges | మారిన టోల్‌చార్జీలు.. విజ‌య‌వాడ రూట్‌లో త‌గ్గింపు.. వరంగ‌ల్ మార్గంలో పెంపు

Toll Charges | హైద‌రాబాద్-విజ‌య‌వాడ హైవేపై టోల్ రుసుముల‌ను (Toll Charges) త‌గ్గించిన జాతీయ ర‌హ‌దారుల సంస్థ (NHAI), తెలంగాణ‌లోని హైదరాబాద్‌-వరంగల్, జనగామ-సూర్యాపేట రూట్‌లో రుసుముల‌ను (Charges Changed) పెంచింది.

G

Telangana | Published On Apr 1, 2026, 11.48 am IST

Toll charges | మారిన టోల్‌చార్జీలు.. విజ‌య‌వాడ రూట్‌లో త‌గ్గింపు.. వరంగ‌ల్ మార్గంలో పెంపు
Advertisement

Toll Charges | త్రినేత్ర‌.న్యూస్‌: జాతీయ ర‌హ‌దారుల కేటాయింపుపై వివ‌క్ష చూపుతున్న కేంద్ర‌ప్ర‌భుత్వం.. తాజాగా టోల్ ప్లాజా చార్జీల (Toll Charges) వ‌సూళ్ల‌లోనూ తేడా చూపిస్తున్న‌ది. అత్య‌ధిక ర‌ద్దీ ఉండే హైద‌రాబాద్-విజ‌య‌వాడ హైవేపై టోల్ రుసుముల‌ను త‌గ్గించిన జాతీయ ర‌హ‌దారుల సంస్థ (NHAI), తెలంగాణ‌లోని హైదరాబాద్‌-వరంగల్, జనగామ-సూర్యాపేట మార్గంలో రుసుముల‌ను (Charges Changed) పెంచింది. మారిన ధరలు బుధవారం నుంచే అమల్లోకి వ‌చ్చాయి. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్‌–విజయవాడ రూట్‌లో టోల్‌ చార్జీలు తగ్గడంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి, సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఇబ్రహీంపట్నం మండలం చిల్లకల్లు టోల్‌ప్లాజాల మీదుగా ప్రయాణించే వాహనదారులకు లబ్ధి చేకూరుతున్న‌ది.

ఈ త‌గ్గింపు పంతంగి టోల్‌ప్లాజా వ‌ద్ద మాత్రే ఉన్నది. మిగిలిన చోట్ల ఎలాంటి మార్పూలేదు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద త్రీ యాక్సల్‌ వాహనాలకు మాత్రమే ఇరువైపులా రూ.5 తగ్గనుండ‌గా, మిగిలిన వాహనాలకు తగ్గింపు చేయలేదు. దీంతో త్రీ యాక్సల్‌ వాహనాలకు ఒక వైపునకు రూ.290 నుంచి రూ.285కు, ఇరువైపులా రూ.435 నుంచి రూ.430 తగ్గింది. ఇక కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద కూడా కేవలం త్రీ యాక్సస్‌ వాహనాలకే రూ.5 కోత విధించారు. ఇక్కడ ఒకవైపునకు రూ.450 నుంచి రూ.445కు, రెండు వైపులా రూ.675 నుంచి రూ.670కు తగ్గింది. అదేవిధంగా ఏపీలోని చిల్లకల్లు వద్ద కారు, జీపు, వ్యాను, లైట్‌ మోటారు వాహనాలకు రూ.5 తగ్గించారు.

వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై యాద్రాద్రి జిల్లా బీబీనగర్‌ మండలంలోని గూడూరు, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్‌ ప్లాజాల వద్ద కారు, జీపు, వ్యాన్, లైట్‌ మోటార్‌ వాహనాలకు ఒకవైపునకు రూ.5 చొప్పున‌ పెరిగింది. లైట్‌ కమర్షియల్‌ వాహనం, లైట్‌ గూడ్స్‌ వాహనం, మినీ బస్సు సింగిల్‌ జర్నీకి రూ.5పెరగ్గా, రిటర్న్‌ జర్నీకి రూ.10 అధిక‌మ‌యింది. బస్సు, ట్రక్కుకు ఒకవైపునకు రూ.15, త్రీ యాక్సల్‌ కమర్షియల్‌ వాహనం ఒక వైపు రూ.10, రిటర్న్‌ జర్నీకి రూ.15 చొప్పున‌ పెరిగింది. భారీ వాహనాలకు ఒక వైపునకు రూ.20 పెరగ్గా, తిరుగు ప్ర‌యాణానికి రూ.25 అధిక‌మ‌యింది.

జనగామ –సూర్యాపేట రహదారిలో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి ప్లాజా వద్ద రూ.5 నుంచి రూ.10 వరకు టోల్‌ చార్జీలు పెరిగాయి. కార్లు, లైట్‌ కమర్షియల్‌ వాహనాలకు ఎలాంటి మార్పు లేదు. బస్సు, ట్రక్కు వాహనాలకు రూ.5 చొప్పున‌ పెంచారు. తిరుగు ప్ర‌యాణంలో కూడా రూ.5 పెరిగింది. త్రీ యాక్సల్‌ కమర్షియల్‌ వాహనానికి ప్రస్తుతం రూ.135కి రూ.140 పెరగగా, రిటర్న్‌ జర్నీకి రూ.5, ఫోర్‌ టూ సిక్స్‌ యాక్సల్స్‌ వాహనాలకు ప్రస్తుతం రూ.295 నుంచి రూ.300కు పెరగగా రిటర్న్‌ జర్నీకి రూ.5, సెవన్‌ టూఓహెచ్‌సీ వాహనాలకు ప్రస్తుతం రూ.240 ఉండగా రూ.245కి, రిటర్న్‌ జర్నీకి రూ.355 నుంచి రూ.365కి పెరిగింది.

మంచిర్యాల–చంద్రాపూర్‌ జాతీయ రహదారిపై మంచిర్యాల జిల్లా మందమర్రి, ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండల సరండి టోల్‌ ప్లాజాల్లో గతేడాదితో పోలిస్తే కనీసం రూ.5 నుంచి నెలవారీ పాస్‌లపై గరిష్టంగా రూ.25 చొప్పున తగ్గాయి. ఒకవైపు రాకపోకలు సాగించే మినీ వాహనాలకు ఒకవైపు జర్నీకి రూ.150 ఉండగా రూ.145కు తగ్గించారు.

 

Advertisement
Advertisement