త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET UG Results | నీట్ యూజీ ఫ‌లితాలు విడుద‌ల‌.. హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు

NEET UG Results | వైద్యవిద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ (యూజీ) రీ ఎగ్జామ్ ఫలితాల్లో (NEET UG Results) తెలంగాణ విద్యార్థులు స‌త్తా చాటాడు. హ‌నుమ‌కొండ‌కు (Hanumakonda) చెందిన వీర‌య్య‌గారి స‌హ్యు 705 మార్కుల‌తో జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు సాధించాడు.

G

Telangana | Published On Jul 17, 2026, 6.50 am IST

NEET UG Results | నీట్ యూజీ ఫ‌లితాలు విడుద‌ల‌.. హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు
Advertisement

NEET UG Results | త్రినేత్ర‌.న్యూస్‌: వైద్యవిద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ (యూజీ) రీ ఎగ్జామ్ ఫలితాల్లో (NEET UG Results) తెలంగాణ విద్యార్థులు స‌త్తా చాటాడు. హ‌నుమ‌కొండ‌కు (Hanumakonda) చెందిన వీర‌య్య‌గారి స‌హ్యు 705 మార్కుల‌తో జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు సాధించాడు. రాష్ట్రానికి చెందిన బూర సాయిచరణ్‌ 19వ ర్యాంకు, కందగట్ల అనిష్‌ 21, అందెం సాయిచరణ్‌రెడ్డి 38, మయూక్‌ జయసింహ 42, కొంపెల్ల సాయిగాయత్రి 83, రుతుంబిక మొహంతి 91వ ర్యాంకు సాధించ‌గా, దేవిష్‌ శ్రీగోపాల్‌ అగర్వాల్‌ 123వ ర్యాంకు పొందారు.

నీట్ యూజీ (NEET UG) ఫ‌లితాల‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) గురువారం రాత్రి విడుదల చేసింది. గ‌త నెల 21న నిర్వ‌హించిన ఈ ప‌రీక్ష‌కు దాదాపు 20 ల‌క్ష‌ల మంది హాజ‌రుకాగా 11.21 ల‌క్ష‌ల మంది అర్హ‌త సాధించారు. వీరిలో 58 శాతానికి పైగా అమ్మాయిలే ఉండ‌టం గ‌మ‌నార్హం. పంజాబ్‌కు చెందిన ఆర్య‌న్ గుప్తా, హ‌ర్యానాకు చెందిన ప‌న్‌శుల్ బ‌న్స‌ల్ 720కి 715 మార్కుల‌తో టాప‌ర్లుగా నిలవ‌గా, 19 మంది విద్యార్థులు 720 మార్కులకుగానూ 700 మార్కులు సాధించారు. అదేవిధంగా 1492 మంది​ 650పైగా మార్కులు, 10,160 మంది 600 అంతకంటే ఎక్కువ, 90,780 మంది 500ల‌కుపైగా స్కోర్ చేశారు. 690 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 138 మంది విద్యార్థుల్లో 93 శాతం మంది తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించినవారే. అలాగే, వీరిలో 99 శాతం మంది 17 నుంచి 19 సంవత్సరాల వయ‌స్కులే.

అత్య‌ధికులు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచే..

జాతీయ స్థాయిలో మొదటి 17 ర్యాంకుల్లో నిలిచిన టాపర్లు పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, తమిళనాడు, తెలంగాణకు చెందినవారు కావడం విశేషం. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 1.7 లక్షల మంది క్వాలిఫై కాగా, లక్షద్వీప్ నుంచి అత్యల్పంగా 43 మంది అర్హత సాధించారు. కేటగిరీల వారీగా చూస్తే.. జనరల్ కేటగిరీలో 2.91 లక్షల మంది, ఓబీసీ-ఎన్‌సీఎల్ కేటగిరీలో 5.12 లక్షల మంది, ఎస్సీ కేటగిరీలో 1.59 లక్షల మంది, ఎస్టీ కేటగిరీలో 63,716 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 95,026 మంది అభ్యర్థులు వైద్య కోర్సుల కౌన్సిలింగ్‌కు అర్హత సాధించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్ (neet.nta.nic.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

త్వ‌ర‌లో రాష్ట్ర ర్యాంకులు..

త్వరలో రాష్ట్ర ర్యాంకులను ప్రకటిస్తామ‌ని కాళోజీ వర్సిటీ వీసీ రమేశ్‌రెడ్డి వెల్ల‌డించారు. ఆలిండియా కౌన్సెలింగ్‌ తరువాత రాష్ట్రస్థాయిలో ఆగస్టులో కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 66 కాలేజీలు ఉన్నాయి. అందులో 36 ప్రభుత్వ, 30 ప్రైవేటు, 3 డీమ్డ్‌ యూనివర్సిటీలు, 4 మైనార్టీ కళాశాలు. అన్నిటిలో క‌లిపి మొత్తం 9,650 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement
Advertisement