త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | నీటి పారుద‌ల‌శాఖ‌ను మూణ్నెళ్లు నాక‌ప్ప‌గించు

Harish Rao | మూడు నెలల పాటు నీటి పారుదల శాఖ బాధ్యతలు తనకు అప్ప‌గిస్తే రాష్ట్రానికి నీళ్లు తీసుకొచ్చి చూపిస్తానని.. ఒకవేళ అందులో విఫలమైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.

P

Telangana | Published On Jul 8, 2026, 5.03 pm IST

Harish Rao | నీటి పారుద‌ల‌శాఖ‌ను మూణ్నెళ్లు నాక‌ప్ప‌గించు
Advertisement
  • నీళ్ల తేక‌పోతే రాజ‌కీయ స‌న్యాసం
  • సీఎం రేవంత్‌కు హ‌రీశ్‌రావు స‌వాల్‌
  • గోదావ‌రి జ‌లాలు వృథా చేస్తున్న‌రు
  • దేవాదుల వ‌ద్ద మోటార్లు న‌డ‌పొచ్చు
  • మోటార్లు ఆన్ చేసేందుకు ప్ర‌భుత్వానికి నొప్పేంటీ?
  • సమ్మక్క బరాజ్‌పై అసెంబ్లీలో చ‌ర్చకు నేను సిద్ధం
  • చర్చకు అసెంబ్లీ పెడతారా? నేను సిద్ధంగా ఉన్నాను.
  • కాళేశ్వ‌రం అంటే మేడిగ‌డ్డ ఒక్క‌టే కాదు
  • అబద్ధాల పవర్ పాయింట్లతో బ‌ద్నాం చేయ‌డం మానాల‌ని హిత‌వు

Harish Rao | మూడు నెలల పాటు నీటి పారుదల శాఖ బాధ్యతలు తనకు అప్ప‌గిస్తే రాష్ట్రానికి నీళ్లు తీసుకొచ్చి చూపిస్తానని.. ఒకవేళ అందులో విఫలమైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టుపై మంగ‌ళ‌వారం చేసిన విమర్శలను, అబద్ధపు ప్రచారాన్ని ఆయ‌న ఖండించారు. తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలను, ఆధారాలను కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, రేవంత్ రెడ్డి అసమర్థతను ఎండగట్టారు.

గోదావ‌రి జ‌లాలు స‌ముద్రంలోకి వ‌దులుతున్న‌రు..

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గోదావరి జలాలను ప్రభుత్వం సద్వినియోగం చేసుకోకుండా వృథాగా సముద్రంలోకి వదులుతోందని ఆయన ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత నెలకొన్న సమయంలో కూడా తెలంగాణలో గోదావరి జలాలను వినియోగించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సమ్మక్క బ‌రాజ్ వ‌ద్ద ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నప్పటికీ, దేవాదుల ప్రాజెక్టు ద్వారా కేవలం 2,542 క్యూసెక్కుల నీటినే ఎత్తిపోస్తున్నారని విమర్శించారు. సమ్మక్క బ్యారేజి వద్ద 76 మీటర్ల ఎత్తులో నీరు ఉండగా, 71 మీటర్ల వద్దే దేవాదుల మోటార్లు నడిచే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని ఆన్ చేయకపోవడం క్రిమినల్ నిర్లక్ష్యమని ఆరోపించారు.

మోటార్లు ఆన్ చేయ‌డానికి ఇబ్బందేంటీ?

"బ్యారేజి కూలిపోలేదు కదా.. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి సిద్ధంగా ఉన్నా మోటార్లు ఆన్ చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఎవరికి గురుదక్షిణ చెల్లించేందుకు రైతుల పొలాలను ఎండబెడుతున్నారు?" అని ప్రశ్నించారు. గోదావరిలో వరద నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 75 నుంచి 80 శాతం చెరువులు ఎండిపోయాయని, అక్కడి ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సమ్మక్క బ్యారేజి అంశంపై అసెంబ్లీలో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వం చర్చ నిర్వహించాలంటూ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. "అబద్ధాలకు నోబెల్ బహుమతి ఉంటే అది రేవంత్‌రెడ్డికే వస్తుంది. ఆయన పేరును అనుముల రేవంత్‌రెడ్డికి బదులు 'అబద్ధాల రేవంత్‌రెడ్డి'గా మార్చుకుంటే సరిపోతుంది" అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ హ‌యాంలోనే వ‌చ్చాయ‌న‌డం అబ‌ద్ధం

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు కాంగ్రెస్ హయాంలోనే అనుమతులు వచ్చాయని ముఖ్యమంత్రి చెబుతున్నది పూర్తిగా అసత్యమని హరీశ్‌రావు అన్నారు. ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో సీడబ్ల్యూసీ అనుమతి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పనులు ప్రారంభం కాకుండానే సర్వేలు, మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరుతో రూ.2,328 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను నీటిపారుదల మంత్రిగా మహారాష్ట్రకు వెళ్లినప్పుడు, కాంగ్రెస్ హయాంలో అనుమతి ఇవ్వలేదని అక్కడి మంత్రి చెప్పారని గుర్తు చేశారు. అనంతరం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్, విద్యాసాగర్‌రావుతో కలిసి పలుమార్లు ప్రయత్నించినా 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌కు మహారాష్ట్ర అంగీకరించలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతున్నా తుమ్మిడిహెట్టి అంశంపై ఎన్ని సార్లు మహారాష్ట్రతో చర్చలు జరిపిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

సీఎం ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి..

తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత లేదని, కేవలం 102 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని సీడబ్ల్యూసీ లేఖ ద్వారా స్పష్టం చేసిందన్నారు. మహారాష్ట్ర 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌కు అనుమతి ఇచ్చినట్లు ఒక్క ఆధారం చూపినా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేకపోతే ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి అని, ఆ పార్టీ డీఎన్‌ఏలోనే అవినీతి ఉందని ఆరోపించిన హరీశ్‌రావు, అవినీతి గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్‌కోస్, రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీలు నీటి లభ్యతను అధ్యయనం చేసి మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మాణానికి అనుకూలంగా నివేదికలు ఇచ్చాయని తెలిపారు. కాళేశ్వరం కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రాజెక్టు అని, దీనికి 18 కేంద్ర సంస్థల నుంచి అనుమతులు లభించాయని చెప్పారు.

వ్య‌యం ఎందుకు పెంచారో స‌మాధానం చెప్పాలి

ప్రాజెక్టు ద్వారా నీటి వినియోగ సామర్థ్యం 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు, ఆయకట్టు 16 లక్షల ఎకరాల నుంచి 37 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. జలాశయాల నిల్వ సామర్థ్యం పెరగడం, భూసేకరణ వ్యయం అధికమవడంతో ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా పెరిగిందని వివరించారు. కొడంగల్-నారాయణపేట్ ఎత్తిపోతల పథకం వ్యయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1,400 కోట్ల నుంచి రూ.4,350 కోట్లకు ఎందుకు పెంచిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. "కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదు. మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల టన్నెల్లు, 1,531 కిలోమీటర్ల కాలువల సమాహారం" అని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రెండు పిల్లర్లు కుంగిపోతే, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయిందని, ఖమ్మం పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, వట్టెం పంప్‌హౌస్ మునిగిపోయిందని ఆరోపించారు. పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో చెక్‌డ్యామ్‌లను బాంబులతో పేల్చారని కూడా విమర్శించారు.

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల దొంగ‌నాట‌కాలు..

తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు, అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలిస్తామని ప్రభుత్వం చెబుతోందని, మరోవైపు సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు దెబ్బతిన్నాయని కూడా అదే ప్రభుత్వం చెబుతోందని గుర్తుచేశారు. ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని చెబుతూ వాటి ద్వారానే నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిన చంద్రశేఖర్ అయ్యర్ గతంలో పోలవరం ప్రాజెక్టు సీఈఓగా ఉన్నారని, అక్కడ డ్యామ్ పలుమార్లు దెబ్బతిన్నప్పటికీ ఎన్డీఎస్ఏ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి 31 నెలలు అవుతున్నా ఇప్పటివరకు మేడిగడ్డకు మరమ్మతులు ప్రారంభించలేదని విమర్శించారు. "ఇంకో ఏడాది అయితే నువ్వు గద్దె దిగడం ఖాయం, కేసీఆర్ సీఎం అవ్వడం ఖాయం. ఆ తర్వాత మేడిగడ్డను బాగు చేసి తెలంగాణకు నీళ్లు అందిస్తాం" అని వ్యాఖ్యానించారు.

నీళ్లు ఎలా తేవాలో చేసి చూపిస్తా..

గోదావరిలో నీళ్లు లేవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 7.5 టీఎంసీల నీరు వృథాగా పోతోందన్నారు. కన్నెపల్లి మోటార్లను ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించిన హరీశ్‌రావు, "నీకు కేసీఆర్ అవసరం లేదు.. నేను చాలు. నాకు మూడు నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగించు. నీళ్లు ఎలా తేవాలో చేసి చూపిస్తా. ఒకవేళ నీళ్లు తేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇందుకు నువ్వు సిద్ధమేనా?" అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హ‌రీశ్‌రావు సవాల్ విసిరారు.

Advertisement
Advertisement