త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | స్కీముల‌న్ని ఎగ్గొట్టిన ముఖ్య‌మంత్రిని.. ఎగ‌వేత‌ల రేవంత్‌రెడ్డి అని పిలుద్దాం..

Harish Rao | దేవుని సాక్షిగా రుణమాఫీ, పెన్షన్లు, స్కీములన్నీ ఎగ్గొట్టిన ముఖ్యమంత్రిని ఇకపై ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుద్దామ‌ని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ త‌న్నీరు హ‌రీశ్‌రావు పిలుపునిచ్చారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా మాన‌కొండూర్ మండ‌లం అల్గునూర్‌లోని లక్ష్మీనరసింహ గార్డెన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.

P

Telangana | Published On Jun 16, 2026, 3.56 pm IST

Harish Rao | స్కీముల‌న్ని ఎగ్గొట్టిన ముఖ్య‌మంత్రిని.. ఎగ‌వేత‌ల రేవంత్‌రెడ్డి అని పిలుద్దాం..
Advertisement
  • గురుకులాల్లో రూ.2వేల‌కోట్ల కుంభ‌కోణం వాస్త‌వం
  • సొంత‌శాఖ‌ల టెండ‌ర్ల‌పై మంత్రుల‌కు అవ‌గాహ‌న లేదు
  • రైతు డిస్క‌మ్ పేరుతో ఉచిత విద్యుత్‌కు ఉరితాడు బిగించే కుట్ర‌
  • ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఆపి విద్యార్థుల జీవితాలు ఆగం
  • బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు

Harish Rao | దేవుని సాక్షిగా రుణమాఫీ, పెన్షన్లు, స్కీములన్నీ ఎగ్గొట్టిన ముఖ్యమంత్రిని ఇకపై ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుద్దామ‌ని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ త‌న్నీరు హ‌రీశ్‌రావు పిలుపునిచ్చారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా మాన‌కొండూర్ మండ‌లం అల్గునూర్‌లోని లక్ష్మీనరసింహ గార్డెన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నేత‌లు నాయకులు జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ మానకొండూర్ కార్యకర్తలు తెలంగాణ ఉద్యమంలో ఊరూరా ఎంత అద్భుతంగా పోరాడారో నాకు తెలుసు. 2001లో పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే అన్ని జెడ్పీటీసీలు, ఎంపీపీలు గెలిచిన కరుడుగట్టిన కార్యకర్తలున్న గొప్ప నియోజకవర్గం ఇది. అధికారంలో ఉన్నా లేకపోయినా బ్రహ్మాండమైన బలగం ఉన్న పార్టీ మన బీఆర్ఎస్ అని తెలిపారు.

ఉద్దేశ‌పూర్వ‌కంగా కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు..

మన కార్యకర్తల మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారు. దేవేందర్, వేణు, రసమయి, సోషల్ మీడియా తమ్ముళ్లు సతీశ్‌, సది.. ఇలా అందరి మీద పదేళ్ల కిందటి కేసులు తీసి ఇబ్బంది పెడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఓటమి అంచున ఉండి, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నవాడు మాత్రమే కేసులు పెడతాడు. వాళ్లు ఎన్ని కేసులు పెడితే మన గెలుపు అంత దగ్గరికి వస్తున్నట్టు లెక్క అన్నారు. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు బీఆర్ఎస్ శ్మ‌శానానికి పోయింద‌ని, చచ్చిన పాము అంటుంటాడ‌ని.. ఈయన మొహానికి మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు కానీ బీఆర్ఎస్‌ను మొలకెత్తనియ్యనని ప్రగల్భాలు ప‌లుకుతున్నాడ‌ని మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి పతారా ఖతమైపోయింద‌ని, మొన్న వర్షాలు పడి ట్రాఫిక్ జామ్ అయితే నేను చెప్పినా ఏ ఆఫీసర్ వింటలేడు అని ముఖ్యమంత్రే స్వయంగా అంటున్నాడ‌ని విమ‌ర్శించారు. 'నీ పని అయిపోయింది. నువ్వు ఉండేది లేదని అధికారులకు అర్థమైంది కాబట్టే నీ మాట వినడం లేదు' అన్నారు.

రేవంత్ పాల‌న‌లో అన్నీ స్కాములే..

'రేవంత్ రెడ్డి పాలనలో స్కీములు లేవు, అన్నీ స్కాములే. సివిల్ సప్లై, సింగరేణి, కరెంటు, భూములు, చివరకి గురుకులాల్లో పిల్లలకు అన్నం పెట్టే ఉప్పు, పప్పు, కోడిగుడ్లలో కూడా స్కామే. కానీ. కేసీఆర్ పాలనలో మేనిఫెస్టోలో చెప్పకపోయినా కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతుబీమా ఇచ్చాం. గురుకులాల్లో 2000 కోట్ల స్కామ్ జరిగిందని నేను వాస్తవాలు మాట్లాడితే, మంత్రులు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ చేస్తున్నారు. బట్టలు, బూట్లకు 1200 కోట్లు, ఉప్పులు పప్పులు కోడిగుడ్లకు 800 కోట్లతో టెండర్లు పిలిచిన విషయమే సంబంధిత మంత్రులకు తెలవకపోతే నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. అనుముల వారి అన్నదమ్ములే ఈ టెండర్లన్నీ మింగుతున్నారు. కోటిమంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అన్నాడు కానీ ఎనుముల వారి నలుగురు అన్నదమ్ములు మాత్రమే కోటీశ్వరులు అయ్యారు. ఉపాధి హామీ కూలీలకు "ఇందిరమ్మ ఆత్మీయ భరోసా" కింద ఏడాదికి 12000 రూపాయలు ఇస్తామని మూడు బడ్జెట్లలో చదివారు. ఏ ఒక్క కూలీకి అయినా ఒక్క రూపాయి వచ్చిందా? బల్లలు కొట్టుడు తప్ప పేదవాడి కడుపు నిండింది లేదు' అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఖాజానా ఖాళీ అంటూ..

'ఖజానా ఖాళీ అంట‌డు. కానీ ఫ్యూచర్ సిటీలో 100 కోట్లతో, ఎంసీహెచ్ఆర్డీలో మరో 100 కోట్లతో క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి, సచివాలయంలో వాస్తు మార్పులకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. మెస్సీ ఫుట్‌బాల్ షోకులకు, మూసీ సుందరీకరణకు, ఇతర రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ ఎన్నికలకు ఫుల్ పేజీ యాడ్లు ఇవ్వడానికి, ఢిల్లీకి మూటలు పంపడానికి మాత్రం రేవంత్ రెడ్డికి వందల కోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయి? దేవుని మీద ఒట్టుపెట్టి ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవున్నే మోసం చేసిండు. 100 రోజుల్లో రూ.4000 పెన్షన్, రూ.2500 మహాలక్ష్మి ఎగబెట్టిండు. ఇవన్నీ ఎగ్గొట్టిన వాడిని ఎగవేతల రేవంత్ రెడ్డి అనక ఏమనాలి? ఈ మాట అన్నందుకే మానకొండూరు పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టి నోటీసులు పంపారు, అయినా బరాబర్ అంటాను. మృగశిర కార్తె వచ్చినా కళ్లాల్లో వడ్లు కొంటలేరు, బస్తాలకు చెదలు పడుతున్నాయి. ఏడ పోయినా 5 కిలోల తరుగు పెడుతున్నారు.

మూడు రైతుబంధులు ఎగ్గొట్టిండు..

'రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏకంగా మూడు రైతు బంధులు ఎగబెట్టిండు. ఒకసారి పూర్తిగా ఎగబెట్టి 9000 కోట్లు, తర్వాత మూడు ఎకరాలకు ఇచ్చి 4000 కోట్లు, ఇప్పుడు రెండు ఎకరాలకు ఇచ్చి 6000 కోట్లు.. మొత్తం 19వేల కోట్ల రూపాయల రైతు బంధు బాకీ పడ్డాడు. ఈ బాకీ పడ్డ 19వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని మానకొండూరు గడ్డ మీద నుంచి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ రాగానే మళ్లీ పాతకాలం వచ్చింది. ఎరువులకు యాప్ పెట్టి పోలీస్ స్టేషన్లలో లైన్లు కట్టే పరిస్థితి తెచ్చారు. రైతు బీమాకు ఎల్ఐసీకి పైసలు కట్టక అది కూడా నాలుగు నెలలుగా బంద్ అయిపోయింది. పోయిన యాసంగి, ఈ యాసంగి కలిపి 2100 కోట్ల బోనస్ ఎగ్గొట్టి బోనస్ ను బోగస్ చేశారు. 24 గంటల కరెంటు పోయి ఇప్పుడు 9 గంటలకు వచ్చింది. ఇప్పుడు రైతు డిస్కమ్ అనే కొత్త భూతం తేబోతున్నారు. ఇది వస్తే పొద్దున ఎండ ఉన్నప్పుడు 7-8 గంటలు మాత్రమే పవర్ ఇస్తారు. కాంగ్రెస్ నాయకులు ఈఆర్సీ ముందు 3 గంటల కరెంట్ చాలు అంటున్నారు. ఈ రైతు డిస్కమ్ అమల్లోకి వచ్చిందంటే ఉచిత కరెంటుకు ఉరివేసినట్టే. కాంగ్రెస్ కు ఓటేసిన రైతులు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు' అని గుర్తు చేశారు.

విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తుండు

'ఫీజ్ రీయింబ‌ర్స్‌మెంట్ ఇయ్యక 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తున్నాడు. ఫీజులు రాక డిగ్రీలు, పీజీలు అయిపోయినా కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. కరోనా వచ్చినా, నోట్ల రద్దు జరిగినా మన 9న్నర ఏళ్లలో 19,500 కోట్ల రూపాయల ఫీజ్ రీయింబ‌ర్స్‌మెంట్ ఇచ్చాం. కానీ, రేవంత రెడ్డి వచ్చి మూడేళ్లు దగ్గరపడుతున్నా ఒక్క రూపాయి ఇయ్యలే. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల చదువులకు పైసలు ఇస్తే కమిషన్లు రావని, 10-15శాతం కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు మాత్రం కోట్లు బిల్లులు ఇస్తున్నాడు. ఎలక్షన్ల ముందు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాడు. బయట సభల్లో 68 వేలు ఇచ్చాం అని అబద్ధాలు చెప్తూ, అసెంబ్లీలో మాత్రం కేవలం 16,000 మాత్రమే ఇచ్చామని స్వయంగా ముఖ్యమంత్రే ఒప్పుకున్నాడు. కొత్త డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్ శాఖలో 19వేల‌ ఖాళీలు ఉన్నాయని చెప్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం కేవలం 5వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తా అంటున్నాడు. నిరుద్యోగులు దిల్ సుఖ్ నగర్, చిక్కడపల్లిలో ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కేసీఆర్ గారు ఒకేసారి 17,000 పోలీసు ఉద్యోగాలను నింపారు' అంటూ ధ్వ‌జ‌మెత్తారు హ‌రీశ్‌రావు.

అప్లికేష‌న్లు ఫ్రీ అన్న‌డు..

'ఎలక్షన్ల ముందు ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు ఫ్రీ అన్నాడు, అధికారంలోకి రాగానే 400 ఉన్న ఫీజును 800 చేసి డబుల్ బాదుడు బాదుతున్నాడు. నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశాడు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడంతో మానకొండూర్, అల్గనూర్, తిమ్మాపూర్ లాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. ఆఫీసుల్లో ఈగలు తోలుకుంటున్నారు, ప్లాటు అమ్ముకుందామన్నా కొనే దిక్కు లేదు. ఆర్టీఏ చార్జీలు పెంచిండు. మోటార్ సైకిల్‌కు 5000, పెద్ద బండికి 10వేలు, కారుకు 20వేల‌కు పెంచిండు. ఆడవాళ్లకు ఫ్రీ బస్సు అని చెప్పి మగోళ్లకు డబుల్ టికెట్ రేట్లు పెంచిండు. బీరు సీసాలకు పెంచిండు, రేపటి నుంచి క్వార్టర్ కు, విస్కీకి కూడా పెంచుతాడట. పెంచుడు, దంచుడు, కమిషన్లు కొట్టుడు తప్ప చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ హయాంలో తొమ్మిదేళ్లలో కొత్తగా 23 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం, మిడ్ మానేరును పూర్తి చేసి ముంపు బాధితులకు పరిహారం ఇచ్చాం. రేవంత్ రెడ్డి ఈ రెండున్నర ఏళ్లలో కనీసం రెండు ఎకరాలకైనా నీళ్లు ఇచ్చిండా?' అని ప్ర‌శ్నించారు.

25 నుంచి స‌ర్ కార్య‌క్ర‌మం..

ప్రతి 20 ఏళ్లకు ఒకసారి జరిగే ఓటర్ల సవరణ ప్రక్రియ SIR ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంద‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. 'గతంలో 2002లో ఈ స‌ర్ ప్రోగ్రాం జరిగింది కాబట్టి, 2002లో మీకు ఓటు హక్కు ఉందా లేదా అన్నది ప్రధానంగా చూసి ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తారు. అప్పటికే కుటుంబంలో ఓటు ఉంటే, మళ్లీ ఎలాంటి సర్టిఫికెట్లు, కాగితాలు అడగరు. జూన్ 25 నుంచి జూలై 25 వరకు అధికారుల బృందం డోర్ టు డోర్ సర్వే నిర్వహిస్తుంది. గ్రామాల్లో అంగన్‌వాడీ టీచర్లు, పట్టణాల్లో ఆర్‌పీలు బూత్ లెవెల్ ఆఫీసర్లుగా ఉంటారు. మండల స్థాయిలో ఎంఆర్ఓ, నియోజకవర్గ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ ప్రోగ్రాంకు ఇంచార్జీలుగా వ్యవహరిస్తారు. సర్వేలో భాగంగా ఇంటింటికి వచ్చి రెండు పేపర్లు ఇస్తారు. ఆ ఫారమ్ నింపి ఒకటి వాళ్లకు ఇచ్చి, ఇంకొకటి 'రిసీవ్డ్ కాపీ' కింద వాళ్ల సంతకం తీసుకొని ఆధారంగా మన దగ్గర భద్రంగా పెట్టుకోవాలి. ఒకవేళ 2002లో ఓటు లేకపోయినా, ఫ్యామిలీ గ్రూపింగ్ లో పేరు లేకపోయినా.. ఎస్ఎస్సీ సర్టిఫికెట్, పాస్పోర్ట్, కరెంటు బిల్లు లాంటి 10 రకాల ఆధారాల్లో ఏదైనా ఒకటి చూపిస్తే ఓటు నమోదు చేస్తారు' అని తెలిపారు.

వివ‌రాలు ఇవ్వాలి

చదువు, ఉద్యోగాల కోసం దుబాయ్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు, బంధువులు నేరుగా రావాల్సిన అవసరం లేకుండానే వారి వివరాలు అందించి ఓటు నమోదు చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. 'ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు ఇందులో అధికారికంగా భాగస్వామ్యం కల్పించింది. కాబట్టి మన బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు బీఎల్ఓల వెంట వెళ్లి ఓటర్లకు సహకరించాలి. ఓటర్లకు ఫామ్ నింపడం రాకపోతే లేదా చదువుకోకపోతే, మన పార్టీ ఏజెంట్లే స్వయంగా ఆ ఫారమ్స్ నింపి అధికారులకు అందజేయాలి. జూలై ఆఖరులో ఓటర్ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ వస్తుంది, ఆ తర్వాత అభ్యంతరాలు తెలపడానికి అవకాశం ఇస్తారు. ఒకవేళ తుది జాబితాలో ఓటు గల్లంతైతే కలెక్టర్ కు గానీ, రాష్ట్ర ఎన్నికల అధికారికి గానీ, అవసరమైతే హైకోర్టుకు గానీ వెళ్లి ఓటు హక్కు పొందే అవకాశం మనకు ఉంటుంది. మనకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. మన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడా గల్లంతు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లందరూ అత్యంత క్రియాశీలకంగా పనిచేయాలి' అని హ‌రీశ్‌రావు సూచించారు.

Advertisement
Advertisement