త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran Delegations | సహకార రంగంపై ఇరాన్ ప్రతినిధి బృందం ఆసక్తి.. మంత్రి తుమ్మలతో చర్చలు

Iran Delegations | తెలంగాణలో సహకార రంగ అభివృద్ధి, రైతులకు అందిస్తున్న సేవలపై ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామితో కలిసి బుధవారం సచివాలయంలో ఇరాన్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.

P

Telangana | Published On Jul 16, 2026, 7.59 pm IST

Iran Delegations | సహకార రంగంపై ఇరాన్ ప్రతినిధి బృందం ఆసక్తి.. మంత్రి తుమ్మలతో చర్చలు
Advertisement

Iran Delegations | తెలంగాణలో సహకార రంగ అభివృద్ధి, రైతులకు అందిస్తున్న సేవలపై ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామితో కలిసి బుధవారం సచివాలయంలో ఇరాన్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఇరాన్ సహకార, కార్మిక, సామాజిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్ఈ డాక్టర్ మెయిదారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ సమావేశంలో పాల్గొంది. ఇరాన్ సహకార శాఖ ఉపమంత్రి డాక్టర్ సర్ఫీ, భార‌త్‌లోని ఇరాన్ రాయబారి డాక్టర్ మొహమ్మద్ ఫత్అలీ, హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సుల్ జనరల్ హమీద్ అహ్మదీయెహ్, వైస్ కాన్సుల్ మొహ్సిన్ మొఘద్దామి, ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి హషేమీ పాల్గొన్నారు.

సమావేశంలో తెలంగాణలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పనితీరు, సభ్యత్వ విస్తరణ, రైతులకు అందుతున్న సేవలు, సహకార రంగంలో రాష్ట్రం సాధించిన పురోగతిపై ప్రతినిధి బృందానికి వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి తెలిపారు. రైతు సంక్షేమ కార్యక్రమాల అమలులో సహకార సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

తెలంగాణలో అమలవుతున్న సహకార విధానాలు, సంస్థాగత సంస్కరణలు, సభ్యులకు అందుతున్న సేవలపై ఇరాన్ ప్రతినిధులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహకార రంగంలో ఇరు దేశాల మధ్య అనుభవాల మార్పిడి, భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునే అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి ఇరాన్ ప్రతినిధి బృంద సభ్యులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఇరాన్ ప్రతినిధులు మంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement